ᐅవిషాదయోగం




విషాదయోగం 

విషాదమంటే దుఃఖం. ప్రతివారి జీవితంలో ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో విషాదం తప్పదు. మన బాధను భగవంతుడికి మొరపెట్టుకుని కష్టాలనుంచి రక్షించమని కోరతాం. కష్టాలను ఎదుర్కొనే మానసిక శక్తిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థించడంవల్ల విషాదమే యోగంగా మారుతుంది. చిత్తవృత్తులను నిరోధించడమే యోగమని పతంజలి యోగసూత్రం చెబుతోంది.
భగవద్గీత అర్జున విషాదయోగంతో ప్రారంభమవుతుంది. ఏదైనా ఒక పరిస్థితిలో మనిషి ధైర్యాన్ని కోల్పోయి నీరుకారిపోవటం విషాదం. యుద్ధరంగంలో అర్జునుడికి కలిగిన విషాదాన్ని హృదయ దౌర్బల్యమన్నాడు శ్రీకృష్ణుడు. దాన్ని సమూలంగా నాశనం చేయడానికి విషాదాన్ని 'యోగం'గా రూపొందించాడు. అర్జునుడు ఉభయ సైన్యాల్లోని బంధువులను, గురువులను, మిత్రులను చూసి హృదయం ద్రవించి వ్యామోహంతో విలపించాడు. బంధునాశనం, కులక్షయం, మిత్రద్రోహ పాతకం, అధర్మాచరణం ఈ యుద్ధంవల్ల కలిగే ఫలితాలని విలపించాడు. వీరందరినీ చంపగా వచ్చే భోగాలు తనకెందుకన్నాడు. యుద్ధం క్షత్రియధర్మమని తెలియనివాడు కాదు అర్జునుడు. కానీ అతనిలోని మానవ హృదయం వైరాగ్య భావనకు చోటిచ్చింది. అర్జునుడి అదృష్టం కొద్దీ అతడి విషాదాన్ని తొలగించడానికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే పూనుకొన్నాడు.

మహాభారతంలో ధర్మరాజుదీ ఒక విధంగా విషాదయోగమే. 'చంపబోతున్నానే' అని అర్జునుడి విషాదమైతే, 'చంపానే' అని ధర్మజుడి విషాదం. అర్జునుడి విషాదం గీతాశాస్త్రాన్ని లోకానికి ప్రసాదిస్తే, ధర్మజుని విషాదం లోకానికి విజ్ఞానోపదేశాన్ని అందించింది. యుద్ధం తరవాత ఈ రక్తసిక్తమైన రాజ్యం దేనికని ధర్మరాజు వాపోయాడు. ధర్మరాజులోని విషాదాన్ని తొలగించడానికి వాసుదేవుడు ఉపదేష్టగా గురుస్థానంలో నిలవలేదు. అంపశయ్య మీద ఉన్న గాంగేయుని- ధర్మజుడికి తాపోపశమనం చేయాల్సిందిగా కోరాడు. జ్ఞాన విజ్ఞాన రహస్యాలనన్నింటినీ అంతరంగ పేటికలో భద్రపరచుకొన్న జ్ఞాని భీష్ముడు ధర్మరాజుకు సందేహ నివృత్తి చేశాడు. సర్వవేద వేదాంత సారమైన శాంతనవగీత శాంతి, ఆనుశాసనిక పర్వాల్లో విస్తరించింది. యుధిష్ఠిరుడి విషాదయోగం 'యోగం' అయింది.

అర్జున, ధర్మజుల విషాదాన్ని తొలగింపజేసిన మహాభారతకర్త వేదవ్యాసుడికీ విషాదం కలిగింది. సరస్వతీతీరంలో కూర్చొని ఉండగా ఆయన హృదయంలో తెలియని ఆవేదన ప్రవేశించింది. వేదాలను విభజించినా, మహాభారతం సృజించినా, పురాణాలు విరచించినా వ్యాసుడు తనకు తెలియని నిర్వేదంతో కలత చెందాడు. నారదుడు కనిపించి ముని దుఃఖాన్ని గ్రహించాడు. 'నీవు ఎన్నో ధర్మాలు చెప్పినా వాసుదేవ కీర్తనం చేయలేదు. అందువల్లనే నీ హృదయం విషాదమయమైంది... భాగవత పురాణం రచించు' అని ఉద్బోధించాడు. శ్రీమద్భాగవత రచనతో వ్యాసుడి విషాదం యోగమైంది. వ్యాస భగవానుల నిర్వేదం వ్యక్తిపరమైంది కాదు. వైయక్తిక నిర్వేదాన్ని గ్రంథరూపంలో నిరూపించి సమాజపరం చేశాడు. విషాదం ఒక్కటే. అది యోగరూపమైనప్పుడు ప్రసాదయోగంగా భాసిస్తుంది.

- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు