ᐅమీలాద్ - ఉన్ - నబి ప్రశస్తి



ᐅమీలాద్ - ఉన్ - నబి ప్రశస్తి 


సత్యం, న్యాయం, పరోపకారం, నీతి వంటి ఉత్తమ గుణాల సిరిసంపదల్ని లోకానికి అందించే నిమిత్తం విశ్వమానవశ్రేయాన్ని కాంక్షించే మహానుభావులు తమ ప్రాణాల్ని సైతం లక్ష్యపెట్టరు. బాధ్యతను భుజాలకెత్తుకొని ఎలాంటి కష్టనష్టాలనైనా ఎదుర్కొంటారు. ప్రోత్సాహ ప్రోద్బలాల కోసం నిరీక్షించరు. ఒకరి మేలు తమ మేలని భావిస్తారు. పరుల వేదనలు తొలగించడానికే జీవితం గడుపుతారు. కొత్త ఆనందాలకు వాకిళ్లు తెరుస్తారు. చిరస్థాయిగా ప్రజాహృదయాల్లో నిలుస్తారు.
మహమ్మద్ ప్రవక్త జన్మదినమే మీలాదున్నబి. మీలాద్ అంటే జన్మదినం. నబీ అంటే ప్రవక్త. మీలాద్-ఉన్-నబి అంటే ప్రవక్త జన్మదినం. ముస్లిములు మీలాదున్నబిని సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. మహాప్రవక్త పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం మక్కాలో జన్మించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను, ఆప్తులను కోల్పోయి ఏకాకి అయ్యారు. అయినా ధైర్యం వీడలేదు. అలముకొన్న కష్టాల్ని, అవరోధాల్ని ఛేదించుకొని మానవలోక మహోపకారం కోసం జీవితం గడిపారు.

ఆయన వాక్కులు, చేతలు నిస్వార్థ ఆదర్శాలకు ప్రతిరూపాలై శోభిల్లాయి. ఆయన జీవితం సత్యసంధతకు, సహనానికి, సౌహార్దానికి, ఉన్నత మానవీయ గుణాలకు ఆకరమైంది. నిత్యం సత్యాన్ని, సచ్ఛీలతను, సన్మార్గాన్ని ప్రబోధించేవారు. బోధించింది స్వయంగా ఆచరించేవారు.

రాజాధిరాజైనా మహాప్రవక్త ఒక పేదవాడిగా, సర్వస్వం త్యజించి, పూరిగుడిసెను నివాసంగా చేసుకొన్నారు. గృహస్థుగా ఉండి సంసార జీవితం గడిపారు. చిరిగిన బట్టల్ని తానే కుట్టుకొనేవారు. చెప్పులు తానే బాగుచేసుకొనేవారు. ఆయనకు పటాటోపం లేదు. వైభవం లేదు. అంగరక్షకుడు లేడు. ఖజానా లేదు. ఖర్జూరపు పండ్లు, మేకపాలు ఆయన ఆహారం. ఈతచాప లేక జనుపనార పట్టా ఆయన శయ్య. ఏదైనా సమావేశంలో ఆయన ఉన్నప్పుడు కొత్తగా వచ్చినవారికి సామాన్యులెవరో, దేశపాలకుడెవరో తెలిసేది కాదు.

ఆయన తనువు త్యజించిననాడు ఉన్న ఆస్తి అంతా కొన్ని నాణాలు మాత్రమే. కొన్నింటితో అప్పుతీర్చారు. అర్థించిన పేదవారికి మరికొన్నింటిని ఇచ్చారు. దీపం వెలిగించడానికి సైతం ఇంట్లో చమురు లేదు. ప్రవక్తను తత్వవేత్త, వక్త, శాసనకర్త, యోధుడు, హేతుబద్ధ విశ్వాసాల సంస్థాపకుడు, విగ్రహరహిత ఆరాధనా బోధకుడు- అని ప్రపంచ మేధావులు, పరిశీలకులు అన్నారు. ఆయన హితబోధలు జగత్తుకు ప్రేమపూరిత విధానం నేర్పుతున్నాయి. వాటిలో కొన్ని-

స్వార్థాన్ని, అహంభావాన్ని త్యజించడం సర్వోత్తమం. సాటి మానవ సోదరుల్ని మనకన్నా తక్కువగా చూడటం మహాపాపం. ఆచరణలేని హితబోధ జీవరహితమైన కళేబరం వంటిది. స్త్రీ జాతిని గౌరవించనివారు, అనాథలను ఆదరించనివారు జగత్ప్రభువు కరుణా కటాక్షాలకు అనర్హులు. కూలివాని చెమట బిందువులు ఆరకముందే అతని వేతనం చెల్లించాలి. అన్యాయం, అవినీతితో సమ్మిళితమైన అధర్మ సంపాదన పాపభూయిష్ఠమైంది. బంధువులు, బాటసారులు, వితంతువులు, నిస్సహాయులపట్ల గౌరవంతో, దయతో వ్యవహరించాలి. వృద్ధులకు చేదోడు కావాలి. విద్యార్జన స్త్రీ పురుషులందరి అనివార్య విధి. బాధ్యతలు విస్మరించి ఇతరుల హక్కుల్ని దోచుకోవడం మహాదోషం. వినాశనాన్ని, విచ్ఛిన్నాన్ని సృష్టించడం హేయం. వక్రమైన తలపులు, వికృతమైన కోరికలు, అసమంజస దృక్పథాలు, దౌష్ట్యాలు అన్నీ వ్యక్తి జీవితాన్ని రాక్షసత్వంవైపు మళ్లిస్తాయి. శాంతి, సామరస్యాలు మట్టి పాలవుతాయి. మానవజాతి పతనానికి హేతువులవుతాయి. విద్వేషంకన్నా ప్రేమ అనంత శక్తిసంపన్నమైంది. ధనాన్ని వ్యర్థమైన కాలక్షేపాల్లో, ఆడంబరాల్లో, విలాసాల్లో వ్యయ పరచడం ఎంతమాత్రం తగదు. వేలాది ప్రజల జీవనోపాధికి అది ఉపయోగపడుతుంది.

జ్ఞానుల హృదయాలనుంచి జ్ఞానజ్యోతిని అంతమొందిస్తుంది ప్రపంచ వ్యామోహం. నీ మరణానంతరం ప్రజలకు నీ దౌర్జన్యాలనుంచి విముక్తి లభించేలా జీవితం గడపవద్దు. శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందం, సహనం- ఇవే జీవన పథాన్ని కాంతిమయం చేస్తాయి! మహాప్రవక్త కురిపించిన సమున్నత భావాల సిరిజల్లు- మానవాళిలోని మలినాన్ని తుడిచి పెట్టడానికి, ప్రేమవాహిని ఇంకిపోకుండా ఉండటానికి సమత్వ ప్రభల్ని వెలిగించడానికి.

ఎవరి హృదయం అశాంతితో రగలరాదని, ప్రతిగుండె పరోపకారం కోసం తహతహలాడాలని, జగం శుభప్రదమై శోభిల్లాలని మీలాదున్నబి మహత్తర ఆకాంక్ష.

- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా