ᐅఅర్థం- పరమార్థం



ᐅఅర్థం- పరమార్థం 

సుఖం అనుభవించాలనుకుంటాం. కష్టం కలిగినప్పుడు గుండెలు పగిలేలా ఏడుస్తాం. ధనంకోసం పాకులాడుతాం. దరిద్రంతో తనువు చాలిస్తాం. జనాన్ని వశం చేసుకొనే మార్గంకోసం తపిస్తాం. అందరికీ దాసులమై అఘోరిస్తాం. ఇతరులకు బోధించాలని వూరు ఎగిరిపోయేట్లు కేకలు పెడతాం. ఇతరులే బుద్ధిచెప్పడంతో నోరు మూసుకుంటాం. పరుల పాదాలు పట్టుకొని ప్రార్థిస్తాం- ప్రపంచాన్ని పాలించాలనే ప్రయత్నంలో!
'కారణం ఏమిటి?'

'ఫలంమీది అత్యాసక్తి' అన్నారు పానుగంటి.

'ఆలోచిస్తే, ఈ పాట్లన్నిటికీ స్వార్థమే మూలం అని స్పష్టమవుతుంది. స్వలాభం కోసం చేసే ప్రయత్నాలు బెడిసి కొట్టగానే మనస్థానమేమిటో మనకు తెలిసిపోతుంది. నిస్వార్థంగా చేసే ప్రయత్నాలు ఉత్సాహాన్ని పట్టుదలనూ రెట్టింపు చేస్తాయి. ఫలం 'కృష్ణార్పణం' అనుకుంటే దిగులే లేదు. మంచిచెడ్డలూ లాభనష్టాలూ అన్ని అంతర్యామివే, మనం నిమిత్తమాత్రులం అని గ్రహిస్తే- పరమేశ్వరానుగ్రహానికి పాత్రులమవుతాం. స్వార్థాన్ని జయించిన వ్యక్తి దేన్నైనా జయించగలుగుతాడు. స్వార్థం వల్లనే అల్పత్వం అబ్బుతుంది. ఇతరులకోసం ఏ కొద్దిపాటి మంచిపని చేసినా మీలో సింహానికున్న శక్తి ఉద్భవిస్తుంది. మీ శక్తికి మీరే ఆశ్యర్యపడతారు'- అన్నారు వివేకానందులు.

మనం నియమించిన దాది మన పిల్లలను కూడా సొంతబిడ్డల్లాగే లాలిస్తుంది. ఆమెను ఉద్యోగం లోంచి తీసివేస్తే నిశ్చింతగా వెళ్ళిపోతుంది. మన పిల్లల బాగోగులు ఆమెకు పట్టవు. మన దగ్గర దాదిగా పనిచేసేటప్పటికి మాత్రమే ఆమె ప్రేమ పరిమితం. ఉద్యోగంపోతే ఆమెకు మనతో ఏ అనుబంధమూ ఉండదు. నాది అనుకునే ప్రతివస్తువుపై మనం ఆ దాదిలాగే ప్రవర్తించాలి. మన సొంతం అనుకున్నవి నిజానికి మనవి కావు. 'మనం కేవలం దాదివంటి పరిచారకులం మాత్రమేనని గ్రహించాలి'- అన్నది రామకృష్ణ పరమహంస ఉద్బోధ.

ఇతరులకు మేలు చేసేటప్పుడు 'ఇందువల్ల నాకేంటి?' అనే ఆలోచన రాకూడదు. బిడ్డలకు అన్న వస్త్రాదులను ఇచ్చేటప్పుడు ఏ ప్రతిఫలాన్నీ ఆశించం. వారి యోగక్షేమాలు చూడటమే పరమావధి. అది తల్లిదండ్రుల విధి. బిడ్డల పట్ల మనకు ఎటువంటి మనోభావం ఉంటుందో, అటువంటి మనోభావమే మన సమాజంపై ఉంటే? ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేదే నిజమైన సమాజసేవ. అదే మాధవసేవ.

ప్రభువుల ధనం ప్రజలది. ఈ సంగతి అధికారులు గ్రహిస్తే, స్వార్థరాహిత్యమే రాజ్యం ఏలుతుంది.

రణజిత్‌సింగ్ రాజ్యాటనకు వెళ్లాడు.

దారిలో పోతూవుండగా ఒకరాయి విసురుగా వచ్చి ఆయన నుదుటికి తగిలింది. రక్తం స్రవించింది. పక్కనే ఉన్న సేనాని వెంటనే వెళ్ళి, ఆ రాయి విసిరిన వ్యక్తిని పట్టుకువచ్చాడు. ఆమె ఒక ముసలమ్మ. గజగజ వణుకుతూ ఉంది.

'నువ్వు రాజావారిపై రాయి ఎందుకు విసిరావ్?' గద్దించాడు సేనాని. ఆమె నాలుక భయంతో పిడచ కట్టుకొని పోయింది. నోట మాట రావడంలేదు.

'ఏం... మాట్లాడవ్?' గర్జించాడు సేనాని.

'నాయనా! నేను అన్నం తిని మూడు రోజులైంది. దారి పక్కనున్న వెలగచెట్టుపై పండ్లు చూశాను. ఒక్క పండైనా రాలకపోతుందా అని ఆశతో రాయి విసిరాను... నాది తప్పే. అది పొరపాటున ప్రభువులవారికి తగిలింది. తప్పయింది, నన్ను మన్నించండి!' అన్నది ముసలమ్మ.

రాజు అంతా వింటున్నాడు. ఆయన చెక్కిళ్లపై నుంచి కన్నీరు ధారలు కట్టింది.

'సేనాపతీ! రాళ్లదెబ్బలు తిని పేదల కడుపు నింపుతున్నది ఆ చెట్టు! మరి నేనో... ప్రజల డబ్బుతో కులుకుతూ వారిని పస్తు పెడుతున్నాను!' అంటూ ఆ ముసలమ్మ రెండు చేతులనూ పట్టుకున్నాడు రాజు.

'తల్లీ ఈ దాసుణ్ని క్షమించు, పరమార్థం బోధించావు. ఇకపై నా అర్థం అంతా ప్రజాక్షేమానికే ఉపయోగిస్తా. అదే ఇక ఈ జీవిత పరమార్థం' అన్నాడు నిశ్చయస్వరంతో.

- పులిచెర్ల సాంబశివరావు