ᐅపుష్య ప్రశస్తి



పుష్య ప్రశస్తి
 
చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. 'పుష్య' అనే మాటకు పోషణ శక్తికలిగిందని అర్థం. పుష్యమాసం మంచుకురిసే హేమంత రుతు శీతకాలం. ఒకప్పుడు జ్యోతిష సిద్ధాంతులు పుష్యమినాటి రాత్రి దూదిని మంచులో ఉంచి ఆ మర్నాడు దాన్ని పిండి ఆ ప్రక్రియలో వచ్చిన నీటి చినుకులను బట్టి వర్షనిర్ణయం చేసేవారట. ఎన్ని చుక్కలు జారితే అన్ని కుంచాల వాన కురుస్తుందని అంచనా వేసేవారు. మంచు ఆవరించి పంటలతో కళకళలాడేది పుష్యమాసమని సంస్కృత కవుల వర్ణన.
'పచ్చపూల జనప చేలకు ముత్యాల సరులు గూర్చి, మిరప పండ్లకు కుంకుమ మెరుపు తార్చి, బంతిపూవుల మొగములల్లంత విచ్చి, మన గృహమ్ముల ధాన్య సంపదలు నిల్చి సరసురాలైన పుష్యమాసమ్మువచ్చె' అంటూ పౌష్యలక్ష్మి వైభవాన్ని వర్ణించారు మన కవులు. 'రండి మాయింటికొరుపేరంటమునకు బొమ్మలెత్తును మా పిల్ల యమ్మలార ముద్దచేయాలి పూవులు ముడిచినట్టి పరమ కల్యాణి మా తల్లి పౌష్యలక్ష్మి' అంటారు పింగళి - కాటూరు కవులు.

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేది పుష్యమాసంలోనే. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించేది ఈ మాసంలోనే. సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. సంక్రాంతి గ్రామీణ రైతాంగానికి విశిష్టమైన పర్వం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి ప్రజలు దోషరహితులయ్యే పవిత్ర మాసం పౌష్యం. సంక్రాంతినాడు దధి మంథనవ్రతం చేసే ఆచారం పూర్వం ఉండేది. ఈ వ్రత విధానాన్ని జాబాలి రుషి సునాగుడనే మునికి చెప్పాడట. సంక్రాంతినాడు శివుడి ప్రతిమకు నేతితో అభిషేకం చేయాలని, నువ్వు పూలతోనూ మారేడాకులతోనూ పూజించాలనేది ఈ వ్రత విధానం. రాత్రి జాగరణ చేస్తూ 'పంచాక్షరి' జపించాలి. దధిమంథన దానంవల్ల అఖండ సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని దుర్వాసముని చెప్పగా విని ద్రోణాచార్యుడి భార్య కృపి ఈ వ్రతం ఆచరించి దారిద్య్రం నుంచి విముక్తి పొందిందని, అశ్వత్థామను పుత్రుడిగా కన్నదని ఇతిహాసం.

పుష్య శుద్ధ ఏకాదశిని 'సందైకాదశి' అని 'పుత్రనైకాదశి' అని అంటారు. సుకేతుడనే రాజు ఈ ఏకాదశినాడు ఉపవసించి వ్రతంచేసి తత్ఫలితంగా పుత్రుని పొందాడంటారు. పుష్య బహుళ ఏకాదశిని 'కల్యాణ్యేకాదశి' లేక షట్తిలైకాదశి అని అంటారు. నువ్వులను తినడం, స్నానజలంలో నువ్వులు కలపడం, తెలకపిండితో శరీరాన్ని రుద్దుకోవడం, మంచినీట్లో నువ్వులు కలపడం, తిలాదానం, తిలలతో దైవపూజ అనే ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించడంవల్ల ఈ పేరు వచ్చింది. ఈ విధులన్నీ శీత నివారక క్రియలు. ప్రకృతి సోయగాలకు, పవిత్రపర్వాలకు నెలవైన పుష్యమాసం సౌభాగ్యప్రదం.

- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు