ᐅకీర్తికాయులు



ᐅకీర్తికాయులు 

పొట్ట నింపుకోవడానికి కూడు, తల దాచుకోవడానికి గూడు, మేని రక్షణకు గుడ్డ- ఇవి నిత్యావసరాలు. హలంతో పొలం దున్నితేనేమి? నిజదార సుతోదర పోషణార్థమై- అని మన తెలుగువారి పుణ్యఫలమైన రైతుకవి బమ్మెర పోతన అన్నమాట. అవన్నీ మనకు సమకూరినప్పుడే భగవంతుని గురించి ఆలోచిస్తాం. ఆకలితో అలమటిస్తూ దేవుణ్ని తలచుకోమనడం అవివేకం. 'భగవద్గీతను పఠించడం కంటే ఫుట్‌బాల్ ఆటకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాను' అనేవారు వివేకానందులు, శరీరారోగ్యం ప్రధానమన్న భావాన్ని వ్యక్తీకరిస్తూ. పౌష్టికాహారంతోపాటు ఆకాశ హర్మ్యాలు, కోట్లకొలది ఆస్తి ఉన్నవారికి ఆధ్యాత్మిక చింతనవైపు దృష్టి మళ్లదు. విలాసవంతమైన జీవితం, గగన విహారం, ఇంద్రియ లోలత్వం కలుగుతాయి. 'నాపై దృష్టి మళ్లాలంటే, ముందు వారి ఆస్తిని హరించి వేస్తాను. ఆస్తి హరించిపోగానే ఆ ధనికుల్లో అహంకారం నశించి, దైవం వైపు మొగ్గు చూపుతారు' అంటాడు కృష్ణ పరమాత్మ కుచేలుడితో. పుట్టుకతోనే బీదవారైతే భగవంతుడిపై దృష్టి సారిస్తారు. ఒకవేళ భగవంతుడి దయవల్ల ధనవంతుడైతే ఆ ధనికుడు, తాను సంపాదించిన ఆస్తి అంతా కష్టార్జితమే, స్వయం శక్తి, స్వయం కృషి వలనే అని విర్రవీగుతూ ఎవరికీ ఏనాడూ ఇంత అన్నం పెట్టడో అప్పుడతని పతనం తప్పదు. మేరువుతో పోటీ పడతానని ఎగిరెగిరి పడితే, వింధ్యకు అగస్త్య మహర్షివల్ల 'శృంగ' భంగం అయినట్టు- మనకూ అవుతుంది. (అప్పట్నుంచి గమనం చేయడానికి వీలు లేక న'గము' అయింది కొండ). 'ఎగరివేయు బంతి ఎందాక నిలుచురా?' అని మన వేమన చెప్పినట్లు అవుతుంది. మన ఆస్తి మనం వచ్చినప్పుడు తేలేదు. పోయినప్పుడు పట్టుకువెళ్లం కనుక ఈ ఆస్తిని ఒక 'ట్రస్ట్' కింద భావించి ఆ ట్రస్ట్‌కి తానొక 'ఛైర్మన్' (ధర్మకర్త) అనుకోవాలంటారు మహాత్మాగాంధీ. ట్రస్ట్ అంటే నమ్మకం అనీ అర్థం ఉంది. నమ్మకం ఎవరి మీద? భగవంతుని మీద! అలా ఆ ట్రస్ట్ వల్ల వచ్చే వడ్డీతో, దీనజన సేవ చేయాలని మహాత్ముని ఉద్బోధ.
అంచేత ఎవరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా వినయంగా ఉండాలి. అవకాశం ఉన్నంతవరకూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. మరణానంతరం నేత్రదానాలు చేస్తే అంధులకు వెలుగునిస్తాయి. రక్తదానాలు రక్తహీనులకు రక్ష. మూత్రపిండాలు మొదలైన ఇతర అవయవాలు ఎవరికి ఏ విధంగా ఉపయుక్తమైతే ఆ విధంగా వాడుకోవాలని రాతపూర్వకంగా ఆయా ఆసుపత్రులకు తెలియజేస్తే, మరెంతో పుణ్యం.

మనిషి మరణించినా ఆత్మకు ఎలాగూ మరణం లేదు. భౌతికకాయం ఒక్కటే దహనానికో పూడ్చివేతకో గురి అవుతుంది. అప్పుడు ఆత్మకు మరణం లేనట్టే భౌతిక కాయానికీ మరణం ఉండదు. అటువంటి కాయం కలిగినవారినే 'కీర్తికాయులు' అంటారు.

- బులుసు-జీ-ప్రకాష్