ᐅత్యాగం
ᐅత్యాగం
'ఆయన త్యాగానికి మారుపేరు' అనే వాక్యం మనం తరచూ వింటుంటాం. 'తల్లిదండ్రులు, అన్నదమ్ముల అభ్యున్నతి కోసం పెళ్లి కూడా మానుకుని ఆ సంసారాన్ని ఒక ఒడ్డుకు చేర్చాడని కొందరి కోసం ఎందరో వ్యాఖ్యానిస్తుంటారు. శ్రీరాముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని త్యాగం చేశాడు. అన్నవెంట నడచి సొంత సుఖాలను లక్ష్మణుడు త్యాగం చేశాడు. తనకు దక్కిన రాజ్యాన్ని వదలుకొని అన్న పాదుకలతో భరతుడు పరిపాలన సాగించాడు. ధర్మరాజు బలహీనతలను సహించి భీమార్జున నకుల సహదేవులు మారు మాటాడక కష్టాలన్నీ భరించి త్యాగధనులయ్యారని చదువుకున్నాం. తండ్రి సుఖం కోసం దేవవ్రతుడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని శపథం చేసి భీష్ముడయ్యాడు.
అప్పటి సంప్రదాయాలను అనుసరించి తప్పనిసరి పరిస్థితుల్లో పరిస్థితులకు తలొగ్గి వారంతా త్యాగం చేశారా? లేక స్వతస్సిద్ధంగా గుండెలోతుల్లోంచి వచ్చిన ప్రేమ కారణంగా అలా ప్రవర్తించవలసి వచ్చిందా అన్నది చర్చనీయాంశమే! వాల్మీకి వ్యాసాదులు తమ గ్రంథాలలో కొందరి ధీరోదాత్తతను అతిశయించడంకోసం మిగిలిన పాత్రలను అంతగా పట్టించుకోలేదా అన్న ప్రశ్న సహేతుకమే. లక్ష్మణుడు అన్న వెంట అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక్క రాముడు మాత్రమే అడవులకు వెళ్లాలని కైకేయి కోరింది. మరి సౌమిత్రి ఎందుకు వెళ్లినట్లు? అదే సోదర ప్రేమ! భరతుడికి ఒప్పందం ప్రకారం రాజ్యాధికారం సంక్రమించింది. అయితే ఎక్కడో ఉన్న అగ్రజుడి వద్దకు వెళ్లి 'రాజ్యం నాది కాదు, నీది' అని అర్థించాల్సిన పని ఏముంది? వారందరూ త్యాగగుణానికి ప్రతీకలే!
స్వార్థం విడనాడి ఎదుటివారి సుఖసంతోషాల కోసం సర్వం త్యజించిన మహానుభావులు వారు. హనుమంతుడు నిజానికి సుగ్రీవుడికి బంటుగా జీవితాంతం ఉండవలసిన వ్యక్తి. కాని, మధ్యలో వచ్చిన దాశరథిని అనుసరించి 'రామబంటు'గా ప్రఖ్యాతి చెందాడు. అది సుగ్రీవుడిపట్ల తిరస్కార భావం కానేకాదు. రాముడిపట్ల అవ్యాజమైన ప్రేమ! హరిశ్చంద్రుడు, నలుడు, శ్రీరాముడు, ధర్మరాజు వంటివారు తమ సామ్రాజ్యాలను తృణప్రాయంగా త్యాగంచేసి చరితార్థులయ్యారు.
ప్రస్తుత పరిస్థితి ఏమిటి? చిన్నమాట పట్టింపు కోసం జీవితాంతం ముఖాలు చూసుకోనివారెందరో! సెంటు భూమి కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినవారు ఎందరెందరో! తన అభ్యున్నతికి అడ్డుపడ్డాడన్న కారణంగా అత్యంత విలువైన కాలాన్ని దశాబ్దాల పాటు వృథా చేసుకున్నవారెందరో... వారికి చివరకు మిగిలిందేమిటి? ఒకవేళ న్యాయస్థానంలో విజయం లభించినా... దాని ప్రభావమెంత? గెలిచిన వాడికి దక్కిందేమీ లేదు... ఓడినవాడు పోగొట్టుకున్నదీ లేదు. అంతమాత్రాన అన్యాయం జరిగితే మిన్నకుండి ఇతరులకు దాసోహం కావాలని కాదు. న్యాయం కోసం పోరాడాల్సిందే... అంతిమంగా మనకు దక్కేదేమిటి? ఎంతో విలువైన కాలాన్నీ, మనశ్శాంతినీ పోగొట్టుకున్న తరవాత లభించిన విజయం నిజంగా నిరర్థకం కాదా? ఏదో సాధించామన్న తృప్తి వెనక దాగిఉన్న విషాదం సంగతేమిటి?అందుకే జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకొమ్మని గతంలో కవులెందరో చెప్పారు. జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా తమను తాము మలచుకొని, సందర్భానుసారం ప్రవర్తించినవారే విజేతలవుతారు.
త్యాగం అంటే ఆయా సమయ సందర్భాలనుబట్టి తనను తాను నిగ్రహించుకుని ఇతరులను సంతోషపెట్టడమే! పట్టుదలకు పోతే జీవితం పట్టు తప్పుతుంది. పరితాపం మిగులుతుంది. అందుకే సహనం, సంయమనం పాటిస్తే మనందరం త్యాగధనులమే!
- కిల్లాన మోహన్‌బాబు