ᐅభీష్మ ఏకాదశి



ᐅభీష్మ ఏకాదశి 

ఎవరికోసమూ ఆగనిది, ఎవరు చెప్పినా విననిది, కాలం సమీపిస్తే ఒక్క లిప్తపాటు గడువైనా ఇవ్వక కబళించేది- మృత్యువు. అలాంటి మరణాన్ని సైతం శాసించి, తాను కోరుకున్న పుణ్యతిథినాడు తనువు చాలించి భగవదైక్యం చెందినవాడు భీష్మాచార్యుడు. అంతటి గొప్పతనాన్ని సంపాదించుకోవడానికి ఆయన నిష్కల్మషమైన ప్రవర్తన, నిష్కర్షతో కూడిన నియమబద్ధ జీవన విధానమే కారణం.
గంగా(నది) దేవికి, శంతన మహారాజుకు జన్మించిన అష్టమ సంతానం దేవవ్రతుడు. వసిష్ఠుడి దగ్గర అన్ని విద్యలూ నేర్చుకుని బుద్ధిలో బృహస్పతితో సముడిగా పేరు తెచ్చుకున్నాడు. తండ్రి శంతనుడు ఒక రోజు తాను దాశరాజు కుమార్తె అయిన సత్యవతి మీద మనసు పడినట్లు చెప్పాడు. ఆమెకు కలిగిన సంతానానికి రాజ్యార్హత కల్పిస్తేనే సత్యవతి తనకు సొంతమవుతుందని చెప్పాడు. తండ్రి అంతరంగం అర్థం చేసుకున్న దేవవ్రతుడు- ఆయన కోరిక తీర్చడంకోసం తాను వివాహం చేసుకోకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని ప్రతిజ్ఞ చేశాడు. అలా భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ క్షణంనుంచీ అతడి పేరు 'భీష్ముడు'గా మారింది. కొడుకు త్యాగాన్ని మెచ్చుకున్న తండ్రి అతడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ప్రసాదించాడు.
సత్యవతికి శంతనుడి ద్వారా చిత్రాంగుడు, విచిత్ర వీర్యుడు అని ఇద్దరు బిడ్డలు కలిగారు. చిత్రాంగుడు గంధర్వులతో యుద్ధం చేస్తూ మరణించాడు. విచిత్ర వీర్యుణ్ని రాజుగా చేసి అంబిక, అంబాలిక అనే ఇద్దరు బాలికలనిచ్చి వివాహం చేశాడు భీష్ముడు. సంతానం కలగకుండానే అతడు మరణించాడు. తమ వంశం నిర్వంశం కాకూడదనే సంకల్పంతో పినతల్లి సత్యవతి, భీష్ముణ్ని పిలిచి, అతడి తమ్ముడి భార్య(అంబిక, అంబాలిక)లను సంతానవతులుగా చేసి వంశాన్ని నిలబెట్టమని కోరింది. అలా చేస్తే తన ప్రతిజ్ఞకు భంగం కలిగి తన సంతానమే రాజ్యమేలుతుందనిపించి నిరాకరించాడు భీష్ముడు. అయినప్పటికీ ఆ వంశం నిలబడటానికి వేదవిదుడైన వ్యాసుడి ద్వారా వారిని సంతానవతులు చేయించాడు. ఆ సంతానమే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు.

కురు పాండవుల మధ్య రాజ్యార్హత విషయంలో శత్రుత్వం ఏర్పడింది. అలా పెరిగిన వైరం కురుక్షేత్ర యుద్ధం వరకు దారి తీసింది. ఎవరికీ ఇష్టం లేకపోయినా బంధువులు, మిత్రులు, పరివారం అంతా ఇరు వర్గాలుగా విడిపోక తప్పలేదు. భీష్ముడు కౌరవపక్షం వహించాడు. నిష్పక్షపాతంగా, చిత్తశుద్ధితో, ధర్మబద్ధంగానే యుద్ధం చేశాడు. కాని ఆయన పాండవ పక్షపాతం చూపుతున్నాడని అపనమ్మకం ఏర్పడింది కౌరవులకు. అందుకే సైన్యాధ్యక్ష పదవి నుంచి తప్పుకొమ్మన్నాడు దుర్యోధనుడు. అయినా కౌరవుల క్షేమం కోరి తప్పుకోలేదతడు. పాండవసేనలో పరిస్థితి ఇంకోలా ఉంది. భీష్ముడు కౌరవ పక్షంలో ఉన్నంతసేపూ వారిని జయించడం తమవల్ల కాదనే నిశ్చయానికి వచ్చారు. అందుకే రహస్యంగా కలిసి జయించే మార్గం చెప్పమని ఆయననే ప్రార్థించారు. తాను కావాలి అనుకుంటున్నవాళ్లు, తనకు కావాలనుకున్నవాళ్లు ఇద్దరూ తనను వద్దనుకుంటున్నారు. కాబట్టి నిష్క్రమించాలని నిశ్చయించుకుని మార్గం సూచించాడు. ఆ మేరకు శిఖండిని యుద్ధరంగాన ఆయనకు ఎదురుగా నిలిపారు పాండవులు. యుద్ధభూమిలో శిఖండిని చూస్తూనే అస్త్ర సన్యాసం చేశాడు భీష్ముడు. అదే అదనుగా అర్జునుడు వేసిన బాణపు దెబ్బకు కూలిపోయాడు. అంతటి మహానుభావుడు నేలమీద పడరాదని తలచి అప్పటికప్పుడు బాణాలతో అంపశయ్య ఏర్పరచాడు అర్జునుడు. దానిపై మేను వాల్చిన అతడికి అది దక్షిణాయణమని గుర్తొచ్చింది. కొద్దిరోజుల్లో ఉత్తరాయణం రాబోతోందని, అప్పుడు తనువు చాలిస్తే కైవల్యం సంభవిస్తుందని తలపోశాడు. తండ్రి ఇచ్చిన వరాన్ని గుర్తు తెచ్చుకుని మరణాన్ని నియంత్రించుకున్నాడు. ఉత్తరాయణంలో మాఘ శుక్ల ఏకాదశి నాడు తన తనుత్యాగానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. మాఘ శుక్ల సప్తమి మొదలుకుని రోజుకొక ప్రాణం చొప్పున విడుస్తూ ఏకాదశి నాటికి విష్ణువులో లీనమైపోయాడని, అందువల్ల ఆ అయిదు రోజులను భీష్మ పంచకం అంటారని మహాభారత కథనం. పై కథనం ఆధారంగా భీష్ముడి నిర్యాణ దినాన్ని భీష్మ ఏకాదశిగా జరుపుతారు.

ధర్మనిరతుడు, కర్మయోగి, ఆదర్శ పురుషుడైనందువల్లే భీష్ముడి నిర్యాణ దినం లోకానికి స్మరణదినమైంది.

- అయ్యగారి శ్రీనివాసరావు