ᐅవ్యక్తీకరణలు



ᐅవ్యక్తీకరణలు 

దేవుడు అనే పదాన్ని నిత్యం చాలామంది తెలిసో తెలియకో వాడుతూనే ఉంటారు. ఇందులో ఆర్తులు, అర్థార్తులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు ఎందరో ఉంటారు.
దైవానుభూతి పొందినవారు దైవం గురించి పదేపదే సహజంగా తెలియజేస్తూ ఉంటారు. వాళ్లు ఏదో ఒకమార్గంలో వారి దివ్యత్వాన్ని వ్యక్తీకరించకుండా ఉండలేరు. నిర్మలమైన నీరు ఒక ప్రదేశాన్ని ఆక్రమించి నిలకడగా ఒక అస్తిత్వాన్ని పొంది సరస్సు అయినట్లు, దైవం మానవుడిలో వ్యాపించి తన దివ్యత్వాన్ని ప్రకటించినప్పుడు అతడు దేవుడే అవుతాడు!

ఆ దేవుడు 'దేవుడు' గురించి తెలియజేస్తే ఎంతమందికి జ్ఞానం కలుగుతుంది? ఒక నామానికి ఒక రూపానికి పరిమితమైన జ్ఞానం సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన నిరాకార పరబ్రహ్మ దివ్యత్వాన్ని ఎలా గ్రహించగలుగుతుంది?

తల్లి చంటిపిల్లాడి చేతిలో ఒక బత్తాయి పండు పెడుతుంది. దాన్ని పట్టుకుని వాడు మురిసిపోతూ ఉంటాడు. అది వాడు తినాల్సి వచ్చినపుడు, తల్లే తిరిగి ఆ పండు తీసుకుని తొక్కలు వలిచి, తోలు తీసి, పిక్కలు విడదీసి మెత్తటి ఈనెలు, దాని లోపలి గుజ్జును ముక్కలు ముక్కలుగా చేసి వాడి నోటికి అందిస్తుంది.

వేదాలు మనకు బ్రహ్మ అందించినా వాటి సారం ఉపనిషత్తుల ద్వారా ఇతర మహాకావ్యాల ద్వారా, పురాణాల ద్వారా తిరిగి వ్యక్తమైంది. సద్గురువుల ప్రవచనాల ద్వారా వ్యాప్తిచెందింది. లోకానికి సరళం, సౌఖ్యమూ అయిన పద్ధతుల్లో తెలిసినప్పుడే- ఆ జ్ఞానానికి సార్థకత. తనకు తెలిసిన విషయం తెలిసినట్లుగా చెప్పటం ఒక పద్ధతి. ఇది భగవాన్ రమణ మహర్షి ఆచరించారు. తనకు తెలిసినదంతా చెప్పకుండా, లోకులకు అర్థమయ్యే రీతిలో చిన్నచిన్న పద్యాల రూపంలో అందించారు యోగి వేమన. దోహాల రూపంలో భగవదనుభూతిని కబీరు లిఖించారు. అన్నమయ్య, త్యాగయ్య, తుకారాం, మీరాబాయి... ఒక్కొక్కరిది ఒక్కో మార్గం.

అందరూ దేవుడి గురించే చెప్పారు. మొగ్గ పుష్పమై వికసించి పరిమళాలు వెదజల్లినట్లు దైవ సౌరభాన్ని లోకానికి పంచారు.

ఒక యోగి ఎప్పుడూ లాంతరు వెలిగించి దాన్ని పట్టుకుని పగలు కూడా తిరుగుతూ ఉండేవాడు. అందరూ అతడిని విచిత్రంగా చూసేవారు. ఎవరో ఒక పెద్దాయన ఉండబట్టలేక అడిగాడు. 'స్వామీ! ఎప్పుడూ మీరు ఈ లాంతరు చేతపట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా! ఏమిటీ దీని అర్థం?' అని. దానికి అతడినుంచి వచ్చిన సమాధానం- 'లోకమంతా అజ్ఞానం అనే అంధకారంలో మగ్గుతోంది. చీకటిలో దీపం ఉండాలి కదా. అందుకే ఈ లాంతరు'.

మరొక గురువు, ఎవరైనా వచ్చి 'స్వామీ మీరు ఏం తెలుసుకున్నారు?' అని అడిగితే- కళ్లు మూసి వెంటనే కళ్లు తెరిచేవాడు. ఎవరికి ఏమీ అర్థం అయ్యేది కాదు. 'ఎవడో పిచ్చివాడు' అని అనుకునేవాళ్లు. కొంతకాలం తరవాత ఆయనే దానికి వివరణ ఇచ్చాడు- 'బయట, లోపల ఉన్నది ఒకటే' అని.

ఇంకొక సాధువు, కనిపించిన ప్రతి వ్యక్తికి, రాయికి, రప్పకి, చెట్టుకి, పుట్టకి, పాముకి, పక్షికి, ఆకాశానికి, నేలకి పదేపదే నమస్కరిస్తూ ఉండేవాడు. అందరూ అతడిని నిజంగా పిచ్చివాడిగా జమకట్టేశారు. చివరికి తెలిసిందేమిటంటే- భగవదనుభూతి వల్ల కలిగిన ఆనంద పారవశ్యంలో దైవోన్మత్తతతో ప్రతీది అతడికి శక్తి స్వరూపంగా గోచరించేదట.

ఇలా రకరకాల వ్యక్తీకరణలు. వాళ్లెవరూ పిచ్చివాళ్లు కారు. పిచ్చివాళ్లుగా గోచరించారు. మనకు తెలియనంత మాత్రాన ప్రతీది అసత్యం కాదు. అలాగని సత్యమూ కాదు. నీ అపరోక్ష అనుభూతితో పరీక్షించి తెలుసుకుని సత్యమార్గంలో నడవాలి. అప్పుడే 'దేవుడు' అనే పదానికి నిజమైన అర్థం. జీవన పరమార్థం.

- ఆనందసాయి స్వామి