ᐅఆధ్యాత్మిక సంపద
ప్రాపంచిక సంపదల కోసం శరీరంలో ఓపిక ఉన్నంత వరకు నానారకాల పాట్లు పడుతూనే ఉంటాడు మనిషి. వార్ధక్య దశ ప్రారంభం కాగానే జీవన వేగం తగ్గిపోతుంది. ఒకప్పుడు అనాయాసంగా చేసినవిప్పుడు ఆయాసపడుతూ చేయాల్సి వస్తుంది. సిరిసంపదలు ఆర్జించినప్పుడు పడిన శ్రమను మరచి వాటిని అనుభవిస్తూ ఆనందించగల అదృష్టం అందరికీ ఉండదు. బీదవాడు ధనంలో సుఖముందనుకుంటాడు. ధనికుడు చీకూచింతా లేని బీదవాడే సుఖంగా ఉన్నాడనుకుంటాడు. సుఖం చిరునామా ధనంలోనో, సౌకర్యాల్లోనో దొరకదు. అది మనసులోనే ఉంది. ఈ సత్యం అర్థం కావటానికి చాలాకాలం పడుతుంది.
మనిషి తన అన్ని సంపదలూ వారసులకు అప్పగించే సమయం ఏదో రోజు తప్పక వస్తుంది. శరీరాన్ని శ్మశానానికి తరలించి అక్కడ కర్మక్రియలు పూర్తిచేశాక, వారసులు క్రమంగా తమకు సంపదలు ఇచ్చిన వారిని మరిచిపోతారు. విచిత్రం ఏమిటంటే, వారి జీవిత కథ కూడా అదే గాడిలో నడుస్తుంది.
ప్రాపంచిక సంపదలు ఆర్జించేందుకు ప్రయాసపడటం తప్పు కాదు. అది అవసరం, అనివార్యం కూడా. అయితే ఆత్మకు అవసరమైనది ఆధ్యాత్మిక సంపద. దాని విషయం విస్మరించకూడదు. కనీసం ఆశలు, ఆకాంక్షలు కొంతవరకైనా తీర్చుకున్నాక ఆధ్యాత్మిక జీవితం మీద మనసు పెట్టాలి.
ఆదాయం తెచ్చే వృత్తి వ్యాపారాల విరమణ తరవాత, ఆధ్యాత్మిక జ్ఞానం ఆర్జించగల ఉపాయాలు అన్వేషించాలి. అందరికీ ఒకే విధానం పనికిరాదు. ఎవరి మనస్తత్వం అభిరుచినిబట్టి, తమకు అనుకూలమైన మార్గాన్ని వారు ఎంపిక చేసుకోవాలి. ఆధ్యాత్మిక సంపదను ఆర్జించాలి.
ఇంతకీ ఏది ఆధ్యాత్మిక సంపద? ఎలా ఆర్జించాలి? ఉపాయాలేమిటి? పూజలా, జపతపాలా, హోమాలా... ఇంకా అలాంటివా? అసలివన్నీ ఎందుకు... ఏమి ఆశించి చేస్తున్నట్లు? దైవ సాక్షాత్కారం అంత తేలిక కాదు. మరింకేమి కావాలి?
స్థిరమైన, శాశ్వతమైన ఆనందం అంటూ ఏదైనా ఉంటే- అది, ఆధ్మాత్మిక ఆనందమే. దాన్నే ఆత్మానందమంటారు. 'ఆత్మ తప్ప అన్నీ అబద్ధమే' అన్న సత్యం అర్థం అయ్యేవరకు అన్నీ మనల్ని భ్రమలో ముంచెత్తుతుంటాయి. 'నేను ఆత్మను' అనుకున్న క్షణం నుంచీ ప్రాపంచిక ప్రలోభాలు సమసిపోతాయి. అదే క్షణంలో మన ఆధ్యాత్మిక సంపద అభివృద్ధి చెందడం మొదలవుతుంది. అంతకన్నా మనిషికి లభించగల గొప్పసంపద మరోటి ఉండదు.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్