ᐅతుపానులు
జీవితంలో చెలరేగే తుపానుల నుంచి ఎలా బయటపడాలి? ఈ ప్రపంచంలో ఇదే మౌలిక సమస్య. తుపానులు ఉంటాయని ముందు గ్రహించాలి. వాటి గురించి బాధపడటం మానెయ్యాలి. ఉవ్వెత్తున ఎగసిపడే తరంగాల్లాగా తుపానులూ అణిగిపోతాయి. ఏ తుపానూ ఎల్లకాలం ఉండదు. అవి అణిగిపోతున్న సమయంలో మనలోని మృదువైన అంతర్గతమైన చల్లచల్లని ప్రకృతి అనుభవమవుతుంది. తుపానుల మధ్య అసలు మనం ఏ స్వరూపమో అదే ఉంటుంది. ఎన్ని తక్కువ తుపానులు వస్తాయో ఆ సంఖ్యను బట్టి ఎంత స్థిమితపడ్డామో నిర్ధారించవచ్చు.
ఎప్పుడైతే మనసు ప్రశాంతమవుతుందో అన్ని భయాలు, ఆందోళనలు తమ పట్టును కోల్పోతాయి. మనం తిరిగి పూర్వపు మనంగా మారిపోతాం.
తుపానులను ప్రతిఘటించడం మానివేసి, వాటిని ఆమోదించడం ప్రారంభించిన క్షణం నుంచి, వాటంతట అవే అణిగిపోతాయి. ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, యోగ ప్రయోజనం అదే. మన క్షేమం గురించి ఎవరో జాగ్రత్త పడుతున్నారని తెలుసుకొన్ననాడు- అన్ని భయాలు, అభద్రతాభావం రాలిపోతాయి. శాంతితీరంలో సుస్థిరంగా నిలిచి ఉంటాం.
అతి చిన్న విషయాలు- భావాలు, కోరికలు, ఉద్రేకాల నుంచి పారిపోతున్నప్పుడు మనలో ఆందోళన మరింత పెరుగుతుంది. అలలు లేకుండా సముద్రం ఉండదు. జీవితంలో తుపానులు అనివార్యం. ప్రతి తుపానూ మన జీవితాన్ని ఎక్కడో స్పృశిస్తుంది. మనం మరింత శక్తిని పుంజుకొంటాం. తుపాను మన ఇష్టాయిష్టాలను తుడిచిపెట్టి, మనల్ని ప్రక్షాళనం చేస్తుంది. రెండు చేతులూ చాపి జీవితంలో ఏ తుపానునైనా ఆహ్వానించాలి. వాటిని స్వీకరించకుండా ప్రతిఘటిస్తే మరిన్ని తుపానులు తప్పవు.
తరంగాల కన్నా, సంక్షోభాలకన్నా జీవితం ఎంతో ఉన్నతమైనది. అవి ఉద్ధృతంగా పొంగుతాయి కాని, జీవితాన్ని నాశనం చేయలేవు. వాటిలో నుంచి జీవితం పెరుగుతుంది. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా భద్రతారాహిత్యం, సంక్షోభాలు, గందరగోళాలు తప్పవు. అది జీవన సముద్రంలో మునిగిపోవడం వంటిది. రక్షణ కవచం ఉన్నవాడు ఎంతటి దారుణమైన తుపానునైనా తప్పించుకొని బయటపడతాడు. ఆ రక్షణ కవచమే జ్ఞానం. అమృతతత్వం పొందడం అంటే మనలోని అనంత ప్రకృతిని వీక్షించడమే.
వ్యక్తి చూసే తరంగాలన్నీ వ్యక్తిరూపాలే. జీవితంలో ఎన్నో రూపాలు ధరిస్తుంటాడు. ఈ సాగరంలో ప్రతి పేరు, ప్రతి రూపం చైతన్యంలో భాగాలే. తుపానులను వదిలించుకోవాలని తొందరపడకూడదు. వాటితో సహజీవనం చెయ్యాలి. పరిపూర్ణత్వం కోసం వెదకడంతో మనలో అపరిపూర్ణ అంశాలన్నీ బయటపడతాయి. మనం ప్రశాంతంగా ఉంటే, పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి.
ప్రతివ్యక్తీ విశ్వానికి కేంద్రబిందువు వంటివాడు. ఎక్కడికివెళ్లినా మన మనసు మనవెంటే వస్తుంది. అదే తుపానులు సృష్టిస్తుంది. చాలా ప్రశాంతంగా జీవితం ఉందనిపిస్తుంది. కాని ఎప్పుడో ఒకప్పుడు తుపాను విరుచుకుపడుతుంది. తుపానుల నివారణకు శాశ్వత పరిష్కారం లేదు. వాటిని ప్రతిఘటించకూడదు. అవి వ్యక్తిత్వ ఇంద్రజాలం చేసే అద్భుత విన్యాసాలు తప్ప మరేమీ కావు.
చరిత్రలో ఒక్క కుంతీదేవే కష్టాలను వరాలుగా శ్రీకృష్ణుడి నుంచి పొందింది. కష్టాలు, కన్నీరు... సుదూర కాంతితీరాలకు దగ్గర దారి!
- కె.యజ్ఞన్న