ᐅవెలుగు



ᐅవెలుగు 

మొక్కలు ఆరోగ్యంగా, బలంగా ఎదిగేందుకు కర్షకుడు ఏకదీక్షగా ఎంతో శ్రమిస్తాడు. ఎరువు వేస్తాడు. నీరు పోస్తాడు. కలుపు మొక్కలు ఏరివేస్తాడు. ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కృషి సల్పుతాడు. ఇన్ని చేస్తేనే పంట చేతికి వచ్చేది.
మొక్క ఎదుగుదలకే అంత జాగ్రత్త ఉంటే, విలువైన మానవ జీవితాలకు మరెంతో జాగ్రత్త అవసరమన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. జీవనయానంలోని బాహ్య చర్యలన్నీ అంతర్గత ప్రవర్తనతో ముడివడి ఉండేవే.

అంతర్గత ప్రవర్తనలకు కేంద్రం మనసే. మనసు దృగ్గోచరం కాని ఓ మహాక్షేత్రం. సద్భావనలనే బీజాలు నాటితేనే పవిత్ర క్షేత్రంగా రూపుదిద్దుకొంటుంది. శక్తిపీఠంలా విరాజిల్లుతుంది. ప్రతిబంధకాలను, కష్టనష్టాలను, కాలుష్యాలను, వైకల్యాలను దరిచేరనీయదు. కాబట్టి మనసుకు శుద్ధ తత్వాన్ని కలిగించే సాధన దిశగా సాగాలి సాధకుడు.

రామకృష్ణులంటారు- 'ఈ శుద్ధమైన మనసు నాకు ఓ దివ్య పురుషునిలా గోచరిస్తుంది. ఆ పురుషుడు సూక్ష్మరూపంలో ఎక్కడికైనా ప్రయాణం చేస్తాడు. నాలో ఉండే మరో నల్లని ఆకారాన్ని ఎప్పుడూ శూలంతో పొడుస్తూ, నాకు సన్మార్గదర్శిగా ఉంటూనే ఉంటాడు. ఆ సూక్ష్మరూపుడి వల్ల ఏ విషయాన్నైనా అవగతం చేసుకోగలను' అని.

ఆ నల్లని ఆకారమే కామక్రోధాదులు- ఆశా పాశాలు. అటువంటి శుద్ధమైన మనసు పరమ గురువుతో సమానం. ఏది మంచో, ఏది చెడో ఎప్పటికప్పుడు ఎరుకపరుస్తూ, మనసును ఓ స్థిరబిందువు వద్ద నిలకడగా ఉంచుతుంది.

నిజానికి నూరేళ్ల జీవనయానం ఒడుదొడుకుల మయం. ఆశా పాశాలకు ఆలవాలం. ఇంటా, బైటా విరుద్ధ వర్తనలు. శత్రువులు, మిత్రులు, భయాలు, అనుభూతులు, రుగ్మతలు కలగా పులగంగా... ఎన్నో ప్రతికూలతలు!!

వీటితో మనసు రాపిళ్లకు గురవుతూనే ఉంటుంది. సద్గ్రంథ పఠనం, సజ్జన సాంగత్యం ఆత్మశోధనకు దారి తీస్తాయి. నీటిలో పెరిగే తామరకు నీటిబొట్టు సైతం అంటని విధంగా, మనసు విషయ వాంఛలకు లోబడని విధంగా- జీవన యానం సురక్షితంగా కొనసాగించేటట్లు ఆత్మశోధన దారిచూపుతుంది. ఈ ఆత్మశోధనే శుద్ధమైన మనసును పాదుకొనేలా చేస్తుంది. ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తుంది శుద్ధమైన మనసు.

సంయమ స్థితికి ఆలవాలంగా ఉంటుందది. నోటంట వెలువడే ప్రతి పలుకూ అర్థవంతంగా ఉంటుంది. ఆవేశకావేషాలకు తావుండదు. పరిణతి చెందిన ఆలోచనా విధానానికి, సర్వసమత్వ భావనలకు కేంద్రంగానూ ఉంటుంది శుద్ధత చెందిన మనసు. అపకారికి సైతం ఉపకారమే చెయ్యాలన్న గుణం ఉంటుంది.

అప్పుడు భోగంలో ఉన్నా యోగిలా ఉంటాడు మానవుడు. మనసుకు వాసనలేవీ అంటవు. లేమితనం బాధించదు. వ్యామోహాలకు అతీతుడవుతాడు. అందనివాడిగా, అంతుచిక్కనివాడిగా, అందరివాడిగా ద్యోతకమవుతాడు.

జీవితకాలం అంతా మనకు అనుకూలంగా జరిగిపోవాలనుకుంటాం. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగిపోవాలని వాంఛిస్తాం. మనోశుద్ధి గనుక పొందితే ఇది సాధ్యమే. జీవితం ఉన్నది సాధించేటందుకే.

సౌకర్యంగా, సుఖంగా బతికేందుకు సాధకుడిగా అంతరంగ వర్తనకు వెలుగు తెచ్చుకోవాలి. తాను వెలిగిపోవాలి. ఆ వెలుగే సత్యం- శివం- సుందరం.

- దానం శివప్రసాదరావు