ᐅఅమృత సంస్కృతి

ᐅఅమృత సంస్కృతి 

భారతదేశం! పృథ్వికే గర్వకారణమైన పవిత్ర దేశం. ఆవిర్భావంలోనే 'ఆత్మస్పృహ' కలిగిన అపురూపమైన దేశం. ప్రతి భారతీయుడూ 'సామూహికంగా' గర్వించే ఏకైక కారణం తాను భారతీయుడనైనందుకు, భారతదేశంలో పుట్టినందుకు. అగ్నికి చెదలుపట్టినట్లుగా, బంగారానికి తుప్పు పట్టినట్లుగా ఇటీవలి కాలంలో 'ఆత్మస్పృహ' నుంచి ఆధునిక మకిలిని ఒంటబట్టించుకుని మన దేశ సంస్కృతి తాలూకు ఔన్నత్యానికి భంగకరంగా ప్రవర్తిస్తున్నాం. మన ప్రగతి పేరిట ప్రవర్తనగానీ, ఆధునికత పేరిట అపసవ్య విధానాలుగానీ భారతీయ సంస్కృతిని దెబ్బతీయలేవు. అది అమరం. అజరామరం. మనమే అమాయకమైపోతున్నాం. అన్యాయమైపోతున్నాం.
జీవితం అల్పమైంది. కానీ అపురూపమైంది. దాన్ని అమృతమయంగా తీర్చిదిద్దుకోవలసిన బాధ్యతే కాదు, అవసరమూ మనదే. మన శరీరం మలినమైతే నష్టమూ మనదే, నిర్మలం చేసుకోవలసిన అవసరమూ మనదే. అలాగే మనసు, జీవితం కూడా.

ఎలాంటి దేశం ఇది! అమృత భాండం ఇది! కామధేనువు ఇది! కల్పతరువు ఇది! అమ్మను అంగడి బొమ్మను చేసి నిలబెట్టినట్లు మన అవివేకంతో, అజ్ఞానంతో, శ్రుతిమించిన పాశ్చాత్యారాధనతో మనకు తెలీకుండానే భరతమాతను ఓ బీద, బేల, బలహీన భిక్షుకిలా ప్రపంచ దేశాల ముందు నిలబెడుతున్నాం. ఇంత దీనత, దయనీయత మనకవసరమా? ప్రపంచ దేశాల జాలి చూపుల మధ్యనా మన భరతమాతను మనం నిలబెట్టవలసినది! ఈ 'ఆధ్యాత్మిక అగ్నిశిఖ'ను అగ్నిపుల్లగా మార్చుకున్నందుకు మనం సిగ్గుపడవద్దా? మన విదేశీ సంస్కృతీ మమకారంవల్లే ఈ రోజు భారతదేశం అంటే బీద, అనాగరిక దేశంగా ముద్రవేసే స్థితిలోకి దిగజారిపోయాం. పూర్వం ఇదే భారతదేశం గురించి అదే విదేశీయులు 'నేను ప్రత్యక్షంగా చూడకపోయి ఉంటే భూమ్మీద ఇలాంటి దేశమొకటి ఉందంటే నమ్మలేకపోయి ఉండేవాడిని' అని రాసి ప్రపంచానికందించారు.

భారతదేశం! ఏముంది ఈ దేశంలో? ఏమిటీ దేశపు గొప్పతనం? ఏమిటీ బక్కచిక్కిన మనుషుల ఔన్నత్యం? ఇది మాటలకందని దేశం... పొగడ్తలకతీతమైన దేశం. ప్రశంసలకందనంత ఉన్నతమైన దేశం. ఐకమత్యం, సంస్కృతి, జ్ఞానం అనే త్రివేణీ సంగమ ప్రవాహం అంతర్వాహినిగా హుందాగా, నిగర్వంగా జీవనదిలా... ఆత్మప్రదక్షిగా తనలో తాను ప్రవహిస్తున్న ఈ సజీవ దేశాన్ని దాని మూలాలను కదిలించకుండా, దాని గాంభీర్యానికి అంతరాయం కలిగించకుండా, యథాతథంగా అర్థం చేసుకోవాలి. నిజానికి ఈ దేశపు పేరులోనే దాని 'సంస్కృతీ సర్వస్వం' ఇమిడి ఉంది. ఆత్మ యావత్తూ అమరి ఉంది. భారతదేశం ప్రకాశాన్ని ప్రేమించే దేశం. జ్ఞానాన్ని రమించే దేశం. ఈ దేశం ఒక వేదాదేశం. ఈ దేశం ఒక ఆధ్యాత్మికావేశం. ఈ దేశం ఒక పారమార్థికాకాశం. ఇక్కడ మౌనం మాట్లాడుతుంది. నిశ్శబ్దం నినదిస్తుంది. ధ్యానమే ధ్యేయమవుతుంది. జీవితం ధన్యమవుతుంది. అవును, ఇక్కడ జీవితమే ధన్యమవుతుంది. ఎందుకంటే... రాముడు నడయాడిన దేశం. కృష్ణుడు నాట్యమాడిన దేశం. బుద్ధుడు నడయాడిన దేశం. అంతేనా?! కౌపీన ధారణ కిరీట ధారణగా భావించే దేశం. కాషాయాంబరాన్ని పట్టు పీతాంబరంకన్నా మిన్నగా సంభావించే దేశం. పక్షి మాత్రానికి కండలు కోసి ఇచ్చిన దేశం. దేవతలడిగితే వెన్నుపూసే విరిచి ఇచ్చిన దేశం. ఆత్మతో జీవించే భారతీయుడికి దేహం తృణప్రాయం, మేరునగధీరుడిగా ధ్యానించే సాధకుడికి జీవితం మట్టికణప్రాయం. భారతీయుడు భోగి కాదు. త్యాగి... యోగి. వైరాగ్యాన్ని భాగ్యంగా భావించే విరాగి. అల్పమైన శరీరంతో అనల్పమైన, అనంతమైన ఆత్మను భావించిన, ధరించిన భారతీయ రుషి. మానవ జాతికే ఆ రుషి శేముషి.

జ్ఞానపరంగా, సంస్కృతిపరంగా ప్రపంచ దేశాలకే ఆచార్య స్థానంలో నెలకొని ఉంది భారతదేశం. ప్రపంచానికంతా భారతదేశం విశ్వవిద్యాలయం. విఖ్యాత విద్యాపీఠం. ఒక దేశ సంపదను ధనంతో కొలవరు. జ్ఞానంతో కొలుస్తారు. ఒక దేశ జనాభాను మనుషులతో లెక్కించరు. జ్ఞానులతో, మేధావులతో లెక్కిస్తారు. ఒక దేశ సంస్కృతిని సౌకర్యాలతో గుర్తించరు. సంస్కార సౌజన్యాలతో, ఆధ్యాత్మిక సంప్రదాయాలతో, ధీరోదాత్తులతో గుర్తిస్తారు. భారతదేశం అలాంటి సర్వ సంస్కృతీ సమ్మేళనంతో సుసంపన్నమై ఉంది. ఇక్కడి మనుషుల శిరీష కోమల హృదయాల్లో వజ్ర సదృశ సంకల్పాలు నెలకొని ఉంటాయి. నవనీత సమ విశ్వాసాల (సెంటిమెంట్స్)తో పాటు శిలాసదృశ ఆత్మవిశ్వాసాలూ ఆవేశించి ఉంటాయి. విచ్చుకత్తులకంటే ఆత్మశక్తే ఈ దేశపు జాతీయ ఆయుధం. ఇక్కడి శాంతవీరుల యుద్ధం బయటి వైరి వర్గాలతో కాదు. లోపలి అరిషడ్వర్గాలతో. బురదలో పుట్టిన కమలమే ఈ దేశపు ఆదర్శం. శాంతి ఈ దేశపు సామూహిక, సార్వకాలీన మంత్రం.

- చక్కిలం విజయలక్ష్మి