ᐅఅక్షర దీపాలు
జీవన వృక్షంపై రెండే రెండు అమృతఫలాలు ఉన్నాయి. సద్గ్రంథ పఠనం ఒకటి. సజ్జన సాంగత్యం మరొకటి. తొలి మానవదశనుంచి ఆధునిక మానవ సంస్కృతీశిఖరం వరకు సాధించిన జ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యం పుస్తకమే. మనిషికి నిరామయ క్షణాల్లో వినోదం, ఆహ్లాదం, వికాసం కలిగించే దివ్యసాధనమది. పుస్తకాలవైపు చూడకుండా కొందరు జీవితాలు గడిపేస్తుంటారు. పుస్తకాలు ఉన్నాయన్న స్పృహ వారికి కలగదు. ఆకాశంలోని నక్షత్రాల అందాలను ఎందరు చూస్తారు? పుస్తకాల్లోని అక్షర సౌందర్యాన్ని, మహత్యాన్ని ఎందరు ఆస్వాదించగలరు?
ఇటీవలి కాలంలో ఎన్ని పుస్తకాలు వస్తున్నాయి? ఏవి చదవాలి? కేవలం ఉత్కంఠ, క్షణికోత్తేజం కలిగించే పుస్తకాలు చదివితే చాలా?
'ప్రతిరోజూ ఉదయాన్నే ఒక మంచి పుస్తకంలోని వాక్యాలు చదవాలి. ఒక మంచి పాట వినాలి- ఒక అందమైన చిత్తరువును చూసి ఆనందించాలి. వీలైతే కొన్ని మంచిమాటలు మాట్లాడటం నేర్చుకోవాలి' అంటాడు జర్మన్ కవి గెథె. మంచిపుస్తకాలు మంచిగంధం వంటివి. ఆత్మకు రాసుకుంటే జన్మలన్నీ పరిమళించవా? మంచిపుస్తకం మంచిమిత్రుడి లాంటిది. ఎన్నో మంచికబుర్లు చెప్పి మంచి మార్గంలోకి మళ్లిస్తుంది. చాలామంది కాలక్షేపం కోసమే పుస్తకాలు చదువుతారు. అటువంటివి పరిమిత లక్ష్యంతో కూడిన పుస్తకాలు. పరిమిత జీవితం అందించడం మాత్రమే వాటి క్షణిక లక్ష్యం.
క్షణంలో ద్రవీభూతమయ్యే మంచు బిందువుల వంటి పుస్తకాలు చదవడం కన్నా నిష్కల్మషత్వానికి, నిర్మలత్వానికి, జీవన సందేశానికి సంకేతాలైన మంచి ముత్యాల వంటి పుస్తకాలు చదివితే జీవితానికి కొత్తవెలుగు వస్తుంది. మనసులో అనేక ప్రపంచాల ద్వారాలు తెరచుకొంటాయి.
జ్ఞాన సాగరాలవంటి పుస్తకాలు ఎన్నో. వాటిలోని అక్షర సంపద అనంతకాల నిక్షేపం కాదా! మనోవికాసం, జీవనవికాసం, ఆత్మవికాసం- మంచిపుస్తకాలు అందించే ప్రస్థానత్రయం! మనిషి జడమయ జీవితాన్ని తట్టిలేపే వెలుగునిచ్చే బంగారు పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. వాటిలోని అక్షరాలు సూర్యోదయాలు. అమృత మహార్ణవాలు. జీవితానికి అర్థంకోసం గాలించే పుస్తకాలు. విధివేసిన చిక్కుముడి విప్పే పుస్తకాలు. జీవన వేదానికి భాష్యం చెప్పే పుస్తకాలు ఉన్నాయి. వాటిని వెదకాలి. ఈ ప్రపంచమనే పుస్తకభాండాగారంలో అవి దాక్కొని ఉంటాయి. వాటిని వెదకడంలోనే మనిషి వివేకం, వివేచన నిబిడీకృతమై ఉన్నాయి.
అందనిదేదో అందుకోవాలని, జీవితానికి పరిపూర్ణత్వాన్ని సాధించాలన్న తపనతో, తపస్సుతో, దాహాగ్నితో, ఆకాంక్షతో మానవప్రజ్ఞ జ్వలిస్తుంది. మానవ సృజనాత్మక దీప్తి ఎన్నెన్ని అక్షర ఇంద్రజాల విన్యాసాలు చేస్తున్నదో అంతర్నేత్రం ముందు సాక్షాత్కరించకమానదు. జీవితానికి ఎన్నో మజిలీలు ఉన్నాయి. ప్రతి మజిలీ గమ్యం కాదు. ప్రతి మజిలీ విశ్రాంతి స్థావరం కాదు. ఇక ముందుకు వెళ్లను అనుకోవడం మూర్ఖత్వం, జడత్వం. అంతర్వికాసం చివరి మజిలీ. పుస్తకాలే అటువైపు దారిచూపే మణిదీపికలు. చీకట్లను పారదోలే కాంతిపుంజాలు అవి. క్షుద్రప్రపంచంలో అమృతరూపాలను చూపే మంత్ర దర్పణాలు అవి. ఈ లోకంలో విధిపాశాల మధ్య మంచిచెడుల సంఘర్షణలో అంతరాత్మ అంతర్మథనాన్ని ఆపగల మోహన మయూఖాలు. అతిలోక సౌందర్య దృశ్యాలు, అశ్రుత గాంధర్వాలు. నిఖిలలోకాలకు ఆవల నిరంతర సత్యాన్ని చూపగల రహస్తంత్రీనాదాలు అవి.
మంచి పుస్తకాలు దేవతల సంతకాలు. శాశ్వతత్వం గీసుకొన్న రేఖాచిత్రాలు. మనం కోరేది కరిగిపోయే స్వప్నం లాంటి పుస్తకం కాదు. భూమిపై మనతోపాటే, మానవత్వమే పునాదులుగా పెరిగే స్వర్గంలాంటి పుస్తకాల్ని. విజ్ఞానం, వినోదాలు- అవే పుస్తకాలు కాదు. కనిపించని నక్షత్రాల్లా ఆత్మోపలబ్ధికి దారితీసే పుస్తకాలు ఉన్నాయి. అవే చదవాలి. అదే సద్గ్రంథ పఠనం.
అణువులతో అసంఖ్యాక ప్రపంచాలు సృష్టిస్తున్నాడు భగవంతుడు. అక్షరాలతో అంతులేని సాహితీవనాలు సృజిస్తున్నాడు మనిషి. 'లోకాలు నశించినా విద్య నశించదు' అన్నాడు భర్తృహరి. వేదమంత్రాలు యుగాలు దాటి, ప్రళయాలు దాటి ఇప్పటికీ మనకు వినిపిస్తున్నాయి. అక్షరాలు నశించవు. మంత్రధ్వనాలై భవిష్యత్ మానవాళికి అనంత తేజోనివహం అందించే దీపశిఖలై భాసిస్తాయి. అసలైన సాహిత్యం అక్షరం. (క్షరం కానిది). 'అక్షరం' వైపే మానవ మహాయాత్ర! అదే, అదే అంతిమ శిఖరారోహణం!
- కె.యజ్ఞన్న