ᐅనిన్ను నువ్వు తెలుసుకో



ᐅనిన్ను నువ్వు తెలుసుకో! 

'... ఆ సంగతి నువ్వెంత త్వరగా తెలుసుకుంటే నీకంత మంచిది. ఇది నీకు ముఖ్యం. నీకే ఎరుక లేకపోతే జీవితంలో నువ్వెంతో పోగొట్టుకుంటావు. పరిపూర్ణంగా నిన్ను నువ్వు ఎరిగినప్పుడే నీ మనసుకు శాంతి, సుఖం. అప్పుడు ఎలాంటి బాధ, అసంతృప్తి, ఆందోళన, ఒత్తిడి అన్నది నీ దరిచేరవు'- అని ఎవరో ఒకరు జీవితంలో చెప్పే పరిస్థితి ఒక్కోసారి ప్రతి ఒక్కరికీ వస్తూంటుంది.
చిత్రమేమంటే మనం తెలుసుకోవాల్సిన దాని గురించి మనం తగినంత శ్రద్ధ పెట్టం. ఇతరులకు తెలియనివాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం, మాట్లాడతాం. పైగా 'వాడేం చేయాలో వాడికి బొత్తిగా తెలియదు. పట్టించుకోడు. ఇంకొకరిమాట వినడు. వింటే వాడికది ఎంత మంచిదో!' అని మన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చుతుంటాం.

మనం జీవించే వాతావరణం, చుట్టూ ఉండే మనుషులు, వారితోటి అనుబంధాలు, ఆప్యాయతలు, ఈతి బాధలు, ఒడుదొడుకులు... ఇలాంటి బయటి ప్రపంచ విషయాలు సమాజ జీవిగా మనకు ప్రధానం కావచ్చు. వీటన్నిటికన్న అతి ముఖ్యమైనది, వ్యక్తిగతమైనది మరొకటి ఉంది. అది మన లోపలి ప్రపంచం. మన ఆత్మ. మన జీవిత పరమార్థం. అంతర్యామితో మన అనుబంధం. వీటి గురించీ మనం ఆలోచించాలి కదా!

దేన్ని తెలుసుకోవాలన్నా మన మనసే ఆధారం. చిత్రంగా మన గురించి మనం తెలుసుకోవటానికి అడ్డం వచ్చేదీ మన మనసే! ఇతర విషయాల మీద ఆసక్తి చూపించే మనసు మన గురించి ఆలోచించటానికెందుకో అడుగడుగునా అడ్డం వస్తుంది. బయటి ప్రపంచ విషయాల గురించి గంటలు, రోజులు ఖర్చు పెట్టే మనసు అంతర్ముఖం చేసుకోవటానికి పట్టుమని పది నిమిషాలు కూడా కేటాయించదు. మరునాటికి చూద్దామనుకుంటూ వాయిదాలు వేస్తుంటుంది!

'ఏ విషయమూ ఆలోచించకుండా నీ ఊపిరిమీద నీ దృష్టిని అరవై నిమిషాలసేపు పెట్టగలిగితే నీకు ముక్తి లభించినట్టే!' అన్నాడు బుద్ధ భగవానుడు. అరవై నిమిషాల మాట అటుంచి- సామాన్య మానవులకు ఆరు నిమిషాలు కూడా సాధ్యం కాదు. అది సాధ్యం కావాలంటే ఎంతో సాధన కావాలి. ముందొక చోట నిశ్చలంగా కూర్చోగలగాలి. కళ్లు మూసుకొని ఊపిరి మీదనే మనసు లగ్నం చేయాలి. లోలోపలికి దూసుకు వచ్చే ఆలోచనల్ని అడ్డగించాలి. క్రమక్రమంగా ఆ మనసులో ఆలోచనల రద్దీని తగ్గించుకోగలగాలి. బయటి విషయాలతో బంధనాలు ఒక్కటొక్కటీ తెంచుకుంటూపోతే గాని మనసు విశాలం కాదు. అక్కడ వెలగాల్సిన అసలు దీపం వెలగదు!

ఒక్క రోజులో పది గంటలు శారీరక వ్యాయామం చేసి ఎవడూ కండలు పెంచి వస్తాదు కాలేడు. దానికి ఎన్నో ఏళ్ల నిరంతర అభ్యాసం కావాలి. అలాగే కొన్ని గంటలసేపు ధ్యానం చేయాలని తికమక పడుతూ గమ్యం సాధించాలనుకోవటం వృథా ప్రయాస. మొదట రెండు మూడు నిమిషాలతో ప్రారంభించి క్రమక్రమంగా సమయాన్ని పెంచుకుంటూపోవాలి. అనాదికాలం నుంచీ మన రుషులు, మునులు, సాధువులు, సిద్ధపురుషులు... అంతా అదే చేశారు. నిరంతర సాధనతో తమ జీవితాలకు ధన్యత చేకూర్చుకున్నారు!

- తటవర్తి రామచంద్రరావు