ᐅసత్యం శివం సుందరం




సత్యం శివం సుందరం 

శివా...! 
నిన్ను పిలవడానికి ఇంతకంటే చిట్టి, పొట్టి, చిన్నారి పేరు ఏదైనా ఉందా? ఏదీ లేదా, 'ఓం' అని పిలవనా? వూహూ... అది పిలుపులా లేదు. అయినా నా పిచ్చిగానీ నీ ఏ పేరులో అందం లేదని, ఆస్వాదనకందే రసం లేదని! నీవు... సత్యం... శివం... సుందరానివి. సత్యం కంటే శాశ్వతమైనదేమున్నది? శివం కంటే శివంకరం, శుభంకరం ఏముందని? సృష్టిలోని సౌందర్యమంతా నీదే. నీవే సుందరేశ్వరుడివి. మధురైలో మీనాక్షీ సహితంగా నీవు చేసిన నృత్యం అంతా కుడ్యాన్ని అమర నర్తనశాల చేసింది కదా! కైలాసధామం చేసింది కదా! నీతో సమ ఉజ్జీగా నృత్యం చేయలేక లజ్జతో సిగ్గుల మొగ్గ అయిన మీనాక్షీ అంబాళ్‌ను, నృత్య భంగిమలోనే ఓరగా చూస్తున్న నీ అమృతతుల్యరసిక రసపోషణ ఏమని వర్ణించను? ఆ నృత్య రమణీయకతనూ, రసవిలసిత వీక్షణ పూరిత నయన విలాసాన్నీ ఏ పేరున పిలవను? భరతమునినే సృష్టించిన వాడివి... నీ నృత్యానికేమి లోటు! ఢమరుక విన్యాసంతో అక్షరమాలనే వెదజల్లినవాడివి... నీ సాహిత్యానికేమి లేమి! కపాలాన్ని భిక్షాపాత్ర చేసుకున్న పరమ వైరాగ్యమూర్తీ, ఆ కపాలంలో ఉన్నది మెదడులోని జ్ఞానసారం అనీ, అదే నీవు పంచేదనీ జ్ఞానేశ్వరా, అందరికీ అర్థం కాదే! నీ వెంతటివాడివైనా కావచ్చు, జ్ఞాన వృద్ధుడివైన నీ దక్షిణా'మూర్తి' ముందు వయోవృద్ధ రుషులందరూ మోకరిల్లవచ్చు. అయినా సరే. నిన్నో బాలునిలా చూడాలనీ, పిలవాలనీ ఆశ. అదేమీ దురాశ కాదులే. అనసూయమ్మ చేతుల్లో బాలుడవైపోలేదా? ఆమె ఒడిలో వూయలలూగలేదా? 

అదేదైనా, ఏమైనా, నా శ్వాసలో నిన్ను చూస్తున్నాను హరా! నా ప్రాణంలో ప్రాణానివి. ప్రాణం అంటే శ్వాస కదా? నా శ్వాసలో నీవు నిండావో, నీవే శ్వాసగా నాలో నర్తిస్తున్నావో అర్థం కావటంలేదు. నా బాహ్య శరీరంలో భాగమైన నాశికలో ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జరుగుతున్న ఈ విచిత్ర, విశిష్ట నృత్యాన్ని నా అంతరంగంలోని ఆత్మగా అవాక్కై నేను చూస్తున్నాను. ఆనందంతో నిశ్చేష్టనై తిలకిస్తున్నాను. ఇడా పింగళ నాడులగుండా ఆ వేడి చలువల తేడాల చికాకులు నీ కెందుకని శ్వాసను సుషుమ్నలోకి మార్చుకున్నాను. అద్భుతం శంకరా! ఈ మార్పుతో... మూలాధారంలోని కుండలినీ మాత నీ ఛాయామాత్రపు, లీలామాత్రపు ఉనికిని అవలోకనం చేసిన ముగ్ధలా, జాగృతమయ్యే ప్రయత్నంలో కదలికలు సాగించింది! ఆమె ఆశపడటంలో తప్పేముంది? సహస్రారంలో ఉండే నీవు శ్వాసగా నా నాడులన్నీ నిండిపోగా... నా గురించి 'ఈ జీవి ఎప్పుడు సాధనా శిఖరాన్ని చేరాలి? నేనెప్పుడు మూలాధారంలోంచి ఎగసి సహస్రారం వరకు పాకాలి? అక్కడ కొలువు తీరి ఉన్న సదాశివుణ్ని చేరాలి?' అని నిరాశగా నిద్రాణస్థితిలో ఉన్న కుండలినీ శక్తి, అనుకోని వరంగా నీ సారూప్యం ప్రాప్తమయ్యేసరికి ఆనందంతో ఆవిడా నృత్య భంగిమలో వేయి పడగల పెట్టు పైకి ఎగయదా? 

అవును... అర్థమైంది... నేను శ్వాసిస్తున్నాను! నిరంతర సాధనంటే ఇదేనా శంకరా? ఇదేనేమో. మనసు, శ్వాస ఒక్కటే అయినప్పుడు నీవుగా కదులుతున్న నా శ్వాసను... పోనీ... శ్వాసగా మెదులుతున్న నిన్ను గమనిస్తూ నా మనసు! చూశావా విచిత్రం... రమణ మహర్షి చెప్పినట్లు- శ్వాసను పట్టుకుంటే మనసును పట్టుకున్నట్లే. నిన్ను... అదే... శ్వాసనే చూస్తున్న మనసు అక్కడే ఆగిపోతుంది. ఆగిపోయింది... శ్వాసే మనసుగా. మనసే నేనుగా. మూడూ ఒకటిగా. నీలో... నీతో. అంతా తిక్కగా ఉందా శంకరా? ఉండదులే. నీకూ తిక్క అలవాటుగా? నిన్నూ ఎందరో తిక్క శంకరా అంటారుగా? అయినా త్రిపుటి ఒక్కటైతే గొప్పదే మరి. నేను మిగిలానో లేదో నాకు తెలీదు. కానీ కుబుసం విడిచిన పాములా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ, విజ్ఞానమయ కోశాలనే కుబుసాలను ఒకటి వెంట ఒకటి విసర్జించుకుంటూ నా ఆత్మ తత్వం కుండలినితో, వేయి పడగల విరాట్ స్వరూపంతో కలసి నీవైపు, సహస్రారంవైపు ఎగబాకి వస్తోంది. చీమల బారులో, కప్పగంతులో కావు హరా. ఇది సర్పరూప కుండలినీ శక్తి మహోన్నత జాగరణ దీప్తి. నీవు కనికరించాలి. నిన్ను చేరే క్రమంలో అమ్మ కాళ్లకు అడ్డం పడిన నన్ను, అమ్మ ప్రియమీర అక్కున చేర్చుకుంది. అమ్మ ఒడిలో నేను... భద్రంగా... నిన్ను చేరుకోక ఏమవుతాను? తండ్రి ఒడిలోకి చేర్చేది అమ్మే మరి!

- చక్కిలం విజయలక్ష్మి