ᐅమధుర భక్తి
ᐅమధుర భక్తి
బృందావనంలో సుందర గోవిందుని రాసలీల రసరమ్య మనోహర హేల! జీవాత్మ, పరమాత్మల సంయోగాన్ని ప్రతిబింబించే అమలిన శృంగారలీల! శ్రీకృష్ణుని మీద ఎటువంటి మనోవైకల్యం లేని ఆలోచన, కృష్ణప్రేమే అమృతతుల్యమనే వివేచన గోపికామణుల సొంతం. ఆయనే వారి దృష్టిలో, రససృష్టిలో సుఖప్రదుడు, శుభప్రదుడు. కందులేని చందురుని చందంగా అందాలు చిందుతూ కాంతులు చిందే ఆ కమలాక్షుడే గోపికలకు సర్వం, సర్వస్వం. గోపికలది సరస శృంగారం కాదు, అలౌకిక మధుర భక్తి. కృష్ణుడు గోపికలకు వశుడైనా, వారి సాన్నిధ్యంలో పరవశుడైనా, కేవలం వారి ఆధ్మాత్మిక శక్తివల్లనే కానీ, భౌతికయుక్తివల్ల కాదు. భౌతికశక్తికి, యుక్తికి కృష్ణుడు అగోచరుడు. సర్వమయుడైన కృష్ణుని గురించిన ఆరాధన, పరిపూర్ణమైన అవగాహన గోపకాంతల చర్యల్లో కమనీయంగా, రమణీయంగా దృగ్గోచరమవుతుంది. కృష్ణుడు గోపికా మనోహరుడే కాదు, నిరతమూ వారి మానస చోరుడు! భక్తిమార్గం అవలంబించని భక్తులకు కృష్ణుడు ఏ మాత్రం అవగతం కాడు. భక్తిమార్గంలో భక్తుడు సాధించిన సలక్షణమైన ప్రగతికి విలక్షణమైన రీతిలో భగవంతుడు వారిని కటాక్షిస్తూ ఉంటాడు. వారి నిష్కామ భక్తి స్పందనలకు నిష్కపటమైన రీతిలో ప్రతిస్పందిస్తూ ఉంటాడు. కృష్ణుని విరహంలోనూ, సమక్షంలోనూ ఆ దేవాధిదేవుణ్నే గోపికలు తమ హృదయంలో నిలుపుకొని ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ జీవితాన్ని వెలయించారు. కృష్ణుడు బృందావనవాసుల విరహతాపాన్ని చల్లబరచే తలంపుతో మధురనుంచి ఉద్దవునితో పంపిన సందేశంలో 'మీకు నా గురించిన విరహం, నాకు దూరంగా ఉన్నాననే ఆలోచన అవసరం లేదు. నాకూ మీకూ భౌతికమైన వియోగమే కానీ నేను సదా మీ మానస స్థితుడను. కైవల్య పథాన్ని పొందే మార్గాన్ని, ఆధ్యాత్మిక జ్ఞాన చింతన మీరు కొత్తగా అన్వేషించే అవసరం లేదు. జన్మించినప్పటినుంచే మీరు నన్ను గాఢంగా ప్రేమించటానికి అలవాటుపడ్డారు కాబట్టి మీరు మోక్షప్రాప్తి గురించిన ఎటువంటి సందేహానికి లోను కావద్దు' అంటూ గోపకాంతలకు స్పష్టం చేస్తాడు. ఇదీ గోపకాంతల ఘనత, ఉదాత్త చరిత!
మహా భాగవతంలో మధుర భక్తితత్వాన్నీ, మహాత్మ్యాన్నీ విస్తృతంగా తేటతెల్లం చేసే ఒక ఘట్టం ఆసక్తిదాయకంగా ఉంటుంది. శుకమహర్షి పరీక్షిత్తుకు వివరించిన రాసలీలా వృత్తాంతమిది.
'ఓ మహారాజా! ఓ శరత్కాలపు పున్నమి రాత్రిలో జగన్మోహనుడైన శ్రీకృష్ణుడు గోపకాంతలతో రాసక్రీడ చేయ సంకల్పించాడు. ప్రతి ఇద్దరు గోపికాభామల మధ్య ఒక కృష్ణ రూపం ఉండేటట్లుగా రాసమండలాన్ని మనోహరంగా ఏర్పాటు చేశాడు. కృష్ణుడు పద్మం మధ్యలో ఉండే కర్ణికలాగా రాసమండల కేంద్రంలో త్రిభువనాలూ సమ్మోహించే భంగిమలో నిలిచి, కర్ణపేయంగా వేణుగానం చేశాడు. రాసక్రీడ అనంతరం ఆ గోపికలతో జలక్రీడలు ఆరంభించి శ్రీకృష్ణుడు సందడిగా యమునానదిలో ప్రవేశించాడు. ఒకరిపై ఒకరు నీళ్ళు జల్లుకుంటూ, తుళ్లుతూ అందరూ జలక్రీడ ముగించారు. ఆ పున్నమిరాత్రి మధురస్మృతులను సుమధురంగా నెమరువేసుకుంటూ అందరూ ఇళ్లకు చేరుకున్నారు' అని శుకుడు రాసలీలా వృత్తాంతం చెప్పాక- పరీక్షిన్మహారాజు ఆయనను ఇలా ప్రశ్నించాడు. 'యోగివర్యా! ధర్మరక్షణార్థమై ఈ ధరాతలంపై శ్రీకృష్ణుడై అవతరించిన భగవానుడు, ఇంద్రియలోలునిలా పరస్త్రీలతో కలవడం లోకవిరుద్ధం, ధర్మవిరుద్ధం కాదా?' అని అడిగాడు. శుకమహర్షి అతని సందేహ నివృత్తి కోసం ఏమని చెప్పాడో తెలుసా?
'ఓ రాజా! శ్రీకృష్ణుడు నందనందనుడిగా, యశోదకు ప్రియతనయుడైన గొల్లవాడిగా మసలడం చూసి అతడొక సామాన్య మానవుడేనని భావించడంవల్ల- ఇటువంటి సందేహం నీకు కలుగుతోంది. అతడు మానవరూపంలో అవతరించిన పరమాత్మ. జీవాత్మలన్నీ పరమాత్మ తాలూకు అంశాలే కాబట్టి ఈ రకంగా వ్యవహరించడంలో ఎటువంటి విపరీతమూ లేదు. శరీరస్థాయిలో వ్యవహరించే దేహాభిమానులకే శరీర సంబంధమైన బంధుత్వాలూ, భిన్నత్వాలూ గోచరిస్తాయి. ఆత్మస్థాయిలో అంతా ఒకటే కదా!' అంటూ శుకుడు విశదీకరిస్తాడు. ఏ భావంలోనైనా, కోణంలోనైనా, ఆ భగవంతునియందే దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఆయన లభ్యమవుతాడు. ఇదే విషయాన్ని కలిసంతరణోపనిషత్తులో నారదుడికి మహావిష్ణువు తెలియజెప్పాడు. భక్తులు ఎక్కడ త్రికరణ శుద్ధిగా తన నామగానం చేస్తూ ఉంటారో, తనయందే మనసును పరిపూర్ణంగా లగ్నం చేసి ఉంటారో అక్కడే తాను స్థితుడనై ఉంటానని తేటతెల్లం చేస్తాడు నారాయణుడు. గోపికల చిత్తవృత్తీ, ప్రవృత్తీ ఆ శ్యామసుందరుడే! వారి తనువూ, మనసూ గోవిందుడే. ధనమైనా, కనకమైనా ఆ దామోదరుడే. గోపికల మనోధ్యానం, హృదయగానం ఆ గోవిందుడే! నిరంతర, చిరంతన కృష్ణప్రేమతో గోపికల జన్మధన్యమైంది.
- వెంకట్ గరికపాటి