ᐅజిజ్ఞాస




జిజ్ఞాస 

జ్ఞానం గ్రహించాలన్న కుతూహలం ఉదయించడమే జిజ్ఞాస. ఆ ఆసక్తే లేకపోతే నరుడికీ పశువుకీ తేడాయే ఉండదు. పుట్టినప్పటినుంచీ శిశువులో సహజంగానే తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది. శిశువు పెరిగినకొద్దీ, ఆ కుతూహలమూ పెరుగుతుంటుంది. శిశువు ఉత్సుకతకు భంగం వాటిల్లకుండా తగిన విషయ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ప్రసాదించి, ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల ఉత్సాహాన్ని భంగపరచకూడదు.
మానవజాతి మనుగడకు, వికాసానికి, అభ్యున్నతికి జిజ్ఞాసే పునాది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ప్రబంధాలు అన్నీ మానవజీవితంలో జిజ్ఞాస ప్రాముఖ్యాన్ని తెలియజెబుతున్నాయి.

ఆదిశంకరులు, శుకశౌనకాదులు, ధ్రువుడు, రామకృష్ణ పరమహంస, బుద్ధుడు మొదలైన వారంతా 'జిజ్ఞాస'ను ఎప్పటికప్పుడు పెంచుకున్నందువల్లనే అంతటి జ్ఞానశేఖరులు కాగలిగారు. వారంతా తమ తమ ఆచార్యులను నిరంతరం ప్రశ్నిస్తూ జ్ఞానార్జన చేసినవారే. జిజ్ఞాస కారణంగానే వారెన్నెన్నో గ్రంథాలు చదివారు. మహానుభావుల సత్సంగాల్లో పాల్గొన్నారు. గోష్ఠుల్లో పాలుపంచుకుని వినూత్న విషయాలు తెలుసుకున్నారు. తీర్థయాత్రలు చేసి ధార్మిక సూత్ర పరిజ్ఞానం ఆకళింపు చేసుకున్నారు. 'తపస్సు' చేసి తమ జిజ్ఞాసకు తగిన సత్ఫలసిద్ధి పొందగలిగారు. ఇదంతా దేనికోసం, ఎవరికోసం? లోకకల్యాణం కోసం. ధర్మసంస్థాపన కోసం. మానుషజన్మ చరితార్థత కోసం. ఏ జిజ్ఞాసతో జ్ఞానసముపార్జన చేసి మనకు వారందించారో, అదే జిజ్ఞాసను మనమూ అలవరచుకుని రేపటి తరాలకు జ్ఞానమందించవలసిన గురుతర బాధ్యత మనపై ఉంది. ఆధ్యాత్మిక విలువలనీ అలాగే అందించాల్సి ఉంది. ప్రపంచంలో మరేదేశంలోనూ లేని ఆధ్యాత్మిక సంస్కృతి మనసొంతం. దాన్ని పరిపోషించడమేకాక, పెంపొందించాల్సి ఉందన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవడం మన పరమావధి. 'జిజ్ఞాస లేనివాడు జీవచ్ఛవం' అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. వ్యర్థం, హానికరమైన అంశాల పట్ల జిజ్ఞాస ప్రమాదకరమైనది.

జిజ్ఞాస లేకపోతే జ్ఞానం పెరగదు. జ్ఞానవృద్ధి జరక్కపోతే మేధ వికసించదు. మేధ లేని నరుడు భూమికీ, జాతికీ భారమవుతాడు. జిజ్ఞాసాపిపాసికే ఆత్మజ్ఞాన ప్రాప్తి సాధ్యం. అసభ్యకరమైన విషయాలవైపు జిజ్ఞాస పోకుండా చూసుకోవడమూ అవసరమే.

సాధన, శోధన, తపన, ఆవేదన, సంకల్పం- ఇవన్నీ జిజ్ఞాసను వృద్ధిపరచుకొనేందుకు అనువైన లక్షణాలు. అవసరమనేది అన్వేషణకు నాంది. అటువంటి అన్వేషణ ప్రశ్నలు ఉదయించినప్పుడే సాధ్యం. మానవుడికి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించి, మహాజ్ఞానిగా తీర్చిదిద్దే మహిమాన్వితమైన ప్రశ్న ఒకే ఒకటి. అదే- 'నేనెవర్ని'? దానికి సమాధానం తెలుసుకోగలిగితే మానవుడు పరిపూర్ణుడే! ఆ పరిపూర్ణత్వం సిద్ధించిననాడు 'త్వమేవాహం' అనగల సమర్థుడవుతాడు. 'త్వమేవాహం' అంటే 'నీవే నేను' అని అర్థం.

జనక మహారాజు ఒకసారి జ్ఞానపిపాసతో ఓ మహర్షి ఆశ్రమానికి వెళ్లి తలుపుతట్టాడట. మహర్షి లోపలినుంచి ప్రశ్నించాడు 'ఎవరు?' అని. 'నేను' అన్నాడట జనకుడు. 'నేను' పోయిన తరవాతనే రమ్మని ఆ మహర్షి చెప్పాడట. అంటే అహంకారాన్నీ, అజ్ఞానాన్ని సూచించే ఆ పదం 'నేను' ఎంత ప్రమాదకరమైందో గ్రహించిన జనకమహారాజు ఆ క్షణంనుంచీ సర్వశాస్త్ర అధ్యయనం ప్రారంభించి, కృతకృత్యుడయ్యాడంటారు. తనను గురించి తాను తెలుసుకోగలవాడికి జీవితపరమార్థం క్షుణ్నంగా అర్థమవుతుంది. సుఖదుఃఖాల పట్ల సమదృష్టి ఉంటుంది. దూషణ భూషణ తిరస్కారాలకు, భావోద్వేగాలకు స్పందించని సులక్షణం ఆవరిస్తుంది. పుట్టిన ప్రతివాడూ గిట్టక తప్పదన్న గీతార్థసారం బోధపడుతుంది. మనోవికారాలన్నీ తొలగిపోయి హృదయ ప్రక్షాళన జరుగుతుంది. స్వార్థం, కపటం, వంచన, అవినీతి వంటి దుర్లక్షణాలన్నీ పారిపోతాయి. యాంత్రిక జీవన కశ్మలం నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. అందుకు జిజ్ఞాసను పెంచుకోవడమే ఉత్తమమార్గం!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి