ᐅతామసి- 'తా'మసి!
ప్రాణికోటిలో అత్యంత దుర్లభమైన మానవ జన్మను మహా ప్రసాదంగా పొందిన మనం అనుక్షణం అంతర్వీక్ష చేసుకుంటూ, మనను మనం తెలుసుకుంటూ, అర్థం చేసుకోకపోవడం వల్లనే ఎన్నో అనర్థాలను మనకు తెలీకుండానే పరోక్షంగా ఆహ్వానించుకుంటున్నాం. మనలో సహజంగా ఉన్న చిన్ని ఆశను దురాశగా మార్చుకుని విశృంఖలంగా ఎదుటివాడిని దోచుకునే ప్రవృత్తికి దాసోహమంటున్నాం. ప్రలోభాలకు వ్యామోహాలకు బానిసలమైపోతున్నాం. అవకాశవాదమే వేదమన్న భ్రమలో పడిపోయాం.
ధర్మం తప్పినవాడి కర్మలన్నీ దుష్కర్మలే. అందుకే పెద్దలు సుఖశాంతిమయమైన జీవన విధానానికి కొన్ని సూత్రాలు, సూచనలు ప్రతిపాదించారు. గొప్ప గ్రంథాలు రచించి అందించారు. అపౌరుషేయాలైన వేదాలు మనకు సమృద్ధమైన జ్ఞానాన్ని అనాదిగా అందిస్తూనే ఉన్నాయి. వీటినుంచి మంచిని గ్రహించే తీరిక మనకు లేదు, గ్రహించినా ఆచరించే ఓపికా లేదు. ఎంతోకొంత జ్ఞానాన్ని, వివేకాన్ని గ్రహిస్తే దాన్ని అకృత్యాలకే అపవ్యయం చేస్తున్నాం. మనంచేసే దుష్కర్మలను సమర్థించుకుంటూ, కప్పిపుచ్చుకొంటూ ఎదుటివారిలోని 'చెడు'ను విమర్శించే వృత్తిలో తలమునకలవుతున్నాం. చెడ్డవాడే చెడునెప్పుడూ వెదికే పనిలో మునిగిపోతాడు. వాడికి తన దోషం ఆవగింజంతగాను, ఇతరుల ఆవగింజంత తప్పు పర్వతమంతటిగాను గోచరిస్తుంది.
ప్రకృతినుంచి పుట్టే సత్వరజస్తమస్సులనే త్రిగుణాలు దేహిని దేహంలో బంధిస్తున్నాయి. వీటిలో సత్వగుణం ప్రకాశం చేత, నిర్మలత్వం చేత, సుఖజ్ఞానాసక్తులు కల్పించి బంధిస్తుంది. సజ్జనుల్లో, శిష్టుల్లో సత్వగుణం ఆవిష్కృతమై మహోన్నత దిశకు, దశకు పథనిర్దేశనం చేస్తుంది. శరీరమంతా జ్ఞాన తేజస్సుతో నింపేది సత్వప్రాబల్యం. జీవించినంతవరకు ఉదాత్తుడుగా, శాంతమూర్తిగా, సహనశీలిగా, సంయమ నియమవ్రతుడిగా, వికారాతీతుడిగా జీవిస్తాడు. రజోగుణం రాగాత్మకమై కర్మాసక్తిని కల్పించి బంధిస్తుంది. బుద్ధి జాడ్యం, జడత్వం, ప్రమాదాలను కలిగిస్తుంది. వేర్వేరుగా కనిపించే సర్వభూతాల్లోని ఆత్మలు వేరువేరుగా ఉన్నాయని, ఉంటాయని భావించేవాడి జ్ఞానం రాజసజ్ఞానం. ఫలాభిలాషతో, అహంకారంతో, అధికప్రయాసతో ఆచరించే కర్మ రాజసకర్మ. కేవలం ధర్మార్థకామాలపట్ల అభిలాష, అభిమానం, ఫలాపేక్ష కలిగివుండే ధైర్యం రాజసధైర్యం. మొదట అమృతతుల్యంగా ఉండి చివరికి విషంగా మారే సుఖం; విషయాలు, ఇంద్రియాల కలయికవల్ల కలిగేది రాజససుఖం. ధర్మాధర్మాలను, కార్యాకార్యాలను సక్రమంగా తెలుసుకోలేని బుద్ధి రాజసబుద్ధి. ఇక తామసగుణం. ఇది ఇవాళ లోకంలో పుష్కలంగా కనిపిస్తుంది. లక్షకో కోటికో ఒకడు తామసి కాదు. అటువంటివాడికో నమస్కారం. 'గీతాకారుడు' సత్వ, రజగుణాలను గురించి పైవిధంగా తెలిపాక తమోగుణం ప్రభావం మానవ జాతిపైన ఎంత ఘోరంగా పడుతున్నదో కూడా వివరించాడు. మానవ జాతియావత్తు ఇవాళ తమోగుణాన్ని ఆశ్రయించి, తామస దుష్ప్రవృత్తికి బానిసై ఎంతటి అధోగతి పాలవుతున్నదో వర్ణించలేం. వాసుదేవుడీ తామస అవలక్షణాలనిలా విపులీకరించాడు- అసలైన తత్వం తెలుసుకోకుండా, తాను నమ్మినదే నిజమైన తత్వమనే సంకుచిత దృక్పథంతో వాదించేవాడి జ్ఞానం తామసజ్ఞానం. సాధక బాధకాలను ముందుగా ఊహించకుండా, తన సామర్థ్యమేమిటో కూడా అవగాహన లేకుండా గుడ్డిగా అవివేకంతో ఆరంభించేకర్మ తామసకర్మ. మనోనిగ్రహం, వినయం, వివేకం లేకుండా ద్రోహబుద్ధితో, దుష్టస్వభావంతో, నిరాసక్తతతో, వృధాకాలయాపనతో చేసే కర్మ తామసకర్మ. అజ్ఞానాహంకారాలతో ధర్మాన్ని అధర్మంగా, న్యాయాన్ని అన్యాయంగా, సత్యాన్ని అసత్యంగా వక్రీకరించి వాస్తవానికి విరుద్ధంగా, విపరీతంగా వితండవాదన చేసే బుద్ధి తామసబుద్ధి. నిద్ర, భయం, దుఃఖం, విషాదం, మదం- వీటిని అంటిపెట్టుకుంటూ చూపే ధైర్యం తామస ధైర్యం. నిద్ర, బద్ధకం, ప్రమాదాలవల్ల నిరంతరం వ్యామోహంలో పడేసే సుఖం తామస సుఖం.
'తమస్సు' అంటే అర్థం చీకటి. తమస్సునుంచి వచ్చిందే 'తామసం'. తామసి అనగా అంధకారంలోనే నిరంతరం ఉండేవాడు. అంధకారం అజ్ఞానానికి ప్రతీక. తామసి అయినవాడు సమయాసమయాలు, ఉచితానుచితాలు గ్రహించడు. మద్యమాంసాలు లేకపోతే తామసికి రోజు గడవదు. గుణత్రయ విభాగయోగంలో తామస ప్రవృత్తిని వర్ణిస్తూ వాసుదేవుడిలా ఇంకా చెబుతాడు- 'తామ'సికి ధర్మం, న్యాయం, సత్యం, సమయం, సదాచారం, శుచి, శుభ్రత- వీటిమీద నమ్మకం ఉండదు. మూర్ఖత్వం వాడి పెట్టుబడి, నశ్వరసుఖం వాడి ఫలాపేక్ష. వాడి నిఘంటువులో ప్రేమ, ఉపకారం, అహింస లాంటి పదాలే ఉండవు. వాడి నరనరాల్లో స్వార్థం, అవకాశవాదం, భీరుత్వం, అహంకారాలతో కూడిన స్వార్థం జీర్ణించుకుని ఉంటాయి. వాడి వాదనలో నాస్తికత్వం విశృంఖలమై విజృంభిస్తూంటుంది. అందుకే తామసి 'తా'మసి అన్నారు. అంటే తామసి అయినవాడు తనకుతానే మసి అయిపోతాడనీ, చరిత్రహీనుడిగా మిగిలిపోతాడనీ తాత్పర్యం. సాత్వికులు ఎంతో అన్వేషిస్తేకాని లభించరు. రాజసికులు బాగానే కనిపిస్తారు. తామసికులు అడుగడుగునా అగుపిస్తారు.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి