ᐅయోగభూమి
ᐅయోగభూమి
ఆధ్యాత్మిక రంగంలో దేహం పట్ల విభిన్న ధోరణి ఉంది. ద్వైదీభావం ఉంది. దేహం నశ్వరమనీ, దానికి అధిక మర్యాద ఇవ్వవలసిన అవసరం లేదనీ ఓ వైపు అంటూనే దేహం పరమపద సాధనకు ఉపకరణమని, దాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందనీ మరోవైపు అంటారు. రెండూ వాస్తవమే. దేన్నీ నిరాకరించవలసిన అవసరం లేదు. దేహం పరమపద సోపాన అధిరోహణకు ఏకైక సాధనం. అసలు మానవ జన్మోద్దేశమే దేహమనే దివ్యకుండంలో 'ముక్తి హోమాన్ని' ఆచరించటం. అలాంటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ దేహం నిర్లక్ష్యం చేయదగినది కాదు. దాని పవిత్ర వినియోగ కారణాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన గౌరవాన్ని ఇవ్వదగినది.
ఏమిటి దేహం? కైవల్య సాధనలో దాని పాత్ర ఏమిటి? ప్రాధాన్యం ఏమిటి? మనిషి జన్మించాక తనదంటూ ఉన్నదీ, తనకంటూ ఉన్నది దేహం మాత్రమే. ప్రాపంచికమైనా, పారమార్థికమైనా ఆయా సాధనలకు మన దగ్గర ఏమున్నా లేకపోయినా, అవసరమనుకున్నవి లభ్యమైనా, కాకపోయినా దేహం మాత్రం మనతోనే ఉంటుంది. అదృష్టవశాత్తు భగవత్ సాధనకు మనకు ఏమున్నా లేకపోయినా అవసరమైనది, అందుబాటులో ఉన్నది దేహం. అప్రయత్నంగా, భగవంతుడు మన దగ్గరేది ఉందో దాన్నే మన సాధనోపకరణంగా మనకు నిర్దేశించాడు. బహూకరించాడు. ఇది ఓ అద్భుతం, అదృష్టం. మరి ఈ దేహంతో మనం ఏం చేయగలం? తినగలం. తాగగలం. నిద్రించగలం. సుఖభోగాలనుభవించగలం. చివరకు మరణించగలం. అంతేనా? అంతే... దేహాన్ని దాని సృజనోద్దేశాన్ని ఆహార నిద్రాభయ మైథునాల కోసం మాత్రమే అని ఆలోచించేవారికీ, ఆ మేరకే వినియోగించుకునేవారికి అంతే. వాస్తవంలో, దేహానికి ఒక పవిత్రోద్దేశం ఉంది. ఒక మహోన్నతోద్దేశం ఉంది.
ఇంత కీలకమైన దేహాన్ని దానిలోని సకల సారాన్ని కేవలం అజ్ఞానస్థితిలో మనకందించాడు పరమాత్మ. ఎలా సంభవం అనుసంధానం!? విచిత్రమైనది దేహం. మనలో ఉన్న పరమాత్మను మనమే చూడలేని స్థితి. మనను నడిపే అంతర్యామికి మనమే వాహనమయ్యే పరిస్థితి. ఆయనే అయిన మనం, మళ్ళీ ఆయన కోసమే అన్వేషించే విచిత్ర వ్యవస్థితి. భగవదన్వేషణ కోసమే వచ్చిన మనం, దేహాన్ని పొందిన మనం దేహంతోనే ఆయనను అన్వేషించవలసి ఉంది. ఇంకా దేహంలోనే అన్వేషించవలసి ఉంది. శరీరమనే ఈ ప్రయోగశాలలో పంచకోశాలు అంతఃకరణ చతుష్టయం, షట్చక్రాలు, ఇడాపింగళ సుషుమ్నానాడులు, శ్వాస అనే హంస... ఎన్ని, ఎన్నని? దేహం ఒక యోగభూమి. ఒక తపోభూమి. ఒక యజ్ఞకుండం. అమృత భాండం.
కైవల్య యజ్ఞానికై మనకు లభించిన సమయం మన జీవితకాలం. అంటే జీవిత కాలయజ్ఞమన్న మాట. దురదృష్టవశాత్తు శైథిల్య లక్షణంగల దేహం యజ్ఞోకరణం అయింది. మరో ఉపాయం లేదు. మరి అలాంటి అపురూపమైన దేహాన్ని, ముఖ్యంగా అనిశ్చితమైన దేహాన్ని, నవరంధ్రాల ఈ ఓటికుండను మనం ఎలా కాపాడుకోవాలి? ఎన్ని కళ్లతో కాచుకోవాలి? ఎంత అప్రమత్తులమై ఉండాలి? నిజమే... శరీరం అశాశ్వతమే. కానీ దాని సృజనోద్దేశం ఉత్కృష్టమైనది. దాని కర్తవ్యం నిరుపమానమైనది. సౌందర్య వ్యక్తరూపంగా అహంకార ప్రదర్శన వేదికగా దాన్ని భావించటం సరి కాదు. అందుకే దాని ప్రయోజన కారణాల్ని మించి దానికి మర్యాద ఇవ్వరాదని విజ్ఞులు సూచిస్తారు. భగవత్ కైంకర్యంలో ఏ యోగమైతే శరీరాన్ని సదుపాయంగా, సౌకర్యవంతంగా ఉంచుకుందో, సమాయత్తం చేస్తుందో దానికి ఉపకరించే యోగాసనాలతో మిత సాత్వికాహారంతో, ఉపయుక్త జీవన విధానంతో దేహాన్ని ఆరోగ్యంగా తగినంత బలంగా బిగువుగా ఉంచుకోవలసిందే. అంతవరకే. నిజానికి ఆధ్యాత్మిక సాధనలు ప్రత్యేక ప్రయత్నం లేకుండానే సాధకుణ్ని ఆ మేర ఉంచుతాయి కూడా. కాకపోతే శుచిరీత్యా అయినా కొంత శారీరక సేవా అవసరమే. సాధన తీవ్రమయ్యే కొలదీ శరీర స్పృహ తగ్గిపోతూ ఆనందమనేది ఆంతర్యానికి మాత్రమే చెందినదన్న స్పృహ స్థిరపడుతూ శరీరం పట్ల నిర్లిప్తత, నిరాసక్తత సహజమైపోయి మనోపేక్షకు తగినట్లుగా శరీరమూ రూపు దిద్దుకుంటుంది. యోగభూమిగా, అదే ఓ యోగభూమికగా విరాజమానమై పోతుంది.
- చక్కిలం విజయలక్ష్మి