ᐅఅందరితో మనం



అందరితో మనం... 

ఆది మధ్యాంత రహితుడు, అద్వితీయుడు అయిన భగవంతుడు ఒక్కడే. ఆయనీ ప్రపంచాన్ని సామూహిక జీవజాలంగా, సంఘటిత శక్తిగా సృజించాడు. పంచ భూతాత్మకమైనది ప్రపంచం. మళ్ళీ ఆ అయిదు భూతాల్లోని ప్రతి భూతంలో మిగిలిన నాలుగింటినీ తగు పాళ్లలో సమ్మిళితం చేసి దేనికి దాన్నే మరింత శక్తిమంతం చేశాడు. కలుపుకొనిపోయే తత్వాన్ని అణువణువునా పాదుగొలిపాడు. లోకంలో ఏ ఒక్క ప్రాణీ వేరేవాటితో సంబంధం లేకుండా జీవించలేదు. అందుకే సమ్మిళిత స్వభావాన్ని సమష్టి తత్వాన్ని దాని జీవ నిర్మాణంలోనే కలగలిపి జీవ స్వభావంగా నిక్షిప్తం చేశాడు. కానీ మనుషులు శ్రుతిమించిన, వక్రించిన బుద్ధిశక్తితో సహజంగానే వ్యతిరేక దిశగా ప్రయాణిస్తున్నారు. దేవుడే అందించిన బలాన్ని, బలగాన్ని తనది కాదనుకుని, మనిషి తానేదో స్వయంగా సంపాదించుకున్న పూర్వధనంగా జీవితాన్ని, అందులోని వనరులను భావించుకుంటున్నాడు. వాటిని సంరక్షించుకునే నెపంతో ప్రపంచంతో, ప్రతి మనిషితో, ప్రతి జీవితో, ప్రకృతితో విభేదించి దూరంగా పారిపోతున్నాడు. విజయం అనుకుంటూ పరాజయం దిశగా పరుగులు పెడుతున్నాడు. ఇది పొరపాటు. ఒక చెట్టు పుట్టి పెరిగి ఫలవంతం అవుతుందంటే క్షేత్రం, జలం, ఎంత, ఎరువులు, కంచె, కాపలా, వనరు, వాన, గాలి, మాలి... ఎన్నో కావాలి. మనుషులకు కూడా అంతే. కోరికలోంచి పుట్టి, కోరికలనే ఆహారంగా పెరిగే మనిషికి ఇతర ప్రాణులు, వనరులతో మరింత అవసరం. దాన్ని గుర్తిస్తున్నామా? చెట్టు తాను పొందిన ప్రేమను, సేవను, సహాయాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తోంది. మరణంలోనూ మరచిపోలేని సేవలందిస్తోంది. మనిషి?
సామాజిక జీవితంలోనే కాదు, పారమార్థిక జీవితంలోనూ మనిషి సామూహిక ప్రయాణమే చేయాలి. నిజానికి ప్రపంచమూ, పారమార్థికమూ వేరు కాదు. రెండు కళ్లలా, ఒకే చూపుతో దృష్టిని ప్రగతివైపు సారించాల్సి ఉంది. రెండు కాళ్లలా ఒకే మార్గంమీద, ఒకే గమ్యంవైపు ప్రయాణం సాగించాల్సి ఉంది. సామాజిక జీవనం ఎంతవరకు ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందో ఇదమిత్థంగా చెప్పలేంగానీ, ఆధ్యాత్మిక జీవితం మాత్రం సామాజిక జీవితాన్ని సానుకూల దృక్పథాన్నిస్తూ ప్రభావవంతం చేస్తుంది. జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకునే అవకాశం కల్పిస్తుంది. మరి ఒక సాధకుడు లేదా భక్తుడు ఒంటరిగానే సాధన సాగించాల్సి ఉన్నప్పుడు, అందరినీ ఎలా కలుపుకొనిపోగలడు!? అది ఎలా ప్రయోజనకరం కాగలదు? అరణ్యాల్లోకో, కొండ గుహలవైపో వెళ్లిపోయిన తీవ్ర వైరాగ్యవంతుల విషయం పక్కన పెడితే- ప్రతి సాధకుడూ తానున్న పరిధిలో, తాను సాధించిన, సాధిస్తున్నమేరా ఇతరుల ప్రగతికి సహకారాన్ని అందించవచ్చు. తాను సాధించిన పారమార్థిక శక్తి ఫలాలను సమాజ ఉద్ధరణకు ఉపయోగించవచ్చు. ఆధ్యాత్మిక శక్తిని ఖర్చు చేయకూడదని విజ్ఞుల సలహా. నిష్కామంగా ప్రపంచోద్ధరణ కోసం ఉపయోగించే ఆధ్యాత్మిక శక్తి ఖర్చు కాకపోవటం అటుంచి ద్విగుణీకృతం అవుతుంది. నిజానికి భగవదున్ముఖులైనవారు జమాఖర్చుల గురించి ఆలోచించరు. గణాంకాలు, గుణింతాలు వాళ్ల లెక్కల్లోకి రావు. నిష్కామమే వారి జీవలక్షణమై ఉంటుంది. కల్యాణమే వారి లక్ష్యమైపోతుంది. వివేకానంద స్వామి 'ఈ లోకంలో చివరి జీవి ఉద్ధరణ పొందేవరకూ నా ముక్తిని కూడా నేను వాయిదా వేసుకోగలను' అని ప్రకటించారంటే నిష్కామమూ, లోకోద్ధరణకాంక్షే కారణం.

ప్రేమ, సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణలు, జ్ఞానయజ్ఞాలు, ప్రవచనాలు, రచనల ద్వారా స్ఫూర్తి, సాధనా రహస్యాలు, సహకారం... ఈ అన్నింటికంటే ఒక సాధకుడి బాట (ఉత్తమ ప్రవర్తన) ఒక గొప్ప మార్గసూచి అవుతుంది.

ఈ సమష్టి శక్తి భావన, అవగాహన దేవతలకూ ఉందంటున్నాయి పురాణ గాథలు. అయ్యప్పస్వామి అవతరణకు అదే కారణం. లలితాదేవి ఆవిర్భావానికి సమష్టి శక్తుల ఏకీకరణలోని సంఘటిత శక్తి ప్రభావాన్ని వినియోగించాలనే ఆలోచనే కారణం. మనం సహజంగానే సమ్మిళిత శక్తి చాలన రూపాలం. సమ్మిశ్రిత జనక స్వరూపాలం. ఏకాత్ములం. కష్టంలోనూ, సుఖంలోనూ, ప్రాపంచికంలోను, పారమార్థికంలోనూ... మనం అందరం కలిసి, కలుపుకొంటూ ముందుకు వెళ్లిపోదాం. ఏ ఒక్కరు వెనకబడినా ముందుకెళ్లినవారి ప్రగతి కుంటువడినట్లే!

- చక్కిలం విజయలక్ష్మి