ᐅజ్ఞానాన్వేషణ
ᐅజ్ఞానాన్వేషణ
'జ్ఞానమనే దీపాన్ని వెలిగించి ప్రకాశింపజేయకుంటే లోకం యావత్తు చిమ్మచీకటిలో మునిగి ఉంటుంది' అంటాడు మహాకవి దండి. మనిషిని బంధించేది అజ్ఞానమేగాని, సంసారం కాదు. అహంకారాన్ని అతిక్రమించలేని మానవుడు అజ్ఞానమనే సుడిగుండంలో నుంచి బయటపడలేడు. అజ్ఞానంలో ఉన్నవాడిని మోహం విడిచిపెట్టదు. మోహం ఉన్నవాడు స్వార్థబుద్ధితో పాపాచరణకు వెనుదీయడు. స్వార్థపరుడు సమాజానికి చీడపురుగులాంటివాడు.
జ్ఞానం ఒక్కటే శాశ్వతమైనది. 'మతములన్నియు మాసిపోవును. జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును' అంటాడు ఆధునిక కవి. నిజానికి మతాలు పుట్టినది అజ్ఞానమనే చీకట్లోంచి మనిషిని ఉద్ధరించడానికే. అవతార పురుషులు, ఆచార్యులు, జ్ఞానులు అవతరించిందీ జ్ఞానబోధకే.
తన స్వరూపం తాను తెలుసుకున్నవాడు జ్ఞాని. సూర్యుడికి చీకటి తెలియదు. జ్ఞానికి దుఃఖం తెలియదు. ఈ లోకాన్ని జ్ఞాని మాత్రమే ప్రేమించగలడు. జ్ఞానిది శివదృష్టి. అజ్ఞానిది శవ దృష్టి. 'నేను ఆత్మను... నాకు ఒక దేహం ఉంది' అని జ్ఞానికి తెలుసు. 'నేను దేహాన్ని... నాకు ఒక ఆత్మ ఉంది' అనుకొంటాడు అజ్ఞాని. జ్ఞాని దేహం దేవాలయం. దేహ ప్రారబ్ధాన్ని అనుసరించి జ్ఞానికి జరగవలసిన పనులు జరుగుతుంటాయి కాని, కర్తృత్వం ఉండదు. జ్ఞాని శరీరం ధరించి ఉన్నంతమాత్రం చేతనే లోకానికి మేలు జరుగుతుంది. మల్లెతోటలో కూర్చుని మనకు పరిమళం రావాలని కోరుకోనక్కర్లేదు. అదేవిధంగా జ్ఞాని సన్నిధిలో కాంతి, శక్తి, శాంతి నిండి ఉంటాయి.
మహిమలు చూపించినవాడే జ్ఞాని కాడు. జ్ఞాని సమదర్శిని. గాలిలో తేలిపోయేవాడో, నీట్లో నడిచిపోయేవాడో జ్ఞాని కాడు. కాలాన్ని, కామాన్ని జయించినవాడు జ్ఞాని. మరణించినవాణ్ని బతికించినవాడు జ్ఞాని కాడు. మరణించినవాడిలా జీవించేవాడు జ్ఞాని. శాస్త్రవేత్త ప్రకృతిమూలాన్ని శోధించినట్లుగా జ్ఞాని మనోమూలాన్ని శోధిస్తాడు. జ్ఞాని దేనికీ చలించడు. సమాజంలో శాంతిభదత్రలు కాపాడ్డానికి రక్షకభట యంత్రాంగంలా మానవ మానసాలను శాంతితో, కాంతితో నింపడానికి జ్ఞానుల బోధనలు కావాలి. జ్ఞానదానం చాలా గొప్పది. 'నాకు తెలిసిందొక్కటే... నాకేమీ తెలియదని' అంటాడు సోక్రటీసు. ఆ స్థితిలో ఉండగలిగినప్పుడే జ్ఞానాన్వేషణ జరుగుతుంది. లోక జ్ఞానమైనాసరే, భగవత్ జ్ఞానమైనా సరే. జ్ఞానాన్ని అన్వేషించడమూ, అన్వేషించేవారికి సహాయపడమూ అంటే నేర్చుకోవడమూ, నేర్పడమూ. ప్రాచీన భారతదేశంలో దాన్నొక తపస్సుగానే భావించేవారు. జ్ఞాన సముపార్జనపట్ల ఆసక్తి ఉన్నవారు జ్ఞానులను వెదుకుతూ శ్రమకోర్చి ఎక్కడికైనా వెళ్లేవారు. ఒక గురువును కలుసుకోవడం కోసమో, ఒక అపూర్వమైన తాళపత్ర గ్రంథాన్ని అన్వేషిస్తూనో వందల యోజనాలు నడిచేవారు. దారిలో భిక్షగా లభించే ఆహారమే భోజనం. వృద్ధాప్యం ప్రవేశించి శరీరం శుష్కించినా- శారీరక మానసిక శక్తులు కూడగొట్టుకొని తాము కోరుకున్నదాన్ని నిరంతరం నేర్చుకునేవారు.
జ్ఞానార్థులైన ఆరుగురు మునిపుత్రులు సుకేశుడు, సత్యకాముడు, గార్గ్యుడు, భార్గవుడు, కౌసల్యుడు, కబన్ది అనేవారు జ్ఞానాన్వేషణ తత్పరులై పిప్పలాద మహర్షివద్దకు వచ్చారు. పిప్పలాదుడు సువర్చల, దధీచిల పుత్రుడు. మహాజ్ఞాని. ఏ విద్యను నేర్పడానికైనా అందుకు తగిన మానసిక స్థితి అవసరం. అందుకే ఈ ఆరుగురిని ఒక సంవత్సరకాలం తపోమయ జీవితం గడపమని ఆదేశించాడు. ఆ తరవాత వారు ఆయనను అడిగిన ఆరు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఈ గురుశిష్య సంవాదమే 'ప్రశ్నోపనిషత్తు'గా ప్రసిద్ధమైంది. జ్ఞానాన్వేషణలోంచి ఆవిర్భవించిన ఒక కల్పవృక్షం ఈ ఉపనిషత్తు.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు