ᐅసుబ్రహ్మణ్య షష్ఠి




సుబ్రహ్మణ్య షష్ఠి 

శివపార్వతుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్య స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి. స్కందుడు ఆవిష్కారమైన రోజే మార్గశిర శుక్ల షష్ఠి. ఇదే సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ తిథినాడే షణ్ముఖుడు దేవసేనాధిపతిగా అభిషిక్తుడై తారకాసురుణ్ని వధించాడనేది పురాణ కథనం. 'స్వామి' అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. శివ బాలుడైన కుమరేశుడి ఆవిర్భావం ఎంతో విలక్షణమైంది. అవ్యక్తమైన శివస్వరూపంనుంచి వ్యక్తమైన తేజోకిరణం ఆకాశంలో పయనించేటప్పుడు దాన్ని వాయువు, అగ్ని, గంగ, భూమి ఇలా ఒకదాని తరవాత మరొకటి ధరించిన ఫలితంగా ఓ రూపం ఏర్పడిందంటారు. ఆ రూపమే కుమారస్వామి అని పురాణ కథనం. ఆదిశంకరాచార్యులు పేర్కొన్న సృష్టి పరిణామక్రమానికి ఇది ప్రతీక. అవ్యక్తంనుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్నినుంచి నీరు, నీటినుంచి భూమి ఆవిర్భవించినట్లు ఆదిశంకరులు సూత్రీకరించారు.
సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడు. ఆయన ఆరు ముఖాలకు ప్రత్యేకతలున్నాయి. మయూర వాహనాన్ని అధిరోహించి లీలావిలాసాల్ని ప్రదర్శించే ముఖం ఆయనది. అది శూరుడనే రాక్షసుణ్ని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం. శరణు కోరినవారికి అభయమిచ్చి ప్రసన్నతను చాటే ముఖం. శూలాయుధ పాణియై వీరత్వాన్ని ప్రస్ఫుటింపజేసే ముఖం. లౌకిక పరమైన సంపదల్ని అనుగ్రహించే ముఖం... ఇలా ఆరుముఖాల 'ఆర్ముగం' ఆనంద స్వరూపానికి చిహ్నం. ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే, షణ్ముఖుడి ఆరు శిరస్సులు పంచేంద్రియాలకు, మనసుకు సంకేతాలు. వీటిపై పట్టు సాధించినవారే ఉన్నతులవుతారని స్వామి రూపం సూచిస్తోంది. శక్తిని మూలాధార చక్రంనుంచి సహస్రార చక్రానికి ప్రసరింపజేసినప్పుడు మనిషికి శివశక్తి దర్శనం కలుగుతుందంటారు. ఈ భావనకు శరవణుని ఆకృతే ప్రతిబింబం.

తిథుల్లో ఆరోది షష్ఠి. స్వామి షష్ఠిప్రియుడు. ఆరుముఖాల స్వామికి షడాక్షరి మంత్రమంటే ఎంతో ఇష్టం. అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకుని, దైవంపై మనసు లగ్నం కావడానికి సుబ్రహ్మణ్యోపాసన శ్రేయస్కరమైనదిగా చెబుతారు. వేదాల్లో షణ్ముఖీనమైన సంవత్సరాగ్ని రూపంగా స్వామిని పేర్కొన్నారు. ఇది కాలాగ్ని రూపం. ఆరుముఖాలు, ఆరు రుతువులు, పన్నెండు చేతులు, పన్నెండు మాసాలతో ఈ సంవత్సరాగ్ని వర్ధిల్లుతుంది. చిత్రాగ్ని అనే మయూరంపై ఈ రూపం ప్రకటితమవుతుంది. స్వామి వాహనమైన నెమలి కామజయానికి సంకేతం. నీలిరంగులో ఉండే నెమలి అనంత తత్వానికి సూచిక. స్వామిచెంత ఉండే నెమలి, తన కాళ్లకింద సర్పాన్ని తొక్కిపట్టి ఉంచుతుంది. పాము అహంకారానికీ, దాని కోరలు రాగద్వేషాలకూ సంకేతాలు. అహంకారాదుల్ని అదుపులో ఉంచుకున్నప్పుడే వ్యక్తి పూర్ణత్వాన్ని అందుకుంటాడని మయూరం సందేశమిస్తుంది. 'జ్ఞానశక్త్యాత్మ' అనేది స్వామికి ప్రియమైన నామం. కార్తికేయుడు దేవసేనాధిపత్యం పొందిన సుబ్రహ్మణ్యషష్ఠి నాడు స్కందషష్ఠి వ్రతాన్ని ఆచరిస్తే సర్వవిజయాలు అందుకోవచ్చునని చెబుతారు. జ్ఞానం, శక్తియుక్తులతో జీవన మార్గంలో విజయాల్ని వశం చేసుకోవడానికి 'స్వామి' ఆరాధనమే తరుణోపాయమంటారు.


- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్