ᐅగీతానిర్దేశం




గీతానిర్దేశం 

కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం చేసినరోజును 'గీతాజయంతి'గా జరుపుకోవడం ఆనవాయితీ. అది మార్గశిర శుద్ధ ఏకాదశా, లేక కార్తీక బహుళ అమావాస్యా- అనేదానిపై రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కొందరు పంచాంగకర్తలు, వ్రతగ్రంథ రచయితలు మార్గశిర శుద్ధ ఏకాదశినే గీతాజయంతిగా చెబుతారు. ఇది ఉత్తరాది సంప్రదాయం. మనం ముక్కోటి అని, మోక్షద ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని పిలుచుకునే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడే గీతోపదేశం జరిగిందన్నది వారి అభిప్రాయం.

మహాభారతం ఆధారంగా చూస్తే- కార్తీక బహుళ అమావాస్య, భగవద్గీతకు జన్మదినంగా కనిపిస్తుంది. పాండవుల రాయబారిగా హస్తినకు వెళ్లిన శ్రీకృష్ణుడు, తిరుగుప్రయాణంలో కర్ణుడితో మాట్లాడుతూ- జ్యేష్ఠా నక్షత్రంతో కూడిన అమావాస్య రోజు యుద్ధం మొదలవుతుందని చెప్పాడు. అది కార్తీక బహుళ అమావాస్య! యుద్ధం మొదటిరోజునే గీతోపదేశం జరిగిందనడంలో సందేహాలు లేవు కనుక- కార్తీక అమావాస్యే గీతాజయంతి అనేది రెండోవాదన. దీనికే మరో బలమైన ఆధారం ఉంది.

మాఘశుద్ధ అష్టమి- భీష్మ నిర్యాణ దినం. అంతకు ముందు ఆయన ఏభై ఎనిమిది రోజులు అంపశయ్యపై గడిపాడు. దానికన్నా ముందు పదిరోజుల పాటు కౌరవ పక్షాన సర్వసైన్యాధ్యక్షుడిగా భీకర యుద్ధం చేశాడు. అంటే, మాఘశుద్ధ అష్టమి నుంచి మొత్తం అరవై ఎనిమిది రోజులు వెనక్కి లెక్కిస్తే- యుద్ధ ప్రారంభదినం కార్తీక బహుళ అమావాస్యగా తేలుతోంది. కనుక గీతా జయంతి ఆరోజే జరుపుకోవాలంటారు పండితులు. నిజానికివన్నీ విప్రవినోదాలు. గీత ఎప్పుడు పుట్టిందన్న ప్రశ్నకన్నా- అందులో ఏం ఉందన్నది ప్రస్తుతం ముఖ్యమైన విషయం! శ్రీకృష్ణుడి సందేశాన్ని ఈ తరం తన నిత్యజీవితంలో ఆచరించడమెలా?

ఈ కోణంలోంచి భగవద్గీతను అధ్యయనం చేస్తుంటే- ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అవుతున్న వ్యక్తిత్వ వికాస గ్రంథాల కన్నా భగవద్గీత వందలరెట్లు ప్రయోజనకారి అని పరిశోధకులు తేల్చారు. యుద్ధరంగంలో వికల మనస్కుడైన ఒక యోధుణ్ని మానసికంగా ప్రేరేపించి, గొప్పగా ఉత్తేజితుణ్ని చేసి, చివరకు అసాధారణ విజేతగా నిలిపిన క్రమంలో గీత నిర్వహించిన పాత్రను - ఈవేళ వ్యక్తిత్వ వికాస నిపుణులు జేజేలతో స్వాగతిస్తున్నారు. విశేషమైన ప్రేరణశక్తిని దానిలో గుర్తిస్తున్నారు. కృష్ణుడు నిర్దేశించిన కర్మయోగాన్ని 'కర్తవ్య ధర్మోపదేశం'గా సూత్రీకరిస్తున్నారు. సందేహాలతో, సమస్యలతో సాగుతున్న నిత్యజీవన యానానికి అది దీపస్తంభమై దారి చూపిస్తుందని గమనించి, గీతను అధునాతన అభివ్యక్తితో యువతకు అందించే యత్నాలు చేస్తున్నారు. ప్రాచీన ప్రబోధాల్లోంచి ఆధునిక అవగాహనను అన్వేషిస్తున్నారు. బహుళ జాతి సంస్థలు తమ ఉద్యోగులకు, బోధన సంస్థలు తమ విద్యార్థులకు సరళంగా వివరించేందుకు వీలుగా భగవద్గీతను సరికొత్త కోణాల్లో అధ్యయనం చేస్తున్నాయి. గీతలో అంతర్లీనంగా ప్రవహించే అఖండ దీప్తిని, స్ఫూర్తిని- మానవ సమూహాల చైతన్య ఉద్దీపన దిశగా మలచుకుంటే- అవి సంస్థల మనుగడకు అమృత సంజీవని కాగలవని విశ్వసిస్తున్నాయి. ఉత్పత్తి పెరుగుదలకు ఉత్ప్రేరకం కాగలవని నమ్ముతున్నాయి. లక్ష్యాలను తేలిగ్గా సాధించి, విజయ తీరాల్లో లంగర్లు వేయించగలవని భావిస్తున్నాయి.

పద్ధెనిమిది అక్షౌహిణుల మహాసైన్యం కదనరంగంలో మోహరించి కయ్యానికి కాలు దువ్వుతున్న క్షణంలో- ధర్మ సంకటానికి గురై, నిర్వేదానికి లోనై, కర్తవ్యాన్ని విస్మరించిన మహా వీరుణ్ని యుద్ధోన్ముఖం చేసేందుకై ఒకానొక అద్భుత మానసిక శాస్త్రవేత్త ప్రవచించిన కర్తవ్య నిర్దేశం- భగవద్గీత! అంతేగాని అడవుల్లో ప్రశాంతంగా తపస్సు చేసుకునే ఎవరో సర్వసంగ పరిత్యాగి తన శిష్యులు జ్ఞానులయ్యేందుకు ఏకాంతంగా బోధించిన ధర్మోపదేశం కాదిది. ఉడుకు రక్తాన్ని ఉరకలెత్తించేందుకేగాని, ఉడిగిన వయసు చేత ఊఁ కొట్టించేందుకు కాదు- భగవద్గీత! యుగావసరాలకు తగినట్లు తన పరిధిని అంతకంతకూ విస్తరిస్తూ విశ్వరూపం దాలుస్తున్న గీతా చైతన్యాన్ని బాగా విచ్చుకున్న మనసుతో దర్శించి తరించాలి. మనం అలా తరించిన రోజే గీతాజయంతి.

- ఎర్రాప్రగడ రామకృష్ణ