ᐅపరిపూర్ణత



ᐅపరిపూర్ణత 

ఆలోచనలు లేకుండా మనసు ఉండదు. మనసు పరిపూర్ణత సంతరించుకోవాలంటే ఆలోచనల్లో వూగిసలాట ఉండరాదు. స్థిరత్వం ఉండాలి. పరిపక్వత ఉండాలి. 
సజావైన ఆలోచనలున్న మనసు శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకోగలుగుతుంది. కించిత్తు అనారోగ్యాన్నీ తొంగిచూడనివ్వదు. కేవలం తనలోని పరిపూర్ణతనే కాదు... శరీరంలోని ప్రతి అవయవంలోని పరిపూర్ణతనీ శాసించగల శక్తి ఆ మనసుకు ఉంటుంది. అందుకే, ఆరోగ్యమైన మనసున్న వ్యక్తి... శారీరకంగానూ పూర్ణారోగ్యంతో ఉన్నానని పదేపదే తనకు తాను చెప్పుకొంటాడు!
తప్పిజారి... ఆలోచనల్లో అస్థిరత ప్రవేశిస్తే చాలు... అది మనసును కలచివేయటమే కాదు- శరీరంలో ఏదో ఒక బలహీనమైన చోట వెనువెంటనే రోగలక్షణానికి అంకురారోపణ చేస్తుంది. అపరిపక్వమైన ఆలోచనలే అన్ని రోగాలకీ మూలకారణం. అందులో వ్యతిరేకమైన (నెగెటివ్) ఆలోచనలు మనసులో ప్రవేశించాలేకాని, రోగ తీవ్రత పెరిగిపోవటానికది ఆస్కారమవుతుంది. అంటే, ఒకవిధంగా చేజేతులా మన అనారోగ్యాన్ని మనమే తెచ్చుకున్నవాళ్లమవుతాం. అప్పుడు మనసును కూడదీసుకోవాలి. అటు ఇటు పరుగెత్తే ఆలోచనల్ని కట్టడి చేయాలి. 'ఇదేమిటి? ఒక్కసారిగా నామీద నాకు పట్టు ఎలా తప్పిపోయింది? నేను పరిపూర్ణుడినే! అలా ఎలా నా సామర్థ్యాన్ని చేజార్చుకున్నాను? నేను నేనుగానే ఉండాలి! మళ్ళీ మామూలు మనిషినైపోవాలి' అని మనసును సమాధానపరచుకోవాలి. ఇది చాలావరకు ధ్యాన సాధనతో సానుకూలపడుతుంది. ఎవరికి వారు మనోధైర్యంతో యథాస్థితికి రావాల్సిందేకాని... ఇంకొకరు చేయగలిగేదేమీ ఉండదు.

ఒక్కొక్కప్పుడు వాతావరణ కాలుష్యంవల్ల, మార్పువల్ల, వయోభారంవల్ల అనుకున్నంత త్వరగా శరీరారోగ్యం చక్కబడకపోవచ్చు. అటువంటప్పుడు రోగిని పలకరించి సానుభూతి చూపించే బంధుమిత్రులు సర్వసాధారణంగా ఒక తప్పు చేస్తుంటారు. ఆ రోగి అస్వస్థత గురించి మరింత లోతుగా కూపీ తీస్తారు. చర్చిస్తారు. పదేపదే అడిగినదాన్నే అడుగుతుంటారు. ఒక్కోసారి ఇలాకాక మరోలా వైద్యం చేయాల్సిందని ఉచిత సలహాలిస్తుంటారు. ఇతరుల రోగలక్షణాలతో పోల్చి మరింతగా భయపెడుతుంటారు. దీనివల్ల ఆ రోగికి సాంత్వన కలగకపోగా, మరింత అపకారం జరుగుతుంది. అతనికి ఉన్న సహజమైన మానసిక శక్తీ హరించిపోతుంది. తానింక ఎప్పటికీ ఆరోగ్యం పుంజుకోలేనేమో అన్న అధైర్యం కుంగదీస్తుంది.

అందుకనే, వివేకవంతులు రోగి అనారోగ్యం గురించి ముక్తసరిగా మూడుముక్కలు మాట్లాడి విషయాన్ని మరోవైపు మళ్ళించాలి. త్వరలోనే అంతా సవ్యంగా అయిపోతుందని రోగికి అనిపించేలా ధైర్యం చెప్పాలి. ఇంకెవరెవరో ఎంత త్వరగా కోలుకుని పూర్ణారోగ్యవంతులైనారో సోదాహరణగా చెప్పాలి. అసలా రోగమంత చిన్నవిషయం ప్రపంచంలో మరొకటి లేదన్నంతగా తేలిగ్గా మాట్లాడాలి. అసలు ప్రస్తావననే మార్చి ఆ రోగిని మరిపించాలి. సరదా సంగతులతో మురిపించాలి.

పరిపక్వత కలిగిన వ్యక్తులు తమ పూర్ణారోగ్యాన్ని కాపాడుకోవటమే కాదు, ఇతరుల అనారోగ్యాన్నీ దూరం చేయగలుగుతారు. దానికి మానసిక దృఢత్వం, చక్కని ఆలోచనాసరళి, క్రమశిక్షణతోకూడిన జీవితం ఎంతో అవసరం. వాళ్లే పరిపూర్ణులు!

- విమలారామం