ᐅభువికి అలంకృతులు సుకృతులు



భువికి అలంకృతులు సుకృతులు

సజ్జనులకు కొన్ని సహజ గుణాలుంటాయి. ఆపదల్లో ధైర్యంగా ఉండటం, ఐశ్వర్యం వచ్చిపడినా అహంకరించకుండా ఉండటం, సభల్లో పుష్కల వాక్చాతుర్యం, కీర్తిపై అనురాగం, విద్యల అభివృద్ధికి ప్రయత్నం- ఇలాంటి గుణాలు సజ్జనులకు సామాన్యం!
సుజనులు మాతాపితలకు ఎల్లప్పుడూ సేవ చేస్తారు. అసత్యాన్నీ అన్యదూషణాన్నీ ఎన్నడూ నాలుకపైకి రానీయరు. ఇతరుల ధనంపై ఆశ ఉండదు.

ఉత్తముడు ఉన్నత పదవి పొందినా, మనసులో అంతకంటే ఉన్నత భావాలే ఉంటాయిగాని, దిగజారడు. పరుల ధనాన్ని మట్టిగడ్డలా చూస్తాడు. పరుల భార్యను తల్లిలా భావిస్తాడు, పరుల లాభాన్ని తన లాభంలాగా తలుస్తాడు. పుణ్యాత్ములు దుర్జన సహవాసాన్ని, దుష్ట సంభాషణను విడిచిపెడతారు. 'మంచివారితో స్నేహం, ఇతరుల సద్గుణాలను మెచ్చుకోవడం, గురువుల వద్ద వినయం, విద్యలపై ఆసక్తి, స్వభార్యపై అనురక్తి, జనాపవాదానికి భయం- ఈ నిర్మల గుణాలుగల పుణ్యాత్ములకు నా నమస్కారం' అని సజ్జన లక్షణాలను పరోక్షంగా పేర్కొన్నాడు భర్తృహరి. వీటిలో 'జనాపవాదానికి భయం' అనేదే రామరాజ్యానికి మూలం. ప్రజావాక్య పాలనార్థం ధర్మపత్నిని కూడా వదిలిపెట్టాడు శ్రీరామచంద్రుడు. అదే శ్రీరామరాజ్యం.

'చలిచీమను కూడా తొక్కడానికి మనసొప్పదు. ఎన్నడూ అసత్యం పలకడు. కలుష వర్తనుల స్నేహం చేయడు. కలిమిలేములను సమానంగా చూస్తాడు. పర స్త్రీలను తలయెత్తి చూడడు. ఇతరుల సంపదను ఆశింపడు. పరనింద చేయడు. ధైర్యాన్ని వీడడు'- అని సుజనుడి గుణగణాలను 'పాండురంగ మాహాత్మ్యం' ప్రశంసించింది. అలాంటి సుకృతాత్ముడే ఆదర్శజీవనుడు, మహాత్ముడు!

రామాయణ కథానాయకుడిలో ఈ లక్షణాలన్నీ రాశీభూతమై ఉన్నాయి. అందుకే శ్రీరామచంద్రుడు సార్వజనీన, సార్వకాలీన ఆదర్శ కథానాయకుడయ్యాడు. తలపై బంగారు కిరీటం ధరించాల్సిన శుభముహూర్తంలో, అరణ్యవాసాన్ని ఆనందంగా స్వీకరించాడు. కష్టసుఖాలను సమానంగా సంభావించాడు. శూర్పణఖపట్ల విముఖత చూపాడు. అరణ్యవాసంలో ఎదురైన ఆపదలను ధైర్యంతో ఎదుర్కొన్నాడు! కష్టాలను ఎదుర్కొనే గుండె నిబ్బరాన్ని రామనామం ప్రసాదిస్తుంది. కష్టాల కడలి నుంచి మనల్ని తరింపజేసే తారకమంత్రం 'రామ'!

'రాముడు అరణ్యవాసం చేయాలి' అని తన చిన్నమ్మ తండ్రిని కోరిందని వినగానే, శ్రీరాముడు అరణ్యవాసానికి సంసిద్ధుడయ్యాడు. 'మీ తండ్రిగారు కాదుకదా చెప్పింది!' అనగా, 'అమ్మ అయినా, నాన్న అయినా ఒక్కటే! అమ్మ ఆజ్ఞాపిస్తే నాన్న ఆజ్ఞాపించినట్లే' అని మాతృభక్తి ప్రదర్శించాడు. అన్నింటికంటే మించి 'తల్లీ, పుట్టిన నేలా స్వర్గంకంటే గొప్పవి' అని శ్రీరామచంద్రుడు చేసిన ఉపదేశం ఆచరణీయ ఆదర్శం.

సాక్షాత్తు పాండురంగడే ప్రత్యక్షమై పిలిస్తే, 'స్వామీ! మా నాన్నగారికి పాదసేవ చేస్తున్నాను... ఇప్పుడు రావడానికి కుదరదు!' అని విన్నవించిన సదాచార సంపన్నుడు పుండరీకుడు సదా స్మరణీయుడు. ఇటువంటివారు భూమాతకు అలంకారాలు!

- పి.భారతి