ᐅసమ్మక్క-సారలమ్మ జాతర



ᐅసమ్మక్క-సారలమ్మ జాతర 


అక్కడ నిత్యపూజలందుకునే మూలవిరాట్ ఉండదు. ఉత్సవ విగ్రహాలు ఉండవు. పూజావిధానాలు లేవు. ఆగమశాస్త్ర ఆచరణలు కొనసాగవు. అక్కడ ఉన్నదల్లా అచంచలమైన భక్తి. కొండంత విశ్వాసం. సమున్నతమైన నమ్మకం. రెండు వెదురు కర్రలకు కట్టిన కుంకుమ భరిణెల్ని భక్తులు జంట దేవతలుగా పూజించుకుంటారు. రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమినాడు ఆ దేవతల్ని స్మరించుకుంటూ మహావైభవంగా జాతర నిర్వహించుకుంటారు. తల్లీకూతుళ్లయిన ఆ జంట దేవతలే సమ్మక్క, సారలమ్మ. తమను నమ్ముకున్న జాతికోసం, జనంకోసం వీరోచితంగా పోరాడి, తమ ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించిన అమర వీరుల్ని జానపదులు దైవాలుగా ఆరాధిస్తుంటారు. శత్రురాజుల దురహంకారాల్ని ఎదిరించి తమవారికోసం కదనరంగంలో సమ్మక్క, సారలమ్మలు వీరమరణం పొందారు.
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 8-11 తేదీల మధ్య సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తారు. లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేసే ఈ మహాజాతర, మనదేశంలో కుంభమేళా తరవాత జరిగే అతిపెద్ద సంరంభం. ప్రపంచంలో ఇంతటి భారీస్థాయిలో గిరిజన జాతర మరెక్కడా జరగదు. రెండేళ్లకోసారి, మాఘ పౌర్ణమి తరవాత వచ్చే నాలుగు రోజులు ఈ సంబరం కొనసాగుతుంది. వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను గిరిజనులేకాకుండా, గిరిజనేతరులూ ఆరాధ్యదైవాలుగా కొలుచుకుంటారు. అమ్మవార్లకు చీరె సారెల్ని, పసుపు కుంకుమల్ని భక్తులు సమర్పిస్తారు. తమ బరువుకు తూగే బెల్లాన్ని మొక్కుబడిగా ఇచ్చి, నివేదన చేస్తారు. తమ జీవితాలు బెల్లపు రుచి అంత మధురంగా సాగిపోవాలని జంట దేవతలకు విన్నవించుకుంటారు.

సమ్మక్క సారలమ్మల ఆవిర్భావం, వారి పేరిట జాతర నిర్వహించడానికి గల నేపథ్యానికి సంబంధించి ఎన్నో విశేషాంశాలు జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి. ఏడో శతాబ్దంలో అప్పటి ఓరుగల్లు ప్రాంతానికి సమీపంలో బక్కయ్యపేట అనే గిరిజన గ్రామం ఉండేది. కోయ తెగకు చెందిన గిరిజనులు ఈ గ్రామంలో ఉండేవారు. గోదావరి నదీతీరంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన సందర్భంలో గిరిజనులకు పసిపాప ఏడుపు వినిపించింది. పులుల సంరక్షణలో ఉన్న ఓ పసిపాపను చూసి, దైవాంశతో తమకోసం అవతరించిన వనదేవతగా గిరిజనులు భావించారు. మాఘ శుద్ధ పౌర్ణమినాడు అందరి సమ్మతితో పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. బాల్యంనుంచే సమ్మక్క ఎన్నో లీలల్ని ప్రదర్శిస్తూ యుక్త వయస్కురాలైంది. ఆమెను పెంచి పెద్దచేసిన కోయతెగ నాయకుడు మేడిరాజు, తన మేనల్లుడైన పగిడిద్ద రాజుతో సమ్మక్కకు వివాహం చేశాడు. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న జన్మించారు.

కాకతీయులకు సామంతులైన కోయరాజులు తీవ్ర అనావృష్టి వల్ల ఓ సంవత్సరం కప్పం కట్టలేదు. దాంతో అప్పటి కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు తన బలగంతో కోయతెగపై దండెత్తాడు. కాకతీయుల్ని కోయతెగ దీటుగా ఎదుర్కొంది. సంపెంగ వాగు దగ్గర జరిగిన పోరులో పగిడిద్ద రాజు, అతని సంతానమైన సారలమ్మ, నాగులమ్మ, సారలమ్మ భర్త గోవిందరాజు వీరమరణం చెందుతారు. పరాజయాన్ని భరించలేని జంపన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నాడంటారు. ఆనాటినుంచి సంపెంగ వాగు జంపన్న వాగైంది. సమ్మక్క స్వయంగా సమర రంగానికి వచ్చి, కాకతీయులపై కత్తి దూసింది. అపర కాళికలా వీరవిహారం చేసింది. శత్రువులు కుట్రతో ఆమెను వెన్నుపోటు పొడిచారు. చివరిదాకా పోరాడి, సమ్మక్క నెత్తురోడుతూనే ఈశాన్యదిశగా ఉన్న చిలకలగుట్టపైకి వెళ్లిందని ప్రచారంలో ఉంది. గుట్టపై నాగవృక్షం కింద కుంకుమ భరిణెగా ఆమె అవతరించిందని స్థానికులు నమ్ముతారు. ధీరత్వానికి, శూరత్వానికి ప్రతీకలైన సమ్మక్క, సారలక్క రూపాల్ని జువ్విచెట్టు కింద ప్రతిష్ఠించారు. రెండేళ్లకోసారి చిలకలగుట్టనుంచి సారక్క రూపునీ, కన్నెపల్లి గ్రామంనుంచి సారలమ్మ రూపుని మేడారం రాతి గద్దెలకు వూరేగింపుగా తీసుకువస్తారు. తల్లీబిడ్డలకు బెల్లపు దిమ్మల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ బెల్లపు ముద్దల్నే బంగారంగా వ్యవహరిస్తూ, ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. కొలిచినవారి పాలిట కొంగుబంగారమన్న భక్తి భావనతో సమ్మక్క, సారక్కల్ని ఆరాధించుకుంటారు.

- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్