ᐅజ్యోతి దర్శనం
ᐅజ్యోతి దర్శనం
గ్రామాల్లో స్త్రీలు నాలుగైదు కుండల్ని దొంతరగా తలమీద పెట్టుకొని పోతూ ఉంటారు. గతుకుల బాటపై సైతం నీటిచుక్కయినా తొణకదు. నిశ్చలచిత్తం కలిగినవారి జీవనయాత్ర ఇలాంటిదే! ఆత్మవిశ్వాసం లేనివాళ్లు ఈ కుండ దొంతరలను సరిగా మోయలేరు. లోపల అనుమానం ఉంటే కాళ్లు తడబడతాయి. నీళ్లు తొణుకుతాయి. శరీరం కంటే మనసు బలంగా ఉంటే భయం ఉండదు. 'ప్రపంచంలో పాపమనేది ఉంటే అది ఆత్మవిశ్వాసం లేకపోవడమే' అంటాడు వివేకానందుడు. ఆత్మవిశ్వాసం పైమెట్టు ఈశ్వరుడిపై విశ్వాసం. ఈశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడు. ఈశ్వర విలాసంపై విశ్వాసమున్నవారి హృదయమనే దీపకళిక నిశ్చలంగా ప్రకాశిస్తుంది. తాను హరించుకుపోతున్నా లోకానికి వెలుగునిచ్చే త్యాగగుణానికి 'జ్యోతి' పరమ ప్రతీక.
భౌతిక జ్ఞానంకంటే దివ్యజ్ఞానం గొప్పది. యుక్తి ప్రయుక్తులతో పనిలేకుండా దివ్యజ్ఞానంతో మహాత్ములు సత్య స్వరూపాన్ని సందర్శించారు. సూర్యుని వెలుగులో వస్తువులన్నీ వాటికై అవే కనబడతాయి. దివ్యజ్ఞానంతో 'లోలోపలి' విషయాలనూ చూడవచ్చు. ఆ దివ్యజ్ఞానానికి ప్రతీకగా ప్రకాశించేది జ్యోతి! మకరజ్యోతి! విగ్రహంలో భగవంతుణ్ని భావనచేసే భక్తుడు. 'ఇది ఏ రాయి, శిల్పి ఎవరు?' అని ఆలోచించడు. అలాగే జ్యోతి సందర్శకులు 'ఇది వెలిగించిందా, వెలిగేదా?' అని యోచించరు. మకరజ్యోతి రూపంలో సకలమూ తానే అయిన పరంజ్యోతినే భక్తులు భజిస్తారు. మకరజ్యోతి దర్శనం పుణ్యప్రదం, జీవితం సఫలం- అని భక్తుల విశ్వాసం. హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దర్శన భాగ్యంతో శరీరాలు పులకిస్తాయి. నేత్రాలకు జ్యోతిదర్శనం పర్వం. స్వామిదర్శనం భక్తిమార్గం. జ్యోతిదర్శనం జ్ఞానమార్గం. చిదంబర క్షేత్రంలో శివకేశవులను ఒకచోటనుంచే దర్శించడం ఒక పవిత్రానుభూతి. అలాంటిదే అయ్యప్ప సమక్షంనుంచి జ్యోతిని దర్శించడం.
భౌతిక దృష్టికి కనిపించే ఈ జ్యోతి నిజానికి జ్ఞానానికి సంకేతం. అది ఒక ఆశాకిరణం. తమోమయ జగత్తులో కొట్టుమిట్టాడే ప్రాణులు లవలేశమైనా వెలుగురేఖ ప్రసరిస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తుంటారు. ఆశాజీవులకు జ్యోతిదర్శనం నయనానందకరం. ఒకగదిలో వందల సంవత్సరాలనుంచి ఉన్న చీకటి చిన్నదీపాన్ని వెలిగిస్తే మటుమాయమవుతుంది. మకరజ్యోతీ అలాంటిదేనని, అది భగవంతుని కరుణా కటాక్షమని భక్తుల భావన.
మనదేశంలో పలు ప్రాంతాల్లో కేవలం జ్యోతి ఆరాధనే జరుగుతూ ఉంటుంది. తమిళనాడులోని వడలూరు జ్యోతి ప్రసిద్ధమైంది. రామలింగస్వామి స్థాపించిన పవిత్ర క్షేత్రంలో కేవలం జ్యోతి మాత్రమే దర్శనం ఇస్తుంది. దీన్ని అఖండంగా భక్తులు శ్రద్ధాభక్తులతో సంరక్షించి, పూజిస్తారు. రామలింగస్వామి ప్రబోధాలన్నీ ఆ అఖండజ్యోతిని చూసినంతనే భక్తుల హృదయాలను స్పృశిస్తాయని ఆ స్వామి అనుచరుల అభిప్రాయం. ఇక మన దేవాలయాల్లో జరిగే అఖండ దీపోత్సవం అందరికీ సుపరిచితమే! ఇంట్లో దేవుడి పటానికిసైతం జ్యోతిప్రజ్వలన చేసే నమస్కరిస్తాం. జ్యోతి ప్రజ్వలనతోనే సభలు ప్రారంభమవుతాయి. చైతన్యానికి, పవిత్రతకు, ప్రాణానికి, జ్ఞానానికి- 'జ్యోతి' ప్రతీక.
సద్గురువులు మనకు మార్గదర్శకులు. వారి ఉపదేశంతో 'అయ్యప్పదీక్ష'కు అంకురారోపణ జరుగుతుంది. దీక్షాదినాలను నియమ నిష్ఠలతో గడుపుతారు. ఉపవాసం, భూశయనం, నిరాడంబర జీవితం, నిత్యం భగవన్నామ స్మరణం. తుదకు క్షేత్రయాత్ర. తీర్థయాత్రలు చేస్తూ స్వామి సన్నిధికి చేరిక. కన్నులారా స్వామినీ, మకరజ్యోతినీ సందర్శించిన తరవాత యాత్రాపరిసమాప్తి. మకరజ్యోతి కాంతి మనసులో ముసిరిన చీకట్లను పారద్రోలగా సంతృప్తితో గృహోన్ముఖులవుతారు. పరమేశ్వరుడు జ్యోతి స్వరూపుడని, సంసారయాత్ర ఆ పరంజ్యోతి దర్శనంతో ముగుస్తుందనీ గ్రహిస్తారు. ఈ ఆదర్శమే అయ్యప్పదీక్షకు పరమావధి.
తొణుకూ బెణుకూ లేకుండా, బాహ్యప్రభావాలకు లోనుకాకుండా మనసును నిగ్రహించుకుంటూ దీక్షను దక్షతతో చేసిన 'స్వామి'కి 'మనసులోని సత్పదార్థం' వికసిస్తుంది. దీనికి ఎంతో ఓర్పు అవసరం. ముత్యపుచిప్పే మనకు ఆదర్శం. స్వాతిబిందువు పడిన వెంటనే అది సముద్ర గర్భానికి చేరుకుంటుంది. తనలోపడిన నీటిబిందువు ముత్యంలాగా ఎదిగేదాకా ఓపిగ్గా ఉంటుంది. భక్తులకూ అలాంటి ఓపిక అవసరం. సాధనతో ఇది సాధ్యం. తుదకు జ్ఞానజ్యోతి దర్శనం జరుగుతుంది. ఆ వెలుగులో మోక్షమార్గం సుస్పష్టంగా గోచరిస్తుంది. సత్యం, సమానత, సదాచారం, సహిష్ణుతలే మకరజ్యోతి మనకు ఇచ్చే సందేశ కిరణాలు. జ్యోతి దర్శనం అనంతరం కూడా ఈ ఆదర్శాలతో జీవితాన్ని గడపగలవారు ధన్యులు.
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు