ᐅశోధన- సాధన




శోధన- సాధన 

మనలో చాలామందిమి భగవంతుని ఉనికిని విశ్వసిస్తాం. 

ఆయన గురించిన నిర్వచనాల్ని, వర్ణనలను, వివరణలను మన వూహల్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాం. అలా మన వూహల్లోంచి పుట్టుకొచ్చినవే దైవచిత్రాలు, రూపాలు. 

భక్తులు భగవంతుని భావనలో ఓలలాడుతూ పరవశిస్తుంటారు. 'యద్భావం తద్భవతి' గనక, మనం భావించిన విధంగానే భగవంతుడు ఉంటాడనీ, ఉన్నాడనీ మన విశ్వాసం.

భగవంతుణ్ని తేజోమూర్తిగా వేదాలు, ఉపనిషత్తులు చెబుతాయి. రూపరహితుడనీ, గుణరహితుడనీ ఆయన గురించిన అనేక విశేషణాలే వేర్వేరు వ్యక్తీకరణలుగా, మతవిశ్వాసాలుగా చలామణీలో ఉన్నాయి.

పాలు మూల పదార్థం అయినప్పుడు పెరుగు, వెన్న, నెయ్యి అందులోంచి ఉద్భవించినవే అవుతున్నాయి. కానీ వేటికవిగానే చలామణీ అవుతున్నాయి.

పరమాత్మ గురించిన వ్యక్తీకరణలూ ఈ విధంగానే ఉంటున్నాయి. అందరి దేవుడూ ఒక్కడే. విశ్లేషించి, విశేషణాలతో వేర్వేరుగా చెబుతున్నవారివల్ల మతభేదాలు ఏర్పడ్డాయి.

నెయ్యి వెన్నలో కలవదు. వెన్న పెరుగులో కలవదు. పెరుగు పాలలో కలవదు. ఇదీ అసలు సమస్య! ఏ మతమూ ఇంకో మతాన్ని ఒప్పుకోదు. కానీ, 'అందరి ప్రభువూ ఒక్కడే'- అనే దంతవేదాంతాన్ని వల్లిస్తునే ఉంటారు. ఎవరి వేషం వారిది, ఎవరి పలుకులు వారివి.

కొందరు రాళ్లకు మహిమ ఉందని నమ్ముతారు. చిల్లరరాళ్లకు మొక్కుతారు. రంగురాళ్లను వేళ్లకు ధరిస్తారు. మనిషి దేవుడి కోసం యుగయుగాలుగా శోధిస్తూనే ఉన్నాడు.

తానే దేవుడిననే మానవదేవుళ్లకు అందువల్లనే అమితంగా గిరాకీ పెరిగిపోయింది. వూరికో 'దేవుడు మనిషి' అవతరిస్తూ ప్రజల మూఢ విశ్వాసాలను సొమ్ము చేసుకుంటున్నాడు. కొన్నిచోట్ల దేవతలూ అవతరిస్తున్నారు. వాళ్లు రకరకాలుగా మనుషుల అంధవిశ్వాసాలతో ఆడుకుంటున్నారు.

మనిషిలో దైవసమానులు ఉండవచ్చు. ఉత్తమోత్తములు ఉండవచ్చు. కానీ, దేవతలుండటం దుర్లభం. మానవశరీరం దైవశక్తిని భరించలేదు. అందువల్ల, దేవతా స్వరూపులుగా మనుషుల్ని కొలవడం మూర్ఖత్వం. గురువులు, సద్గురువులు, మహాత్ములు ఉంటారు. వారూ తాము దైవం కాదనే చెప్పుకొంటారు. కేవలం మోసగాళ్లే తమను తాము దైవమని చెప్పుకొంటారు. మానసిక రుగ్మతల ప్రకోపం వల్లకూడా కొందరు తాము దైవమని ప్రకటిస్తూ, భ్రమలు కల్పిస్తారంటారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు.

మనిషి దైవాన్ని శోధించటం మానేసి, సాధన ప్రారంభించాలి. ఏమిటా సాధన? మనలో ఉన్న, మనకు స్పష్టంగా అర్థమవుతున్న మన దుర్గుణాలనుంచే క్రమంగా విముక్తి సాధించాలి. ఏమిటా దుర్గుణాలు? అసూయ, ద్వేషం, అసత్యం, స్వార్థం... ఇలా ఎవరి మనసులో ఉన్న దుర్గుణాలు వారికే తెలుసు. వీటిని వదిలించుకోవాలంటే సత్సంగం మంచిదంటారు ఆదిశంకరులు. సజ్జనుల సహవాసమే సత్సంగం. దుర్గుణ రహితులే సజ్జనులు. సాధనవల్ల మనం సజ్జనులం కావాలి. అప్పుడు అతి సులభంగా అంతర్వాణి వినిపిస్తుంది.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్