ᐅరాధా మాధవ తత్వం
రాధా మాధవ స్నేహంలో అపారమైన భక్తి ప్రపత్తులున్నాయి. లౌకిక భావాలన్నింటికీ ఆ చెలిమి అతీతమైంది. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమని రాధ నమ్మింది. ఆమె ఆ'రాధ'నలో నవ విధ భక్తిరీతులున్నాయి. మాధవుని సేవే ముక్తికి మార్గమని భావించి తరించింది. శ్రీకృష్ణునికి ఎనిమిదిమంది (అష్ట భార్యలు) పట్టపురాణులున్నా రాధాకృష్ణుడనీ, రాధా మాధవుడనీ, రాధామనోహరుడనే గోపాలుణ్ని సంబోధించడం విశేషం! జయదేవుడి అష్టపదుల్లో- రాధ అనుభవించిన విరహం దేహపరమైంది కాదు. అత్మానుసంధానం కోసం ఆ విరహం! తనను తాను దైవానికి సమర్పించుకొనే భక్తులందరూ స్త్రీ పురుష భేదం లేకుండా ఈ విరహాన్ని అనుభవిస్తారు. రాధామాధవ భక్తితత్వం ఆమె తరవాతి తరాలకు మార్గదర్శకమైంది. గోదాదేవి, మీరాబాయి, సక్కుబాయి ఈ కోవకు చెందిన భక్తురాళ్లు. శృంగారం- అందుకవసరమైన విరహంలో 'అర్పణ' ప్రధానమైన అంశం. ఆ శృంగారం అమలినమైంది. దైవంలో ఐక్యం కావాలన్న తపన మాత్రమే భక్తురాలి శృంగార భావనకు ప్రతిరూపం. ఈ ప్రాతిపదిక ఆధారంగానే శివపార్వతులను అర్ధనారీశ్వరులని పిలుస్తారు. శ్రీకృష్ణుడు రాధాశ్యాముడయ్యాడు. ఉత్తరభారతంలో రాధను రాధామాతగా కొలుస్తారు. ఎవరీ రాధ?... ఆమెకు నీలమేఘశ్యామునికున్న బంధం ఎలాంటిది?
రాధామాధవ తత్వం అద్వైత (ఏకైక) మహాభావ రసానికి పరాకాష్ఠ. ఆ తత్వం దాస్యానికీ వాత్సల్యానికీ అందనిది. శ్రీకృష్ణుడి లీలలు రుక్మిణి కన్నా రాధకే బాగా తెలుసునని హరివంశంలో కాళిదాసు ప్రస్తావించాడు. శ్రీకృష్ణుని తమ భర్తగా పొందాలని కోరుతూ కాత్యాయినీ వ్రతం చేసిన పద్నాలుగుమంది కన్నె సఖులకురాధ భక్తిమార్గం చూపింది.
శ్రీకృష్ణుని పూజించడంకన్నా ప్రేమించడం ముక్తిదాయకం. పూజించడంవల్ల ముక్తికి మార్గాన్ని సుగమం చేసుకోగలం. ప్రేమించి ఆత్మానుసంధానం చేయడంవల్ల మాధవుడిలో ఐక్యం కాగలమని చెబుతారు. ఈ రసానుభూతిని అనుభవించిన రాధ, గోద,మీరా సక్కుబాయిలాంటి భక్తురాళ్లు విష్ణుసాయుజ్యం పొందారని చదువుకున్నాం. శ్రీకృష్ణుడితో దేహ బాంధవ్యం ఉన్న అష్ట భార్యలకు పదహారు వేలమంది గోపికలకు ఇంతటి అదృష్టం లభించలేదు. అష్టలక్ష్ములకూ రాధ వైకుంఠంలో ఆరాధ్యదైవమని విష్ణు పురాణం చెబుతోంది.
శ్రీకృష్ణుడి అందాన్ని అందరూ ఆరాధిస్తే ఆయన రాధలోని ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఆరాధించాడు. రాధ పరిమళ భరితమైన పుష్పం లాంటిదనీ బృందావనంలో ఆ సౌరభాలు ఆమె రాకతో వ్యక్తమయ్యేవని అంటారు. వైకుంఠం విడిచి శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు అక్కడి మనోహరమైన విరజానది రాధగా అవతరించిందని విష్ణుపురాణం చెబుతోంది. అందుకే శ్రీకృష్ణుడు ఆమెలో ఓలలాడాడు. మాధవుడి సాంగత్యంతో రాధను ద్వాపరయుగంలో కృష్ణమయి అని సంబోధించేవారు. ఇంద్రియ ఆనందం తీయని విషం వంటిది. ప్రారంభంలో మాధుర్యం భాసించినా తరవాత దేహాన్ని నాశనం చేస్తుంది. ఆత్మానందం ఆసాంతం మాధుర్యమే! ఆ సుధామృతం అమరత్వాన్ని కలిగిస్తుంది. రాధ ఆత్మానందం ఆస్వాదించింది. మాధవుడికి ఆత్మను అర్పించి ఆత్మతోనే రమించింది. దీన్నే... ఈ ఆత్మానుసంధానాన్నే ఆనంద చిన్మయ రసానుభూతి అంటారు. లౌకిక ఆనందాలకు వశులైన వారికి శ్యామ రసాస్వాదనలోని మధురిమ గురించి తెలియదు. జయదేవుని గీతగోవిందం ఆసాంతం శ్యామరసమయమే! ఈ రసానుభూతిని పొందినవారు గోపికలు, రాధ, మీర, నారదుడు మాత్రమేనని అంటారు. శ్రీకృష్ణుడు తనకు శిశువుగా జన్మించినప్పుడు దేవకిలో కలిగిన వాత్సల్యం, యోగుల్లోని బ్రహ్మానందం, బాలకృష్ణుడిపై యశోద అనురాగం కలగలిపితే రాధామాధవతత్వంగా భాసిస్తుందట. ఆ తత్వాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయగలిగితే ముక్తిమార్గం మనకు సుగమమవుతుంది.
- అప్పరుసు రమాకాంతరావు