ᐅయాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు
ᐅయాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు
వివిధ దైవ క్షేత్రాల్లో కాలోత్సవాలు నిర్వహించే పద్ధతిని వైఖానస మహర్షి మరీచి సూచించాడంటారు. కాలోత్సవాల్లో బ్రహ్మోత్సవం అతి ప్రధానమైన ఉత్సవం. లోక శాంతికోసం బ్రహ్మోత్సవాలను తొమ్మిదిరోజులపాటు నిర్వహిస్తారు. ఆలయాల్లో ధ్రువమూర్తిని అనుసరించి బ్రహ్మోత్సవ కాలాన్ని పరమాత్మికోపనిషత్తు సూచిస్తోంది. యాదగిరిగుట్టపై వెలసిన లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ శుద్ధ తదియ నుంచి ప్రారంభం అవుతున్నాయి.
కోరికలతో కొందరు, భక్తితో మరికొందరు దైవదర్శనం చేసుకొంటారు. తెలిసో తెలియకో తాము చేసిన పాప ప్రక్షాళన కోసం మరెందరో క్షేత్రయాత్రలు చేస్తారు. భక్తుల కోరికలను తీర్చే భారం క్షేత్ర పాలకుడిదేనని పాంచరాత్రాగమంలో ఉంది. యాత్రికుల పాప ప్రక్షాళన తరవాత ఆ పాపాలను క్షేత్రపాలకుడే మోస్తాడని వరాహపురాణం చెబుతోంది. క్షేత్ర పాలకుడి పాపభారాన్ని తొలగించేందుకు బ్రహ్మ తానే కర్తగా క్షేత్రాల్లో ఉత్సవం నిర్వహించి పవిత్రం చేస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఇలా ప్రతియేటా బ్రహ్మ స్వయంగా నిర్వహిస్తాడని విశ్వసించే ఉత్సవాన్నే బ్రహ్మోత్సవం అంటారు. ఏ క్షేత్రంలో బ్రహ్మోత్సవం జరుగుతున్నా తొమ్మిదిరోజులు బ్రహ్మ సత్యలోకాన్ని విడిచి ఆ క్షేత్రంలోనే ఉంటాడని ప్రతీతి. అందుకే బ్రహ్మోత్సవాల సమయంలో వూరేగింపు రథంపై ఉత్సవమూర్తుల ముందు సముచిత ఆసనాన్ని ఖాళీగా ఉంచుతారు. ఆ ఆసనంలో స్వయానా విరించి ఆసీనుడై ఉత్సవాలను పర్యవేక్షిస్తాడన్నది నమ్మకం.
యాదగిరిగుట్టలో క్షేత్ర పాలకుడు హనుమంతుడు. ఆయన ఆహ్వానంపై కోదండపాణిగా తొమ్మిది రోజులూ రామభద్రుడు ఇక్కడే ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో ఇదొక ప్రత్యేకత. బ్రహ్మోత్సవ కాలంలో యాదగిరిగుట్ట పరిసర జనపదాల్లో ఇంటింటా తొమ్మిదిరోజులు పండుగ చేసుకోవడం పూర్వకాలంనుంచీ వస్తున్న ఆచారం. అంకురార్పణతో ప్రారంభమయ్యే ఉత్సవాలు తొమ్మిదోరోజు క్షేత్రంలోని పుష్కరిణిలో ఉత్సవమూర్తుల అవభృత స్నానంతో ముగుస్తాయి. మనరాష్ట్రంలో నృసింహుని ఆలయాలు చాలా ఉన్నాయి. అందులో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు సింహాచలం, అహోబిలం, యాదగిరిగుట్ట! యాదగిరిగుట్టలో నరమృగ శరీరధారి గుట్టలోని గుహలో తేజోవంతుడై వెలశాడంటారు. ఈ దైవం ఒక గుహలో స్వయంభువుగా ఉండటం ఈ క్షేత్రవిశేషం! ఎంతటివారైనా ఇక్కడ తల వంచి నరసింహుని దర్శనం చేసుకోవాల్సిందే!
మరెక్కడా లేనివిధంగా యాదగిరిగుట్టలో నరసింహుడు అయిదు రూపాల్లో ఉంటాడని చెబుతారు. జ్వాలానరసింహుడిగా, ఉగ్రనరసింహుడిగా, యోగ నరసింహుడిగా, గండభేరుండ నరసింహుడిగా, ధ్యాన నరసింహుడిగా ఈ క్షేత్రంలో ఉంటాడన్నది స్థలపురాణం. శ్రీలక్ష్మి నృసింహుడి అంకంపై కూర్చొని ఉన్న కారణంగా ఈ దైవాన్ని లక్ష్మీనరసింహుడిగా కొలుస్తారు. రుష్యశృంగుని కుమారుడు యాదర్షి ఈ కొండ గుహలో నరసింహస్వామి దర్శనంకోసం తపస్సు చేశాడని అంటారు. తపస్సుకు ఈ కొండ అత్యంత పవిత్రమైందని యాదర్షికి హనుమంతుడు సూచించాడని, ఇక్కడే యాదర్షి త్రేతాయుగం చివర్లో నలభైవేల సంవత్సరాలు నరమృగ శరీరునికోసం తపస్సు చేశాడని పురాణాల్లో ఉంది. గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణంలోనూ ఈ ప్రస్తావన కనిపిస్తుంది. శ్రీరాముడు కిష్కింధకు వెళ్తూ యాదగిరిపై ఒక రాత్రి నివసించాడట. పాండవులు తమ వనవాసకాలంలోనూ ఈ ప్రాంతంలో సంచరించారని నమ్ముతారు.
యాదర్షి తపస్సుకు మెచ్చి నరసింహుడు తొలుత తన నిజరూపంలో దర్శనమిచ్చాడంటారు. అలాంటి ఉగ్రనరమృగ శరీరుని చూడతరంకాక ప్రసన్నరూపంలో శ్రీలక్ష్మీ సమేతుడై దర్శనమివ్వమని ప్రార్థించాడు. మహర్షి కోరికను మన్నించి యాదర్షి తపస్సు చేసిన గుహలోనే లక్ష్మీసమేత యోగనరసింహుడిగా దర్శనమిచ్చాడని చెబుతారు. రుషి దైవాన్ని వేడుకొని ఆ గుహలోనే ప్రళయాంతం వరకూ భక్తుల కామ్యాలను తీరుస్తుండాలని అడిగాడని, దైవం అలా వెలసి భక్తుల కొంగుబంగారంగా యాదగిరిగుట్టలో ఉన్నాడనీ ఎందరో నమ్ముతారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఉత్సవమూర్తుల వూరేగింపులు, ప్రత్యేకపూజలు, రంగురంగుల దీపాలంకరణలతో యాదగిరిగుట్ట వైభవంగా భాసిస్తుంది.
- అప్పరుసు రమాకాంతరావు