ᐅఅందం- ఆనందం
తెల్లవారగానే లోకమంతా వెలుగు జిలుగులతో జిగేలుమంటుంది. చిరుగాలికి వూగే చెట్లూ, చెట్లపై పిట్టల కలకలా రావాలు. ప్రతి ఇంటా సంతోష సరాగాలు.
కనబడేది అంతా 'ఈశావాస్యం'- ఈశ్వర స్వరూపం. లోకమంతా సౌందర్యమయం. అన్నిటిలో అణువణువునా ఉన్న ఆ పరమాత్మే అందానికి కారకుడు. రాత్రి చీకటిలో ఈ సౌందర్యం కనబడదు. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే, చీకటి పలాయనం చిత్తగిస్తుంది. వెలుగువల్లనే ప్రతిదీ మనకు కనబడుతోంది. వాటిని చూసి ఆనందించగలుగుతున్నాం. 'అవి పరమేశ్వర రూపాలు' అనే జ్ఞానం కలిగితే 'పరమానందం' పొందుతాం.
పసిపిల్లలకు అమ్మ అంత చక్కనైనది ఎక్కడా కనిపించదు. 'మీ అమ్మను తీసుకువెళుతున్నాం, ఈ బొమ్మను నువ్వు తీసుకో!'- అంటే పసిది 'నాకు అమ్మే కావాలి' అని ఏడుస్తుంది. మనం తయారుచేసే యంత్రపు బొమ్మలూ సంతోషాన్ని కలిగిస్తాయి. కానీ, వాటితో ఆటలు జగన్మాత కరుణ ఉన్నంత వరకే! త్రిపుర సుందరీ మాత సౌందర్యం ముందు మనం చెక్కిన శిల్పాలు వెలవెల పోతాయి. శివం అంటే ఆనందం. జగన్మాత దివ్య సౌందర్యవతి. ఆనందం, సౌందర్యం కలిస్తే పరమేశ్వరుడు. శంకర భగవత్పాదులవారు శివానంద లహరినీ, సౌందర్య లహరినీ మనకు ప్రసాదించారు. సత్యం, కృతజ్ఞత, పరాక్రమం మొదలైన సద్గుణాలు ఉన్నచోటా; ఇంకా- కోపం, అసూయ మొదలైన దుర్గుణాలు లేని చోటా ఆనందం తాండవిస్తుంది. ఈ సద్గుణాలు కలిగినవారు లోకంలో ఉన్నారా అని వాల్మీకి నారదుణ్ని ప్రశ్నించాడు. నారదుడు స్పష్టంగా సమాధానం ఇచ్చాడు.
'శ్రీరాముడు' అని.
'అంతా రామమయం' అని జ్ఞానులు భావిస్తారు. ఒకాయన అంతా 'కామ మయం' అన్నాడు. విన్నవాళ్లు విస్తుపోయారు. 'అలా అనవచ్చా?' అని వాళ్లు వాపోతూ ఉండగా, చంద్రశేఖర సరస్వతీ స్వాములవారు 'నిజమే! అంతా కామ మయమే!' అన్నారు. శ్రోతలు ఆశ్చర్యచకితులయ్యారు. 'అవును! కామాక్షీ అమ్మది దివ్య సౌందర్యం. లోకమంతా అమ్మదే. కాబట్టి అంతా 'కామ'మయమే! అని సెలవిచ్చారు. సీతమ్మ రామాయణంలో ఒక సందర్భంలో రాముణ్ని 'నీవు పురుషుడివి కావు... స్త్రీవి!' అంటుంది. సీతమ్మ నోటి వెంట వచ్చిన పలుకు అర్థవంతమే. శ్రీత్రిపుర సుందరీ కామాక్షీ, శ్రీరాముడూ ఒక్కరే అని భావిస్తే, ఇక భేద భావం ఉండనే ఉండదు. ఇద్దరూ ఆనంద స్వరూపులే, సౌందర్యశాలురే! రామకోటి అన్నా, కామ కోటి అన్నా తేడాలేదు. 'కామి'గానివాడు మోక్షగామి కాడు.
'బ్రహ్మవిచారం' చేసిన స్త్రీలను బ్రహ్మవాదినులు అంటారు. కాత్యాయిని, మైత్రేయి యాజ్ఞవల్క్యుని భార్యలు. యాజ్ఞవల్క్యుడు సన్యాసం తీసుకోవాలని నిశ్చయించుకొన్నాడు. తన ధనాన్ని ఇద్దరు భార్యలకూ సమానంగా పంచుతానంటాడు. అప్పుడు బ్రహ్మవాదిని అయిన మైత్రేయి 'అమృతత్వం సిద్ధించే సంపదను నాకు ఇవ్వండి' అని భర్తను అడిగింది.
'భర్త భార్యపై, తల్లిదండ్రులు సంతానంపై, భక్తులు దేవతలపై చూపే ప్రేమ అంతా ఆత్మానందం కోసమే! మన ఆత్మకు ఆనందం కలిగించే వస్తువుపై మనకు అధిక ప్రేమ కలుగుతుంది. అది సంతోషానికి దారి తీస్తుంది. దీన్నిబట్టి, ఆత్మ 'ఆనందమయం'గా గ్రహించవచ్చు. ఈ 'ఆనంద స్వరూపం' గ్రహించగలిగితే, లోకం అంతా మనకు ప్రియమైనదిగానే గోచరిస్తుంది. కొన్నింటిపై ఇష్టం కలగడం వల్లనే మిగతావాటిపై ద్వేషం కలుగుతుంది. అన్నీ ఆనంద స్వరూపాలే అని గ్రహిస్తే అన్నీ అందంగానే కనబడతాయి. దేనిపైనా ద్వేషం కలగదు. జీవునికి 'ఉత్తమ గతి' పరమ సంపద. అదే పరమానందం. ఆ ఆనందంలో లేశమాత్రమైన ఏదో ఒక అంశాన్ని ఆధారం చేసుకొని జగత్తులో జనులు జీవిస్తున్నారు!' అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి ఉపదేశించాడు.
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు