ᐅఅసలైన సంపద




అసలైన సంపద 

అన్ని సంపదలూ హరించుకుపోయేవే- ఒక్క ఆధ్యాత్మిక సంపద తప్ప. శాశ్వతమైనది, సత్యమైనది, జ్ఞానప్రపంచాన్ని ఆవిష్కరింపజేసేది ఒక్క ఆధ్యాత్మిక సంపదే. ఈ సంపద కలిగినవారే నిజమైన భాగ్యశీలురు.
వస్తువాహనాదులు, ధనరాశులు, మేడలు, మిద్దెలు శరీర సౌఖ్యానికి. మనోమయ ప్రపంచాన్ని ప్రకాశింపజేసి జీవన పరమార్థాన్ని అందించేది ఆధ్యాత్మిక సంపదే. దానివల్ల- చీకటి మూలలు ప్రకాశవంతమవుతాయి. దుర్వాసనాభరితాలన్నీ సుగంధ పరిమళాలవుతాయి. దానవత్వం దైవత్వంగా విరాజిల్లుతుంది. స్వార్థం మాయమవుతుంది. స్థితప్రజ్ఞత ఆయుధంగా నిలుస్తుంది. తోడుగా ఉంటుంది.

భౌతిక, శారీరక వ్యవహార పోషణాదులకు అవసరమయ్యే ద్రవ్యం ఓ చిన్న జీవితోపకరణం మాత్రమే. కానీ అదే లోకమైంది. జీవిత ధ్యేయంగా మారిపోయింది. మహావృక్షం మాదిరి వేళ్లూనుకొని ఉంది.

ధనార్జనే జీవితలక్ష్యమై- అవసరాన్ని మించిన సంపాదన ముందుగా మురిపిస్తుంది. వ్యామోహపరుస్తుంది. మైమరపిస్తుంది. నువ్వే మా రాజు వంటుంది. అహంకారాన్ని, దర్పాన్ని తట్టి లేపుతుంది.

మనసులాగానే ధనానికీ చంచలత్వం ఎక్కువ. నిలకడలేనిది ఇట్టే బులిపించి మాయమవుతుంది. ఇంద్రభోగాల్లో తేలుతున్న ఉత్తర క్షణాల్లోనే గరీబును చేస్తుంది. బికారిగా వీధిన పడేస్తుంది. సువర్ణ సౌధాలు పేకమేడలవుతాయి. ముంచెత్తిన భ్రమలు వీడాక భారమైన బతుకునే 'తలరాత'గా మార్చేస్తుంది. దీనికి మూలభావన ఏమిటి?

'పులి మీదైనా స్వారీ చెయ్యి- ధనార్జనే ధ్యేయం... అదే జీవితం!' అన్న గాఢమైన దుగ్ధ నరనరాల్లో జీర్ణించుకుపోవడమే.

ఆపై వ్యసనాలు, వ్యామోహాలు ఉండనే ఉన్నాయి.

బిడ్డ కడుపులో పడిన నాటినుంచే ఖరీదైన విద్యనందివ్వాలన్న తహతహ. విద్య పరమార్థం ధనార్జనే అన్న ఆలోచన. సాధించే తెలివితేటలు ధనార్జనకే ఉపయోగపడాలన్న ఏకైక లక్ష్యం. ప్రయోజకులయ్యేందుకు మంచిదే. కానీ తెలివితేటలు వక్రమార్గం పడితే?

విద్యతోపాటు సంస్కారాన్ని అందివ్వాలన్న ఆలోచన ఆచరణ ముఖ్యం. నిజానికది నేడు లుప్తమైపోతోంది.

సంస్కారం అంటే కేవలం- ప్రవర్తనా నిబంధనలు, నియమావళులు నేర్పడమేనా? కానే కాదు.

చెడును దహించివేసే అగ్నితత్వాన్ని- మనో కాలుష్యాలను, వైకల్యాలను తుడిచివేసే జలతత్వాన్ని- అనంతమైన విశ్వంలోని 'విశ్వాత్మ'తత్వాన్ని- మేలైన గుణాల పొందికలో, వ్యాప్తిలో వాయుతత్వాన్ని క్షమ-ఓర్పు-ఉనికి-కార్యభారం-సకల జీవరాశులకు ఆధారభూతమైన భూ తత్వాన్ని రంగరించుకొని ఉంటుంది సంస్కారం. ఈ పాంచభౌతిక తత్వాలూ విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని ఇచ్చేందుకు ఉపకరించే మహోపకరణాలు- శీలసంపదను పెంచే తత్వాలు. ఆధ్యాత్మిక సంపదను ఆర్జించుకునే తత్వాలు ఇవి.

మానవుడు మాధవుడయ్యేందుకు ఉపకరించే సాధనాలు. శీలం ఎప్పుడైతే సులక్షణ సమన్వితమవుతుందో- అప్పుడు భగవత్‌తత్వాన్ని ఆకళింపు చేసుకుంటుంది. ఇహపరమైన భోగభాగ్యాలు, సిరిసంపదలు తృణప్రాయమనిపిస్తాయి. ఆనాటినుంచే ఆధ్యాత్మిక ఖజానా పెరిగిపోతుంది. ఎవ్వరూ దోచుకోలేని సంపద అది. చిత్తశాంతిని ప్రసాదించే మహా సంపద అది. పూర్ణ మానవుడిగా అవతరించేందుకు ఉపయుక్తమయ్యే సంపద.

చరిత్రలో ఛత్రపతి శివాజీ ఇందుకు నిదర్శనం.

తల్లి జిజియాబాయి ఉగ్గు పాలతోటే నీతి, న్యాయం, ధర్మం, సంస్కృతి, పురాణేతిహాసాల సారాన్ని అందించింది. కనుకనే హిందూ ధర్మరక్షకుడయ్యాడు. స్త్రీలను మాతృమూర్తులుగా గౌరవించాడు. భారతీయ సంస్కృతిని కాపాడాడు. కాళికాదేవి అనుగ్రహప్రాప్తి పొందిన పరాక్రమవంతుడయ్యాడు.

ఈ భరతభూమిలో సత్య, జ్ఞాన, ధర్మాలను బోధించే పీఠాలు- వేద సంస్కృతీ పరిరక్షణార్థం నెలకొని ఉన్నాయి. అందులో చిన్న ప్రాయంలోనే పీఠాధిపత్యం పొందిన భగవత్ స్వరూపులూ ఉన్నారు.

ఆ మహనీయుల్లో ఉన్న సంస్కార వైభవం వారిని అంతటి ఉన్నతస్థాయిలో ఉంచిందని మరవరాదు.

జీవన వ్యాపారులు బాధ్యతలు నిర్వహించాల్సిందే. 'ఆధ్యాత్మిక సంపద' ఒనగూర్చుకునే దిశగా జీవనయానం సాగాలని మరవరాదు. అదే అసలైన సంపదగా గుర్తెరగాలి.

- దానం శివప్రసాదరావు