ᐅదీక్షలు-భక్తి




దీక్షలు-భక్తి 

విజయదశమినుంచి సంక్రాతి వరకు ఆంధ్రావని అంతా దీక్షాపరులతో నిండి ఉంటుంది. నల్లబట్టలు, కాషాయరంగు బట్టలు, ఎర్రబట్టలు కట్టుకొని మెడలో రుద్రాక్ష మాలలతో, తులసి మాలలతో, పగడాలు, స్ఫటిక మాలలతో ఇష్టదైవం ముద్ర(బిళ్ల)ను ధరించి నుదుట విబూది, చందనం, కుంకుమ బొట్టుతో మాసిన గెడ్డంతో చెప్పులు లేకుండా నడుస్తూ అడుగడుగునా తారసపడుతూ ఉంటారు. కొందరు కనిపించగానే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. కొందర్ని చూడగానే పాదాభివందనం చేయాలనిపిస్తుంది. దీక్షచేసేవారు భక్తితో చేస్తే దైవ స్వరూపులుగా, దివ్యకాంతితో కనిపిస్తారు. మొక్కుబడిగా పెద్దల బలవంతంతోనో, భార్యామణి బలవంతంతోనో తమకున్న దుర్వ్యసనాలు (తాగుడు, జూదం, పొగతాగడం, వ్యభిచారం) మానడానికి మండల దీక్ష (41రోజులు) ఆరంభించినవారు రోజులు లెక్కపెట్టి చేయడంవల్ల వారి ముఖాలు కాంతిహీనంగా ఉంటాయి.
దీక్షలకు భక్తి ప్రధానం. మండల దీక్షకు నిత్య నియమావళి ఒకటి ఉంటుంది. 'తత్వమసి' సిద్ధాంతమే ఈ దీక్షలకు పట్టుగొమ్మ. ప్రతీ ఒక్కరిలో దైవాన్ని దర్శించాలి. పశుపక్ష్యాదుల పట్లా కరుణ చూపాలి. వాటిలో దైవాన్ని చూడాలి. భూతదయతో దానధర్మాలు, సత్సంగం చేస్తూ సజ్జనుడిగా మెలగాలి. బ్రహ్మచర్యవ్రతం దీక్షకు మూలం కావడంవల్ల తెల్లవారుజామున నిద్రలేచి, చన్నీటి తలస్నానం రెండు పూటలా చేస్తూ నేలపై నిద్రించాలి. ఒకపూట భోజనం, రెండో పూట అల్పాహారం(మితంగా సాత్వికాహారం) మాత్రమే ప్రతిరోజూ భుజించాలి. ఉదయం, సాయంత్రం స్నానం ముగించుకొని దీపారాధన చేసి, ఇష్టదేవతల పూజ ఆచరించాలి. ప్రతిరోజూ దేవాలయాలు సందర్శిస్తుండాలి. పూజలకో, భజనలకో వెళ్ళి భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి.

దైవం ముందు అందరూ సమానమే. కుల మత భేదాలు మరచి పోవాలి. అంతస్తు, హోదా మరచి ఒకేరంగు దుస్తులు ధరించి అంతా కలిసిమెలిసి తిరుగుతూ పూజలు, భజనల్లో పాల్గొనాలి. అన్నదానం జరిగినప్పుడు సహపంక్తి భోజనం చేయడం, వంట వడ్డింపుల్లో సాయం చేయడమే కాకుండా, స్వాములు భోజనం చేసిన ఎంగిలి ఆకులు ఎత్తడానికి పోటీపడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భక్తి పారవశ్యంలో ప్రతి ఒక్కరిలో దైవాన్ని దర్శించడం చేతనే స్వాములు అందర్నీ భగవదవతారాలుగా భావించి సేవలు చేస్తారు.

మానవుడిలో పేరుకుపోయి ఉన్న అష్టరాగాలు, త్రిగుణాలు, పంచేంద్రియాలను జయించి; విద్య, అవిద్యలనూ భగవంతుడికి అర్పణ చేసి శరణాగతుడు కావాలని చెప్పడమే శబరిమలలో ఉన్న పద్దెనిమిది మెట్లకు (పదునెట్టాంబడి) అర్థమని విజ్ఞులు చెబుతారు. కోరికలు, అహంకారం, గర్వం విడనాడి సత్వగుణాన్ని అలవరచుకోవాలి. మండల దీక్ష (41రోజులు) చేశారంటే రోజురోజుకు భక్తి పెరిగి, మనసంతా దేవుడిపైనే లగ్నం కావాలి. భక్తి పారవశ్యంలో దేవుణ్ని చూడగలగాలి. ఆ స్థాయికి ఎదిగి ఇరుముడి కట్టుకొని యాత్రకు బయలుదేరి కొబ్బరి కాయ రూపంలో దేహాన్ని ఆత్మను పరమేశ్వరుడికి సమర్పించి, శరణాగతుడు కావడమే దీక్ష లక్ష్యం.

కొందరు దుర్వ్యసనాలను వదలుకోవడానికి మాల ధరించి దీక్ష ప్రారంభించి, యాత్ర పూర్తి కాగానే దీక్ష విరమించి, మరల పాత అలవాట్లకు బానిసలవుతుండటంవల్ల- దీక్ష, యాత్రల లక్ష్యం నెరవేరడం లేదు. భక్తి కొరవడి మొక్కుబడిగా చేసే దీక్షలవల్ల ప్రయోజనం ఉండదు. సామాన్య మానవుడికి, దీక్షగా యాత్ర చేసి వచ్చిన స్వామికి తేడా ఉండాలి. దీక్షానంతరం సజ్జనుడిగా మెలగినప్పుడే తగిన గౌరవం, ఆదరణ లభిస్తుంది. దీక్ష విలువ పెరుగుతుంది. స్వామిశరణం.

- మహాభాష్యం నరసింహారావు