ᐅబాధే సౌఖ్యం
సమస్యలు సముద్రకెరటాల్లాంటివి. అసలు జీవితమంటేనే ఒక సమస్య నుంచి మరో సమస్యకు ప్రయాణించడం. ఏ బాధాలేకుండా బతుకంతా గడపాలనుకోవడం అవివేకం. మనిషికి భగవంతుడు బుద్ధి, జ్ఞానం ఇచ్చాడు. అంటే ఎలాంటి సమస్య ఎదురైనా అదరక, బెదరక, చెక్కుచెదరక మొక్కవోని ఆత్మస్త్థెర్యంతో పరిష్కారం దిశగా పయనించాలన్నది భగవంతుడి నిర్దేశం. కాని, మనిషి ఏం చేస్తున్నాడు? చిన్న సమస్య ఎదురైనా తల్లడిల్లిపోతున్నాడు. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక స్వామీజీలు, బాబాలు అంటూ పరుగులు తీస్తున్నాడు. వారి సూచనలు, సలహాలు, ఆశీస్సులవల్లనే పరిష్కారం లభిస్తుందని ఆరాటపడుతున్నాడు. సొంత తెలివిని, జ్ఞానాన్ని ఆవలకునెట్టి పక్కదారులు తొక్కుతున్నాడు.
అసలు ఏ బాధా సమస్యా దుఃఖమూ లేని మనిషి ఇంతవరకూ పుట్టాడా? శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పాండవులు, బుద్ధుడు వంటి వారికి తమ జీవితాల్లో ఎన్ని సమస్యలు ఎదురుకాలేదు? వాటిని వారు ఎంత సంయమనంతో ఎదుర్కొని విజయాలు సాధించారో మనం ఇక్కడ మననం చేసుకోవాలి. తనకు వచ్చే అన్ని సమస్యలకూ మూలం తానేనన్న నిజం మనిషి గ్రహించాలి. తన కష్టాలను ఇతరులపైకి నెట్టి తాను గొప్ప నిజాయతీపరుణ్నన్న భ్రమలోనుంచి ముందు అతడు బయటపడాలి. అప్పుడే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. ప్రపంచంలో ఏ సమస్యకైనా పరిష్కారం ఉండనే ఉంటుంది. ముందు దాన్ని అన్వేషించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. కష్టాలు, సుఖాలు జీవితంలో అంతర్భాగాలుగా గుర్తెరగాలి... కేవలం సుఖాలనే జీవితమంతా అనుభవించినవారు ఇంతవరకూ పుట్టలేదన్న సత్యాన్ని గుర్తెరగాలి. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా గతంలో ఎవరెవరు ఎలా బయటపడ్డారన్న సూక్ష్మాన్ని గ్రహించాలి.
మానవుడికి దైవం ఇచ్చిన జ్ఞానపేటికను విస్మరించి ఎండమావుల వెంట పరిగెత్తడం ఎంత అవివేకం? సమస్యలను ఎదుర్కొనే సత్తా అంతా ఆ పేటికలోనే ఉంటుంది. దాన్ని వెతకడం మానేసి ఎవరో ఏదో చేస్తారన్న అజ్ఞానంతో మాయలు, మహత్తుల వలయంలో చిక్కుకొని పరిభ్రమించడం మనిషి బలహీనతగా భావించాలి... అందుకే మనిషి తనలోని 'జ్ఞానపేటిక'ను గుర్తించగలిగితేనే జీవిత పరమార్థం లభిస్తుంది!
- కిల్లాన మోహన్‌బాబు