ᐅధ్యానానందం
ᐅధ్యానానందం
మనిషికెప్పుడూ ఆనందం కోసమే వెతుకులాట.
ఆనందం ఏ రూపంలో ఉన్నా అది తన సొంతం కావాలనుకుంటాడు. అభిరుచిని బట్టి ఆనందం ఉంటుంది. 'లోకో భిన్నరుచిః' అన్నారు. ఇక్కడ 'రుచి' అంటే ఆనందానుభూతి కలిగించేది అన్న అర్థం చెప్పుకోవాలి. లోకంలో అందరి రుచులు, అభిరుచులు ఒకేలా ఉండవు. ఎవరి బుద్ధిని బట్టి వారి అభిరుచులుంటాయి.
అనుభవరీత్యా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే- రుచి లేక అభిరుచి ద్వారా లభించే ఆనందం తాత్కాలికమే. ఆహారం తీసుకుంటే ఆకలి తీరుతుంది. మంచినీరు తాగితే దాహం తీరుతుంది. కొంత సమయం గడిచాక మళ్లీ ఆకలి, దాహం వేస్తాయి. తాత్కాలిక ఆనందం పరిస్థితీ ఇదే! కొత్త దుస్తులు, అవి కూడా తమ మనసుకు నచ్చినవి, అలాగే నగలు, పాదరక్షలు, వాహనం... ఇలా మనం నిత్యజీవితంలో మనసుకు ఆహ్లాదం కలిగించేవి సొంతం చేసుకునేందుకు పాటుపడుతూనే ఉంటాం. మోజు తీరగానే, మరో ఆనందం కోసం వెతుకులాట ప్రారంభమవుతుంది. రంగురంగుల సీతాకోకచిలుక ఏ విధంగా అయితే మురిపిస్తూ, చిక్కినట్లే చిక్కి చేజారిపోయి, ఇంకోచోట అందంగా రెక్కలల్లారుస్తుందో- ఆనందమూ అస్థిరంగా ఉంటూ మనల్ని ఊరిస్తూ అందీ అందకుండా వేధిస్తుంటుంది.
ఆనందం స్థిరంగా ఉండాలంటే 'ధ్యానమే మంచి పద్ధతి' అంటారు యోగ పండితులు. 'శ్వాస మీద ధ్యాస' అనే ఉపాయాన్నీ చెబుతారు. చెప్పినంతలో అందరికీ ఇది ఆచరణాత్మకం కావటంలేదు. ఎందుకంటే- అసలు సమస్య ఏకాగ్రత లోపమే. ఏకాగ్రత కోసం ధ్యానం చెయ్యాలంటారు. ధ్యానం చెయ్యాలంటే ఏకాగ్రత కుదరాలి. ఏది ముందు, ఏది వెనక? ఇదే... చాలామంది సమస్య.
ధ్యానానికి మూలసూత్రం దైవం గురించిన భావనల్ని మనసులో ధరించటం. మనం ఎవర్ని ఎక్కువగా ప్రేమిస్తామో, ఎప్పడూ వారి ధ్యాసలోనే ఉంటాం. మనం దైవం గురించి ఆలోచించటంలేదంటే మనకు ఆయన పట్ల తగినంత ప్రేమ లేనట్లేగా!
ప్రేమ కలగాలంటే మనలో ప్రేమించే మనసుండాలి. స్పందనలు, ప్రతిస్పందనలు ఉండాలి. అందంలోనే కాదు- అందంగా ఉండే ప్రకృతిలోని అణువణువులోనూ మనకు నేత్రానందం ప్రాప్తిస్తుంది.
ఇంత అద్భుత ప్రపంచాన్ని సృష్టించి, మనకు కానుక ఇచ్చినది పరమాత్మ అని తెలిశాక మనం ఆయన ఘనతకు అబ్బురపడకుండా ఎలా ఉండగలం? చిన్నారులు చిరుకానుకలకు మురిసిపోతారు. పసివారివి అందుకనే పసిడి మనసులు.
కానీ, మనం అలా ఉండలేకపోతున్నాం.
మనం ఆకాశానికి నిచ్చెనలు వేయాలనుకుంటాం. పక్షిలా ఎగరాలని, చేపలా ఈదాలని, సృష్టిని శాసించాలని... ఇలాంటి వింత కోరికలతో సతమతమవుతూ ఉంటాం.
కనిపించనివాడు భగవంతుడెలా అవుతాడని ఒకడంటే, కనిపిస్తే దేవుడెలా అవుతాడని ఇంకొకడంటాడు! తర్కం, కుతర్కం ఆధ్యాత్మిక విచికిత్సను పరిష్కరించలేవు.
భగవంతుణ్ని సరిగా అర్థం చేసుకోగలిగితే, మన పట్ల ఆయన ప్రేమ అనంతమని తెలుస్తుంది. అప్పుడు మనం ఆయన్ని ప్రేమించకుండా ఉండలేం. అంతేకాదు- ఆయన్ని మాత్రమే ప్రేమిస్తాం. ఆయన ధ్యాసలోనే జీవిస్తాం. ఆయన్నే సదా జపిస్తాం. ధ్యానిస్తాం. అప్పుడు కలిగే ఆనందం స్థిరంగా, మనల్ని ఎప్పుడూ వీడకుండా ఉంటుంది. అదే ధ్యానానందం!
కాటూరు రవీంద్రత్రివిక్రమ్