ᐅజీవన ధార
ᐅజీవన ధార
జన్మించిన క్షణంనుంచీ మనల్ని కాలవాహిని తనతోపాటు లాక్కు పోతుంటుంది. ఎన్నో మైలురాళ్లు, మజిలీలు... కాలం మన రూపురేఖల్ని, తనువును, దాంతో మనసును మార్చేస్తుంటుంది.
గమ్యం వైపు వేగంగా దూసుకుపోతున్న రైల్లో కూచున్నట్లు ఒక్కో దృశ్యం గతంలోకి నిష్క్రమిస్తుంటే నిస్సహాయంగా చూస్తుంటాం. ఇవాళ ఖర్చుచేసిన ధనం రేపు మళ్ళీ సంపాదిస్తాం. కానీ, చేజారిపోయినాక ఏ ఒక్క క్షణాన్నీ మనం తిరిగి పొందలేం. ఈ జీవన రహస్యంపట్ల అప్రమత్తంగా ఉండాల్సింది పోయి, ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం.
జీవన ప్రయాణం మృత్యువు దగ్గర ఆగిపోతుంది.
మృత్యుమందిరం దగ్గరకు మనలో అధికులు రోగులుగా, పాపులుగా వీపున దుష్కర్మల మూటలు మోస్తూ చేరుకుంటారు. అటు తరవాత ఏం జరిగేదీ ఎవరికీ తెలియదు. అంతా వూహల మయమే.
దైవం మనిషిని శరీర రూపధారిగా గుర్తించడు.
ఆత్మగానే చూస్తాడు.
పరమాత్మనుంచీ ఆత్మ విడిపోతుండగా, ఆప్యాయంగా జ్ఞానమనే ధనాన్ని జీవన ప్రయాణబత్తెంగా ఇస్తాడాయన. దాన్ని సద్వినియోగం చేసుకున్న జీవుడు మృత్యుమందిర ద్వారాలు దాటి, పరమాత్మ ఎదుటకు తేజోమయమైన ఆత్మస్వరూపుడిగా వెళ్లి ఆనందపరుస్తాడంటారు. జ్ఞానం విస్మరించిన జీవుడు పశుప్రాయుడిగా, పరమాత్మ ఎదుట అపరాధిలా నిలబడతాడని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.
గండకీ నది ప్రవాహానికి కరిగిపోయే రాళ్ళే, నునుపుదేలి శివస్వరూపాలైన సాలగ్రామాలవుతాయని ప్రతీతి. అంటే కాలవాహినిలో శిలలు సైతం తమను తాము సంస్కరించుకుని, శివస్వరూపంగా రూపొందుతున్నాయి.
మరి మనిషి మాటేమిటి?
పూచిక పుల్లలు నీటిలో తేలుతూ ప్రవాహ వాలులో పడికొట్టుకు పోయినట్లు అర్థరహిత జీవితాలు గడపటం తప్ప, జీవితం ముగిసిపోయేదాకా మేలుకోరా?
జీవన చరిత్రలో ప్రతి ఏటా వసంతాలు వస్తున్నాయి. శిశిరాలు, గ్రీష్మాలు, వర్షాలు మనల్ని తమతమ ప్రత్యేకతలతో అలరిస్తున్నాయి. ప్రకృతినుంచి మనం ఎలాంటి సందేశాలూ అందుకోవటంలేదు.
అర్థవంతంగా మార్చుకోవాల్సిన జీవితాలను వ్యర్థమయం చేసుకుంటున్నాం. ఎదురుగా హిమశిఖరాలు ఆహ్వానిస్తుంటే దిగువన ఉన్న లోయల్లోకి దిగిపోతున్నాం.
మన ప్రయాణం దిశ మారాలి. మన పాదాలు ఎత్తుకు అలవాటు పడాలి. ఆధ్యాత్మికత అనే చేతికర్రతో మనం ఉత్తమ, ఉన్నత ప్రమాణాల జీవిత శిఖరాన్ని చేరుకోవాలి.
అప్పుడు మనం జీవన ధారలోంచి వేరుపడి, సాక్షిగా ఆ ప్రవాహాన్ని మందహాసంతో వీక్షిస్తాం. అదే మోక్షం!
- కాటూరు రవీంద్ర తివ్రికమ్