ᐅధర్మసింహం




ధర్మసింహం 

విష్ణుమూర్తి హిరణ్యకశిపుణ్ని చంపటానికి నరసింహావతారం దాల్చిన కథ మనందరికీ తెలుసు. చారిత్రక మహాపురుషుల్లో ప్రాతఃస్మరణీయుడు గురు గోబిందసింగ్ స్వయంగా ధర్మసింహుడుగా రూపొందడమేకాదు- తన శిష్యుల్నీ ధర్మసింహాలుగా మార్చేశాడు.
గురు నానక్‌దేవ్ చిట్టచివరి అవతారంగా గురు గోబిందసింగ్‌ను సిక్కులు భావిస్తారు. ఆయన దశమ గురువు. భారతదేశ దశను మార్చిన జగద్గురువు. సిక్కుల తొమ్మిదో గురువు గురు తేగ్ బహాదుర్ త్యాగమే హిందూ మత మనుగడకు వూతమిచ్చింది. ఆయన ధర్మరక్షణ కోసం తన శిరస్సును అర్పించారు. ఆ త్యాగం అసమానం, అనితర సాధ్యం. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి సంఘటన కనిపించదు.

గురు తేగ్ బహాదుర్ కుమారుడే గురు గోబిందసింగ్. ఆయన తొలి నామం గోబిందరాయ్. తండ్రిని క్రూరంగా అంతమొందించిన అప్పటి మొగలాయీ పాలకుల దుష్ట చర్యలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన తన శిష్యులను ఖాల్సాలుగా రూపొందించాడు. ఖాల్సా అంటే జీవితకాల పవిత్ర యోధుడని అర్థం.

గురు గోబిందసింగ్ పాట్నాలో జన్మించారు. బాల్యంనుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు ప్రకటితమవుతుండేవి. గురు తేగ్ బహాదుర్ ఆత్మబలిదానం తరవాత తొమ్మిదేళ్ల అతిపిన్న వయసులోనే గురు గోబిందసింగ్ గురుపీఠం అలంకరించాడు. పాలకులు తన తండ్రి శిరచ్ఛేదం చేశాక ప్రాణభయంతో ఎవరూ ఆయన శిష్యులమని చెప్పుకోవటంగానీ, ఆయన మృతదేహాన్ని తరలించడానికిగానీ సాహసించకపోవటం గురు గోబిందసింగ్ మనసును కలత పెట్టింది. ఆ క్షణంలోనే ఆయన భవిష్యత్ సిక్కుల రూపురేఖలను మనసులో భావన చేశాడు. పిరికితనం, ప్రాణభయం తెలియని మహావీరులుగా వారిని తీర్చిదిద్దేందుకు 1699 సంవత్సరం మార్చి ముప్ఫైన ఆనందపూర్‌లో ఖాల్సాపంథ్‌ను స్థాపించాడు. అదొక చారిత్రక అద్భుతం. గురువు కోరిక మేరకు అయిదుగురు ఆత్మార్పణ చేశారు. వారిని 'పంచప్యారీ'లుగా గురువు ప్రకటించాడు. ఖాల్సాపంథ్ సంఘటనతో సిక్కులను సింహాలుగా మార్చివేయడం, వారిపేరు చివర 'సింగ్' అని చేర్చారు. సిక్కులు అసమాన యుద్ధ వీరులుగా ఆరితేరారు. ఎన్నో యుద్ధాల్లో శత్రుసేనల్ని మట్టి కరిపించారు. సంఖ్యలో తక్కువైనా ధైర్య శౌర్యాల్లో అసమానులమనిపించుకున్నారు. పంచ కకారాలతో సిక్కుల రూపురేఖల్ని నేడు మనం చూస్తున్న రీతిలో తీర్చి దిద్దారు గురు గోబిందసింగ్.

గురు గోబిందసింగ్ మత ఛాందసాలకు అతీతంగా, మానవత్వమే మతంగా, దైవధర్మ రక్షణే ధ్యేయంగా, కొదమసింహంలా జీవించారు. ఆయన చేసినవన్నీ ధర్మయుద్ధాలే. 'ఆజాను బాహువు, అరవింద దళాయతాక్షు'డన్నట్టు ఆయన రూపురేఖలుండేవి. అమోఘమైన జనాకర్షణ ఆయన సొత్తు. గురువుల త్యాగనిరతి, శౌర్యపరాక్రమాలు- అన్ని కులాలు, మతాలవారిని సిక్కుల ధర్మంవైపు ఆకర్షితులను చేసింది. ఆ విధంగా ప్రపంచ వ్యాప్తంగా నేడు సిక్కుధర్మం పరిఢవిల్లుతోంది. సిక్కుల జీవన విధానం క్రమశిక్షణతో కూడి ఉంటుంది. విగ్రహారాధన చేయరు. వారికి గురువే పరమాత్మ. గురుద్వారాలే వారి ఆలయాలు. వాటిలో అందరికీ ప్రవేశం ఉంటుంది. గురు గోబిందసింగ్ ధర్మసింహంగా సిక్కు చరిత్ర చెబుతుంది. నేడాయన జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్