ᐅమంచితనం
ᐅమంచితనం
మానవ జీవితాలను తరచి చూస్తే మంచివారికే ఎక్కువ కష్టాలు కలుగుతాయనిపిస్తుంది. పాపం మూట కట్టుకుంటున్న వాళ్లెందరో అష్త్టెశ్వర్యాలతో తులతూగుతుంటే పుణ్యానికి పోయేవారి బతుకులు అష్టకష్టాల పాలబడుతున్నట్లు అనిపిస్తుంది!
బహుశా చెడ్డవాళ్ళు ఎలాగా చెడ్డవాళ్ళయి సంస్కరణకు సంసిద్ధులు కారు కనుక మంచిదారిన పడవేసే పరీక్షలు వారికి ఎదురుకావేమో! మంచివాళ్లకే మానవాతీతులు కాగల శక్తి సామర్థ్యాలు ఉండి ఉంటాయి కనుక దేవుడు పెట్టే పరీక్షలన్నీ వాళ్లకేనేమో!
రాపిడి లేనిదే వజ్రాలు మెరవవు. నిప్పుతో కాల్చనిదే బంగారం శుద్ధి కాదు. కష్టాలను ఎదుదుర్కోనిదే మంచితనం రాణించదు! సమస్యలు మానసిక శక్తిని పెంచుతాయి. ప్రయాసతోనే ఓర్పు లభిస్తుంది. మంచి మనుషులకది వరప్రసాదమవుతుంది!
భీష్మద్రోణులిద్దరికీ కౌరవులు, పాండవులూ సమానమే. నిజానికి వారు అభిమానించింది ఎక్కువగా పాండవుల్ని. అందుకు కారణం పాండవుల మంచితనం; పెద్దలపట్ల వారికి ఉన్న భక్తి, గౌరవం, వినయం, అభిమానం. భీష్మద్రోణులు మాత్రమే కాదు, వారికెదురుపడిన ప్రతి ఒక్కరూ పాండవుల శ్రేయాన్ని చిత్తశుద్ధితో ఆకాంక్షించేవారు.
విరాటరాజు పాండవులకు తన కొలువులో ఆశ్రయమివ్వటానికి కారణం వారి మంచితనం చూసే. ఒక రాజసూయ యాగాన్ని చేసి చక్రవర్తి అయిన ధర్మరాజు, విరాటుడి దగ్గర సేవకుడిలా ఉంటూ అతణ్ని తన మంచితనంతో మెప్పించగలిగాడు. విరాటుడి సభలో కీచకుడు ద్రౌపదిని అవమానించినప్పుడు భీముడు కోపాగ్ని జ్వాలతో రగిలిపోయాడు. కాని, తమ అజ్ఞాతవాస రహస్యం బయటపడకూడదని ధర్మరాజు తన విజ్ఞతతో అతణ్ని ఆపగలిగాడు. అటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా అన్నగారి మాటను భీముడు పాటించాడంటే, అది కేవలం అతని మంచితనం వల్లనే! ఒక చక్రవర్తికి మహారాణి అయిన ద్రౌపది ఒక చిన్న రాజయిన విరాటుడి అంతఃపురంలో అతని రాణి సుధేష్ణ దగ్గర దాసిగా పని చేయటానికి ఎలాంటి సంశయమూ పెట్టుకోలేదంటే- అది ఆమె మంచితనం. అలాగే, అర్జునుడు, నకుల సహదేవులూ ఆ రాజు కొలువులో పనివారుగా అన్ని ఇబ్బందుల్నీ చిరునవ్వుతో సహించారంటే అది ముమ్మాటికీ వారి మంచితనం వల్లనే!
మనిషికి మంచితనం ఉండటం ఎంతో ముఖ్యం. ఏ మనిషికైనా గొప్పపేరు తెచ్చేది ఆ మంచి గుణమే! ఎక్కడైనా రాణించడానికి తోడ్పడేది కేవలం మంచితనం మాత్రమే. ఆ మంచితనంతోనే అజ్ఞాతవాసాన్ని పాండవులు విజయవంతంగా పూర్తిచేయగలిగారు!
- తటవర్తి రామచంద్రరావు