ᐅకలవని పట్టాలు



ᐅకలవని పట్టాలు 

అసాధారణమైన, అరుదైన చారిత్రక, పౌరాణిక గాథలకన్నా ఈనాటి సాంకేతిక అద్భుతాలవైపే అంతా ఆకర్షితులవుతున్నారు. పురోగమించాలి, మార్పుకావాలి అనేది నేటి నినాదం. అయితే గతంనుంచి వర్తమానాన్ని వేరు చేయలేం. గతం ఎప్పటికీ అంతరించిపోదు.
మనదేశంలో గతం అంతా పురాణగాథలు, సంకేతాలు, క్రతువులు కనిపిస్తాయి. అవన్నీ ప్రజల్ని స్నేహబంధంతో కలిపి ఉంచేవి. కొన్ని అతి విచిత్రగాథలున్నాయి. నదులకు, చెట్లకు అధిష్ఠాన దేవతలుంటారని, సురలోకంనుంచి ప్రవహించిన గంగ అని, కృష్ణవేణి తల్లి అని నేటికీ భావించేవారున్నారు. కొన్ని చరిత్రనుంచి ప్రభవించాయి. అవి మన జీవన వాస్తవాలను తీర్చిదిద్దలేదా?

పసితనం దాటి ప్రజ్ఞ, ప్రతిభ నిండిన దశలో ప్రవేశించగానే గతం విడిచివెళ్లిన చిహ్నాలను వర్తమాన వాస్తవాలతో ముడిపెట్టి, ఆనాటి గాథలకు తిరిగి ప్రాణం పోయాలనే తలపు కొందరికైనా కలగక మానదు. సమాజం ఆధునికత వైపు ఎంత వేగంగా అడుగులు వేస్తున్నప్పటికీ గతంతో బంధాలు తెంపుకోలేదు. గతం అంతర్వాహినిగా వూపిరితీస్తూనే సాగుతోంది. పల్లెల్లో అమాయక నిశ్శబ్దాల్లో మారుమోగిన జానపదగీతాలు మనం మరచిపోయామా? చాలాచోట్ల అదృశ్యం కావచ్చు. కాని ఆ జ్ఞాపకాలు మన గుండెల్లో ఇంకా పచ్చగా మెరుస్తూనే ఉన్నాయి కదా!

మనదేశంలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన, మహిమాన్విత పుణ్య యాత్రాస్థలాలు కోకొల్లలు. అక్కడికి వెళ్లి తనివితీరా ప్రకృతి రమణీయ దృశ్యాలతోపాటు అలౌకికమైన సాన్నిధ్యాన్ని అనుభవించడం మరపురాని దివ్య అనుభూతి. అలాంటివాటిలో పార్వతి నది ప్రవహించే చోటు ఒక మహాద్భుతం. మనాలీ లోయలో మణికర్ణిక అనే చోట ప్రాచీన శివాలయం ఉంది. అక్కడే ఒక గురుద్వారా ఉంది. వేడినీటి బుగ్గలు ఉన్నాయి. అక్కడే చాలా పెద్ద నంది విగ్రహం ఉంది.

పార్వతీదేవి అక్కడ ఒక చిన్న తటాకంలో స్నానం చేస్తుండగా ఆమె బంగారు ఆభరణాలు అందులో పడిపోయాయట. అప్పుడు వాటిని తీసుకొని రావడంకోసం శివుడు ఒక సర్పాన్ని పంపాడని, ఆ సర్పం వాటిని నోట కరచుకొని తెచ్చి బయటకు విసురుగా వదిలిందని, అక్కడే వేడినీటి బుగ్గలు ఏర్పడ్డాయని చెబుతారు. ఆ ఉష్ణజలాలకు శరీరంలోని రుగ్మతలు పోగొట్టే మహిమ ఉందంటారు పెద్దలు. గురునానక్ కూడా అక్కడ ధ్యానం చేసినట్లు చెబుతారు. రాత్రివేళ హనుమంతుడు ఆ ప్రదేశంలో తిరుగుతుంటాడని ప్రతీతి.

(నమ్మేవారికి) ఇలాంటి పురాణగాథలు అబద్ధాలు కావు. కల్పనలు కావు. అవి మరొక రకం సత్యాన్ని చూపిస్తాయంటారు పురాణ పరిశోధకులు. సత్యం అనేక రూపాలుగా కనిపిస్తుంది. కొన్ని బహిర్ముఖమైనవి. కొన్ని అంతర్ముఖమైనవి. కొన్ని తర్కబద్ధమైనవి. మరికొన్ని అంతఃస్ఫూర్తికి మాత్రమే గోచరించేవి. కొన్ని సంస్కృతితో ముడివడిన విశ్వజనీన వాస్తవాలు. కొన్నింటికి సాక్ష్యాధారాలుంటాయి. మరికొన్ని విశ్వాసంపై ఆధారపడినవి. సైన్సు చెప్పలేనివాటికి మతం సమాధానం చెబుతుంది. మతం పట్టించుకోని రహస్యాలకు సైన్సు సమాధానం చెబుతుంది. మానవ ప్రగతికి అవి రెండూ పట్టాలు. అవి ఏనాడూ కలిసే అవకాశం లేదు.గతం ఏనాటికీ మరణించదు. అవి మన ఆలోచనల్ని, వూహల్ని దీప్తిమయం చేస్తూ తాను అదృశ్యంగా ప్రవహిస్తూనే ఉంటుంది- ఎప్పటికీ.

- కె.యజ్ఞన్న