ᐅపరమహంస



ᐅపరమహంస 

'ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. ఒకటి వేసిన తరవాత సున్నాలు చేరిస్తే వందలు వేలు అవుతాయి. కాని ఒకటి చెరిపితే వాటన్నింటికీ విలువే ఉండదు. ఒకటి ఉండటంవల్లనే సున్నాలకు విలువచ్చింది. మొదట ఒకటి. తరవాత అనేకం. మొదట దైవం. తరవాతే జీవులు, జగత్తు' అంటారు రామకృష్ణ పరమహంస. 'ఆకాశంలో రాత్రిపూట నక్షత్రాలు కనిపిస్తాయి. సూర్యోదయమయ్యాక కనిపించవు. అందువల్ల పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పగలవా? నీ అజ్ఞానస్థితిలో భగవంతుని చూడలేకపోయినంత మాత్రాన భగవంతుడు లేడని చెప్పవద్దు' అంటారాయన.
రామకృష్ణులు అన్ని రకాల మత సాధనాలనూ అనుష్ఠించారు. 'ముసల్మాన్, క్రైస్తవం, శాక్తం, వేదాంత... వీటన్నిటిగుండా ఆ ఒక్కడే కనబడ్డాడు... అన్నీ వేరుపేరు బాటల గుండా ఆ ఒక్కని దగ్గరకే వస్తున్నాయి' అన్న గొప్ప సమన్వయవాది రామకృష్ణ పరమహంస.

రామకృష్ణ పరమహంస ఆధునిక అవతారపురుషుల్లో ఒకరు. అవతారం అనేది భగవంతుని దివ్య కరుణకు ప్రత్యేక రూపం. మానవ జాతికే ధర్మమార్గాన్ని చూపించడానికే భగవంతుడు అప్పుడప్పుడూ అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికతగల మానవరూపంలో అవతరిస్తుంటాడంటారు. వివిధ కాలాల్లో మానవులకు నూతన ఆధ్యాత్మిక మార్గాలు చూపించే గొప్ప మత ప్రవక్తలందరూ అటువంటి దివ్య విభూతులు. రామకృష్ణుల దివ్యావతరణం 1836, ఫిబ్రవరి 19. ఆయన తొలి పేరు గదాధరుడు. పొట్టకూటి విద్యలను తిరస్కరించారు. ఆధ్యాత్మికత, భావావేశం, తీవ్రమైన భక్తి భావన ఆయనలో బాల్యంనుంచీ కనిపించిన లక్షణాలు. అమ్మవారి ఆలయంలో అర్చకత్వం గదాధరుని జీవితంలో మలుపు. నిశ్చింతతో, హాయిగా ఉండే ఆయన స్వభావం గంభీరంగాను, ఆత్మావలోకన స్థితిగాను మారిపోయింది. యాంత్రికంగా పూజలు నిర్వహించే మామూలు అర్చకులకు భిన్నంగా పూజానంతరం భక్త్యావేశంతో దేవీగానం చేస్తూ ఉత్తేజకరమైన పాటలు గంటల తరబడి పాడుతూ ఉండేవారు.

రామకృష్ణుని దృష్టిలో దేవత విగ్రహానికి దేవత స్వరూపానికి భేదం లేదు. ఆకాశంలో ఎగిరే పక్షుల గుంపును చూసినంత మాత్రానే కాదు, ఇలా ఏ చిన్న ప్రేరణకైనా ఆయన సమాధి స్థితిలోకే వెళ్ళిపోయేవారు. ఆయన గురుముఖతా నేర్చుకున్నది తక్కువే. ఆయన బోధనల్లో అపారమైన జ్ఞానం వ్యక్తమయ్యేది. ఆయన మాటల ద్వారా కంటే జీవితం ద్వారానే ఎక్కువ బోధించారు. భగవంతుడి లీలామానుష స్వరూపమైన సమస్త జగత్తును, సర్వ జీవరాశినీ అమితంగా ప్రేమించారు. ఆయనది మాతృహృదయం. కరుణాంతరంగం. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను, సందేహాలను అందరికీ అనుభవంలోకి వచ్చే రీతిలో చిన్నచిన్న కథల రూపంలో నివృత్తి చేస్తుండేవారు.

రామకృష్ణులకు కామకాంచనాల స్పృహలేదు. భార్యను జగన్మాత స్వరూపంగా ఎంచేవారు. సాధన దశలో ఒక చేత్తో మట్టిని, రెండో చేతితో కనకాన్ని పట్టుకొని రెంటినీ అనేకసార్లు పలికించి మట్టిని కనకమని, కనకం మట్టి అని వచించి భేదబుద్ధి నాశనం చేసి రెండింటినీ గంగలో పారేశారు. అహంకార నిర్మూలన నిమిత్తం ఆయన అవలంబించిన సాధనలు అపూర్వమైనవి. మరుగుదొడ్లను పరిశుభ్రం చేసేవారు.

'నేను' అనేది అజ్ఞానానికే చిహ్నం అనేవారాయన. ఈ నేను సత్యాన్ని కప్పేస్తుంది. మనిషికి దైవానికి మధ్య అడ్డుగోడలా నిలుస్తుంది. అనంతుడైన భగవంతుడికి ఒక పరిమితిని ఆపాదిస్తుంది. అందుకే 'నేను' తొలగిపోయి 'నీవు' అనేదానికి చోటుఇవ్వాలి అని ప్రబోధించేవారు పరమహంస. పచ్చి కుండ పగిలిపోతే ఆ మట్టి మళ్ళీ పిసికి కొత్త కుండ తయారుచేస్తాడు కుమ్మరి. కాల్చిన కుండ పగిలిపోతే దాన్ని ఇక ఉపయోగించడు. అదే విధంగా అజ్ఞానంలో మరణించినవాడు మళ్లీ జన్మిస్తాడు. కానీ జ్ఞానాగ్నిలో బాగా కాలినవాడు సిద్ధుడిగా మరణించి మళ్ళీ జన్మించడు అని జ్ఞానతత్వాన్ని ఆవిష్కరించారు.

పసిపిల్లలవలె వినిర్మల హృదయంగల రామకృష్ణులది గొప్ప సత్యనిష్ఠ. లోకంపట్ల ఆయనకున్న ప్రేమ గొప్పది. లోకానికి ఒక శరణ్యం చూపాలని తహతహలాడేవారు. లోకాలు ఎలా నడుచుకుంటే తమ మంచికి, ఇతరుల మంచికి సాధనభూతులవుతారో, దుఃఖితులను ఎలా ఆదరించాలో లోకానికి ఉద్బోధించాల్సిన గొప్ప భారాన్ని, కర్తవ్యాన్ని ఆయన వివేకానంద స్వామికి అప్పగించారు. 1886 ఆగస్టు 16న ఆయన మహాసమాధి చెందారు.

- డాక్టర్ డి.వి.సూర్యారావు