ᐅఆనందానుభూతి
ᐅఆనందానుభూతి
ఏ సాధన పరమార్థమైనా ఆనందాన్ని పొందడమే. ఆనందం మనో జనితమైన గొప్ప అనుభూతి. ఆహారం శరీర పోషణకైతే- అనుభూతి మనోవికాసానికి. నిజానికి అనుభూతులే జీవితాన్ని పండిస్తాయి.
ఆధ్యాత్మిక జగత్తులోని సాధన ఓ తపస్సులాంటిది. భగవత్ స్వరూపాన్ని మనోపీఠంపై ప్రతిష్ఠించుకొని, నిరంతర చింతనామృతంతో అభిషేకించే తత్వం- నిశ్చలమైన వివేకాన్ని, మానసిక స్వస్థతను ప్రసాదిస్తుంది.
ఆపై కొనసాగే 'సాధనాధార' ఆనందాన్నిస్తుంది సాధకుడికి. ఇలా కానవచ్చి అలా మాయమైపోయే ఆనందం కాదది.
ఏ స్థితిలో ఉన్నా, ఏ వ్యాపకంలో ఉన్నా ఆ పారవశ్యం వెన్నంటి ఉంటూనే ఉంటుంది.
యోగులు, సిద్ధులు, అవతారపురుషులు నిశ్చలానంద జ్యోతిర్మూర్తులై వెలుగొందారంటే కారణం ఇదే.
మనం మానవులం. మహాత్ములం కాము, సగటు జీవులం. ఆ స్థితిని ఎలా పొందగలం, అందుకు సాధనామార్గం ఏమిటి?
ఈ చరాచర జగత్తు ఈశ్వరమయం. జగత్తులోని ప్రాణశక్తి, చేతనాశక్తి ఆ ఈశ్వర ప్రసాదితమే.
సకల కర్మలు ఈశ్వర ప్రీత్యర్థం జరిగేవే. ఆయా కర్మల ఆచరణలోని, శుద్ధత్వం ఈశ్వరతత్వాన్ని గ్రహించగలుగుతుంది. ఆనందాన్ని అందుకునేందుకు అది తొలిసోపానం. తేనెబొట్టు రుచిని జిహ్వ గ్రహించింది. ఇక తేనెపట్టుకై సాధకుడు సాగిపోవాలి. చేస్తున్న కర్మలపై చిత్తాన్ని ఏకాగ్రతగా నిలపడమే యోగమంటాడు పతంజలి మహర్షి.
వజ్రాన్ని సానబడితేనే ప్రకాశించేవిధంగా- నిగ్రహంతో చిత్తవృత్తిని లక్ష్యసాధనకై ఉపక్రమింపజేయడమే నిజమైన సాధన. ఇదొక అంతర్ముఖ సేద్యంలాంటిది. సాధకుడు తన ఆత్మను లక్ష్యంతో మమేకం చేయాలి. అదే ఆత్మైక్యం.
రామకృష్ణులవారిని పరమహంసగా మార్చింది ఈ ఆత్మైక్యసాధనే. ఆయన బుద్ధి, మనసు, శరీరం జగన్మాతయందే ఐక్యమయ్యాయి. అద్వితీయమైన ఆనందానుభూతిని పొందిన భాగ్యశాలి ఆయన.
ఆ, ఆనందానుభూతి ఎన్నో దివ్యదర్శనాలను కల్పించింది. జడలు కట్టిన శిరస్సుపై పడిన గింజలు, అన్నపు మెతుకులను పక్షులు వాలి తింటున్నా తెలియనంతటి అనుభూతి పారవశ్యం. శారదామాతలోనూ జగన్మాతను దర్శించుకునేంత దివ్యానుభూతి. ఇక్కడ మనం ఓ విషయాన్ని గమనించుకోవాలి. సాధన అంటే గంటల తరబడి ధ్యానసమాధిలో ఉండటంకాదు. పూజాదికాలతో దినం వెళ్లబుచ్చటమూ కాదు.
హృదయసాగరకెరటాలు మందాకినిలా, మలయమారుతంలా- అంతర్ముఖ సాధనాక్షేత్రాన్ని తడుపుతూనే ఉండాలి. స్పృశిస్తూనే ఉండాలి. అప్పుడు సుషుప్తావస్థలో సైతం ఆనందానుభూతికి లోనవుతూనే ఉంటాడు సాధకుడు.
భంగు పీలుస్తున్న ఓ రాలుగాయి ముఠా- గురుద్వార్‌కెళ్తున్న గురువును 'నీవెన్నడూ పొందని ఆనందాన్ని చూపిస్తాంరా!' అంటూ ఎకసెక్కంగా పిలవగా- ఆ 'గురువు' నవ్వి- 'ఇంతకన్నా గొప్పదైన ఆనందాన్ని చూపిస్తాను నా వెంటరండి' అంటూ వారిని గురుద్వార్‌కి తీసుకెళ్ళాడు. అక్కడ- ప్రార్థనల్లో భజనల్లో లీనమై ఉన్న భక్తులను చూపి- 'ఈ ఆనందం కన్నా గొప్పదా మీ మత్తు, ఇంతటి పారవశ్యం ఉందా మీరు పొందే మత్తులో?' అని ప్రశ్నిస్తాడు. తమ తప్పును మన్నించండంటూ గురువుకు పాదాభివందనం చేస్తుంది ఆ రాలుగాయి ముఠా.
ఆనందం దొరికే వస్తువు కాదు. భోగభాగ్యాలు, సిరిసంపదలు ఇచ్చే ఆనందం స్వల్పకాలికమే. ఏది శాశ్వతానందాన్ని ఇస్తుందో గ్రహించడమే విజ్ఞత.
ఈ తత్వ నిగూఢతను సులువుగా జనబాహుళ్యానికి అందించాలనే ఆశయంతో మహనీయులు- 'నీవు ఆచరించే సత్కర్మల్లోనే దైవం ఉంటాడని తెలుసుకో. జీవనవ్యవహారాల్లో, త్రికరణ శుద్ధితో కూడిన కర్మాచరణలోనే నిత్యానందం ఉంటుందని తెలుసుకో' అంటూ అందించే ప్రబోధాలు సర్వదా స్మరణీయం. ఆచరణీయం.
- దానం శివప్రసాదరావు