ᐅఆధ్యాత్మిక శిఖరాలు




ఆధ్యాత్మిక శిఖరాలు 


అత్యున్నత స్థితిని శిఖరస్థాయి అంటారు.మనం నేలమీద నిలబడినప్పుడు మన చుట్టూ ఎత్త్తెన భవంతులు, ఎన్నో ప్రాపంచిక ఆధిక్యతలు, ప్రత్యేకతలూ కలిగిన వ్యక్తులు మన దృష్టిని అడ్డుకుంటారు. వాళ్ల ముందు మనం మరుగుజ్జుల్లా ఉంటాం. ఒక కొండమీదకు ఎక్కుతూ మధ్య మధ్య కిందకు చూస్తూంటే అవే భవంతులు, అదే వ్యక్తులు క్రమంగా చిన్న రూపాలుగా మారిపోవటం గమనిస్తాం. పూర్తిగా శిఖరాన్ని ఎక్కిచూస్తే, మన మనసు ఆనందపరవశమవుతుంది. మన నెత్తిమీద మేఘాలు తారాడుతుంటాయి. కిందికి చూస్తే తివాచీల్లా పచ్చిక మైదానాలు. చుక్కల్లా చెట్లు. ఇక మనుషులు కనిపించనే కనిపించరు.
భౌతికంగా మనం పొందే అనుభూతిలాంటిదే ఆధ్యాత్మిక శిఖరానుభూతి.

కొండమీదకు ఎక్కేవారు ఒంటిమీద బరువులన్నీ ఒక్కోటిగా వదిలించేసుకుంటారు. లేకపోతే ప్రయాణం ముందుకు సాగదు. ఆధ్యాత్మిక ప్రయాణంలోనూ ఇదే పద్ధతి అనుసరించాల్సి ఉంటుంది. లేకపోతే పురోగతి సాధ్యపడదు.

ప్రాపంచిక ప్రయాణాల్లో మనతోపాటు ధనాన్ని, వస్త్రాల్ని, తినుబండారాల్ని తీసుకువెళతాం. ఆధ్యాత్మిక ప్రయాణాల్లో దీక్ష అనే ధనాన్ని, విశ్వాసం అనే వస్త్రాన్ని, పట్టుదల అనే ఆహారాన్ని వెంట ఉంచుకోవాలి. అవే మనల్ని క్షేమంగా గమ్యందాకా తీసుకువెళ్తాయి. బహుకాలం మనల్ని ఆశ్రయించి ఉన్న ప్రాపంచిక బంధనాల్ని, భావనల్ని వదిలేస్తూ ముందుకు పోవాలి.

ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన సంగతేమంటే- ఆధ్యాత్మికంగా మనం చేసే ప్రయాణం శరీరంతో చెయ్యం. ఆత్మతో చేస్తాం. ఆత్మభావనతో చేస్తాం. మనసు, బుద్ధి ఆత్మవెంట సేవకులుగా ఉంటాయి. కాబట్టి, శరీరంతో మనం ఎలాంటి కొండలు, శిఖరాలు ఎక్కే అవసరం ఉండదు. అసలు ఆధ్యాత్మిక ప్రయాణంమీద ఆసక్తి కలిగే సమయానికే శరీరంలోని శక్తులుడిగిపోయి ఉంటాయి. ధన జన యౌవన గర్వాలన్నీ దాదాపుగా అణగారిపోయి ఉంటాయి. ఆవు ఆహారాన్ని నెమరువేసుకున్నట్టు, గతకాలమంతా వ్యర్థం చేసుకున్నానే అని చింతలో ఉంటాడు మనిషి. చింతలోనే పడి చితికి వెళ్లే బదులు- ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభిస్తే, శరీరం రాలిపోయినా ఆత్మ దృఢంగా, అంతర్యామి ఆలింగనంలో ఆనందంగా ఉంటుంది. అదే ఆధ్యాత్మిక శిఖరస్థాయి!

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్