ᐅమొహర్రం ప్రశస్తి



మొహర్రం ప్రశస్తి 

అధికారదర్పం, అహం ఉన్నచోట మానవతా పరిమళం గుబాళించదు, శాంతి కుసుమాలు వికసించవు. ఇలాంటి విషమస్థితిలో మానవ కల్యాణాన్ని గురించి ఆలోచించి, ఎన్ని అవరోధాలెదురైనా దేశం కోసం పాటుపడేవాడు మహానుభావుడు. పరుల క్షేమం కోరడం ఆయన నైజం. న్యాయం, ధర్మం, సమభావం కోసం దైవమార్గంలో అవసరమైతే తన ప్రాణాల్ని బలిపెడతాడు. అలాంటి మహాత్యాగశీలిని కోటి గొంతులెత్తి అభినందిస్తుంది లోకం.
1400 సంవత్సరాల క్రితం అరబ్ దేశంలో జరిగిన దారుణ సంఘటన అది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం మహాప్రవక్త మనవడు, స్వార్థం తెలీనివాడు ఇమామ్ హుసైన్ కరకు నృపతి చేతిలోని రాచరికానికి ఎదురు తిరిగాడు. మొహర్రం మాసం పదోరోజు ప్రాణాలర్పించాడు. పోరాట ధర్మకార్యంలో చేసిన ఈ ప్రాణత్యాగాన్ని షహాదత్ (అమరత్వం)గా పరిగణిస్తారు. మొహర్రం పదో తేదీని 'యౌమె ఆషురా' అంటారు.

ఇస్లామ్‌లో రాజకీయపరంగా ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించి ఖలీఫా వ్యవస్థ ఉంది. అంతేకాని, రాచరిక వ్యవస్థలేదు. తండ్రి పాలకుడైతే అతని కుమారుడు రాజు కావడం జరగదు. ఆనువంశిక పాలన వ్యవస్థ లేదు. మహాప్రవక్త నిర్దేశించిన విధంగా ప్రజలే పాలకుని ఎన్నుకొంటారు. ఇమామ్ హుసైన్ కాలానికి ముందు ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన ఖలీఫాలు ప్రజానురంజకంగా దేశాన్ని పాలించేవారు. సర్వత్రా న్యాయం పరిఢవిల్లేది.

అనంతరం సిరియా ప్రాంత గవర్నరు మా వియా స్వార్థపరుడై ఇస్లామీయ చట్టాల్ని, ధర్మసూత్రాల్ని ఉల్లంఘించాడు. తన కుమారుడు యజీద్‌ను రాజుగా గుర్తించమని ప్రజలపై ఒత్తిడి తెచ్చాడు. ప్రజలు భయాందోళనలకులోనై యజీద్‌ను రాజుగా గుర్తించారు. ప్రజాస్వామ్యవాదులు ఈ దుష్టపాలనపై తిరుగుబాటు చేశారు. ప్రజాస్వామ్య ఉద్యమానికి నాయకత్వం వహించే బాధ్యత ఇమామ్ హుసైన్‌కు అప్పగించారు. అణగారిన జనగళాల్లో జీవం నింపడానికి, ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పడానికి ప్రజల ఆహ్వానంపై చర్చల నిమిత్తం రాజధాని కూఫా పట్టణానికి ఇమామ్ హుసైన్ బయల్దేరారు. సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలిసి మొత్తం 72మంది వెంట ఉన్నారు. ఇమామ్ హుసైన్ బయల్దేరిన విషయం గూఢచారుల ద్వారా యజీద్ గ్రహించాడు.

పథకం ప్రకారం వేలకొద్దీ సైనికులు ఇమామ్ హుసైన్‌ను మార్గమధ్యంలో కర్బలా అనే ప్రదేశం దగ్గర చుట్టుముట్టారు. యజీద్‌ను రాజుగా అంగీకరించాల్సిందిగా సైన్యాధిపతి హెచ్చరించాడు. తాను కేవలం చర్చల నిమిత్తం రాజధాని వెళుతున్నానని తనను అడ్డగించి శాంతికి విఘాతం కలిగించవద్దని, అల్లాహ్ ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తించవద్దని ఇమామ్ హుసైన్ దళాధిపతిని కోరాడు. దౌర్జన్యం ముందు శిరసు వంచనన్నారు ఇమామ్ హుసైన్. ఇరువర్గాల మధ్య భీకర సంగ్రామం మొదలైంది. మైదానం రక్తంతో తడిసింది. మొక్కవోని గుండెబలం, ధర్మబలం, కదన పటిమలతో ఇమామ్ హుసైన్ పరివారం శత్రుమూకల్ని చెండాడింది. రోజులు గడుస్తున్నాయి. చివరకు ఒక్కొక్కరు నేలకొరుగుతున్నారు. హుసైన్ ఒక్కరే మిగిలారు.

అది మొహర్రం మాసం 10వ తేదీ శుక్రవారం. నమాజువేళ. శత్రువుల అనుమతితో హుసైన్ ప్రార్థనలో నిమగ్నమయ్యాడు. గుండెలదిరిన శత్రువులు హుసైన్‌ను ఎదుర్కోలేక సమరధర్మాన్ని పాతిపెట్టారు. ఇదే అవకాశమని తలచి ఇమామ్ హుసైన్‌ను వెన్నుపోటు పొడిచి చంపారు.

ఈ సమరం అరబ్బీ సంవత్సరం మొదటినెల మొహర్రంలో పదిరోజులపాటు జరిగింది. మొహర్రం ప్రారంభంతో ఇస్లామ్ నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. నాటి దారుణ సంఘటన స్మృత్యర్థం మొహర్రం పదిరోజులు విషాద దినాలుగా పాటిస్తారు. ఇమామ్ హుసైన్‌ను కర్బలా వీరుడని వర్ణిస్తారు.

శాంతి సుఖాల వెలుగుల్ని అందించవలసిన అందాలసీమలో తమ ఆధిపత్యంవల్ల దుష్టులు కటిక చీకట్లను కురిపిస్తారు. దుష్టత్వాన్ని ఎదిరించి తరిమినప్పుడే మానవుల బతుకులు నీతిని, శాంతిని నిలుపుకోగలవని మొహర్రం విస్పష్టం చేస్తోంది.

- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా