ᐅమౌనయోగం
ᐅమౌనయోగం
చూడటానికి పిచ్చివారిలా, చాలినంత బట్ట, ఓ నిర్దిష్టమైన నివాసంలేక ఏ పూట ఎక్కడ కడుపులోకి ఓ ముద్ద తింటారో తెలియని బతుకుల్లా పైకి కనిపిస్తాయి వారి జీవితాలు. వారికన్నా సామాన్య ప్రజలు మేలనే భ్రాంతి కలిగిస్తాయి వారి స్థితిగతులు. కానీ, వారి ముఖారవిందాల్లో కనిపించే కాంతి, సంతృప్తి, ఆనందం, వారి పలుకుబడి (ఉచ్చారణ)లో వ్యక్తమయ్యే మృదుత్వం, వారి జ్ఞానం అపూర్వం! పౌష్టికాహారం, దేహపరిశ్రమ, సౌందర్య సాధనాలతో తాము సాధించలేక పోయిన దీప్తి, వారిముఖాల్లో ఎలా కనిపిస్తోందని అలనాటి పాలకులు యోచించారేమో, వారికి నీరాజనాలు అర్పించి గురుస్థానమిచ్చి గౌరవించారు. వారే అలనాటి మౌనయోగులు!
అతిగా మాట్లాడటం అనర్థదాయకమని ఎవరైనా అనుభవంలో తెలుసుకుంటారు. వాక్ నియంత్రణ పాటిస్తున్నవేళ మేధ వికసిస్తుంది.అందుకే తపస్వులు మౌనాన్ని ఆశ్రయించి పలుకుశక్తి పెంచుకున్నారు. ముక్కుమూసుకొని తపమాచరిస్తున్న వేళ శ్వాస నియంత్రణ చేయగలిగిన ఆ సాధకులకు మనోనియంత్రణ సులభసాధ్యమై ఉండవచ్చు.
కట్టలు తెంచుకొని ప్రవహించే వరద నీటికి మిట్టపల్లాలు తెలియవు. అడ్డువచ్చిన ఏ వస్తువైనా ఆ ప్రవాహ వేగంలో కొట్టుకు పోవలసిందే! అడ్డూ అదుపులేని వాక్‌ధోరణి అలాంటిదే. అదే ఓ నిర్మల జలపాతం సమవేగంతో కిందకు ఉరుకుతూ భూమ్మీద ఓ సొబగైన ప్రవాహాన్ని సృజిస్తుంది. జలపాతం భూమిని చేరినవేళ కమ్ముకొనే పొగమేఘాల్లాంటి నీటి తుంపరలను పైకెగయజేసి చూపరులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సూర్యరశ్మితో చెలిమిచేసి ఆకాశంలో ఓ మనోహర ఇంద్రచాపాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ జలపాత ఝరి ఓ నదానికి రూపకల్పన చేసి అది పారినంతమేర నేలను సస్యశ్యామలం చేసి పాడిపంటలకు కొదవలేకుండా చేస్తుంది. నిర్మల జలపాతం వంటి మౌన యోగుల నోటి వెంట వెలువడే అరుదైన, సున్నితమైన మాట సత్యపూర్ణమై, సత్వగుణశోభితమై, ఆచితూచి మాట్లాడే ప్రతి పలుకూ ప్రభావవంతమవుతుంది.
అరుదైనదేదైనా అపురూపమైనదే అవుతుంది. సాధనాక్రమంలో మౌనానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఉత్తములైన భగతదన్వేషకులు తమ హావభావాలు, చేష్టలతో లోకానికి పిచ్చివారుగా కనబడతారు. 'ఎవరి పిచ్చివారికానందం' అన్న నానుడిలోని లోతుపాతులు వివరంగా తెలిసేవి కాకపోయినా, భౌతికానందాల పట్ల వైరాగ్యం కలిగి పరమాత్మ అన్వేషణలో పరవశించే సాధకులు, అది ఓ 'పిచ్చి' గా లోకం భావించినప్పటికీ, వారు ఆ ఆనందస్థితిలో మానవుడు ఆత్మపరంగా పొందవలసిన సకలాన్నీ సాధిస్తారు. ఆ వాక్ నియంత్రణలోని ఆనందాన్ని సొంతం చేసుకోవడం ప్రతి ముముక్షువు వాంఛింపదగిందే! అదే అందరూ ఆశించదగిన ఆనందయోగం. మిత భాషణం ఓ శోభాయమాన మౌనయోగం!!
- గోపాలుని రఘుపతిరావు