ᐅజ్ఞాని పాదాలు
భగవంతుడి గురించి తెలుసుకోవడం అంత తేలిక కాదు. ఎంతో సాధన చెయ్యాలి. పవిత్రమైన దివ్యభావాల మధుమందారాలతో ఆరాధించాలి. భగవంతుని కృపవల్లనే ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞాని మానవులందరినీ సమదృష్టితో చూస్తాడు. అందరినీ దైవస్వరూపంగా భావించి ప్రేమిస్తాడు. అటువంటి జ్ఞానులు ప్రాతఃస్మరణీయులు. వారిపట్ల సదా భక్తిప్రపత్తులు ప్రదర్శించాలి. వారు పంచే జ్ఞానకాంతులు ఆత్మ వికాసానికి దోహదం చేస్తాయి. నిజమైన జ్ఞాని ఎవరినుంచీ ఏదీ ఆశించడు.
ఒకరాజు ఓ జ్ఞాని పాదాలపై తన శిరస్సు ఉంచి వినమ్రపూర్వకంగా అభివందనం చేశాడు. పక్కనే ఉన్న మంత్రికి అది నచ్చలేదు. 'దేశానికి రాజుగా ఉన్న మీరు ఆ జ్ఞాని పాదాలపై శిరస్సును ఎలా ఉంచారు? ఈ దేశ సార్వభౌమునిగా స్వర్ణ కిరీటాన్ని అలంకరించుకొన్న శిరస్సు మీది' అని మంత్రి అన్నాడు. రాజు 'తగిన సమయంలో నీకు సమాధానం చెప్తాను' అన్నాడు.
కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు రాజు మంత్రిని పిలిచి ఒక మేక తలను, పులి తలను, మనిషి తలను తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ విని మంత్రి అయోమయ స్థితిలో పడ్డాడు. ఈ ఆదేశం ఏమిటని ప్రశ్నించలేదు. మేక తల తీసుకొని రమ్మని మంత్రి తన మనుషులను పంపాడు. డబ్బు చెల్లించగానే ఒక కసాయివాడు మేక తల ఇచ్చాడు. పులి తల విపణిలో దొరకదు. మంత్రి ఆరితేరిన వేటగాళ్లను అడవికి పంపాడు. వారు పులిని చంపి దాని తలను తెచ్చి మంత్రికి ఇచ్చారు. ఇక మనిషి తల- ఎలా సంపాదించాలి? శవంనుంచి మనిషి తలను వేరు చేయడానికి ఎవరూ అంగీకరించరు. ఎలాగో అలాగ అతి కష్టంమీద మానవ శిరస్సును కూడా మంత్రి సంపాదించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు 'ఇప్పుడు నువ్వు ఆ మూడు తలల్ని ఇచ్చివెయ్యి' అన్నాడు. మళ్లీ మంత్రి దిగ్భ్రాంతి చెందాడు. 'కష్టపడి తెస్తే ఇచ్చేయమంటారేమిటి?' అనుకొన్నాడు మంత్రి. మేక తల ఇవ్వడం కష్టంకాదు. పులి తలను ఎవరూ తీసుకోరు. భయపడతారు. ఎవరినో బతిమాలుకొని ఎక్కువ ధనం ఎరచూపి పులి తల ఇచ్చేశాడు. ఎంత ధనం ఇచ్చినా, ఎన్ని బహుమతులు ఇస్తానన్నా మనిషి తల మాత్రం తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాన్ని ఇంట్లో ఎవరూ పెట్టుకోరు. మంత్రి రాజు వద్దకు వెళ్లి 'మనిషి తలను ఎవరూ స్వీకరించడం లేదు రాజా!' అన్నాడు. అప్పుడు రాజు 'మేక తలకు గాని, పులి తలకు గాని చచ్చిన తరవాత కొంత విలువ ఉంటుంది. మనిషి తలను ఎవరూ స్పృశించరు. అటువంటి ఎందుకూ కొరకాని నా తలను జ్ఞాని పాదాలపై ఉంచాను. నేను చేసింది తప్పా?' అన్నాడు.
ప్రాపంచిక విజయాలు కానీ, సుఖాలు కానీ విలువ లేనివి. జ్ఞాని పాదాలకు నమస్కరించడం కన్నా పుణ్యప్రదమైనది మరొకటి లేదు. ఆ పాదాలు మోక్షానికి స్వర్ణ సోపానాలు. భగవంతుడికి ఆత్మ సమర్పణ చేసుకొన్న జ్ఞాని భగవత్ స్వరూపుడే. అతని పాదాలు భగవంతుని అమృత పాదాలతో సమానం.
- కె.యజ్ఞన్న