ᐅవీరారాధన



వీరారాధన 

మాతృభూమిని రక్షించుకునే యత్నంలో నేలకొరిగిన వీరుల చరితలను ఎన్నటికీ మరువలేం. వారి త్యాగాలు చిరస్మరణీయం. దేశప్రజల ధన మాన ప్రాణ రక్షణే పరమావధిగా ఎంచి అసువులు బాసిన వీరసైనికుల శౌర్య, ధైర్య పరాక్రమాలు ఆరాధ్యనీయం.
జన్మనిచ్చిన గడ్డపై విదేశీ దుష్టమూకలు కాలుమోపే ప్రయత్నంచేస్తే వారు సింహాలై గర్జిస్తారు. నిప్పులు కురిపించే అగ్నినేత్రులే అవుతారు. ఆ శౌర్యంలో దుష్ట శిక్షణ చేసే భగవదంశ ఉంది. ధర్మసంస్థాపన గావించే దైవీ సంకల్పం ఉంది. వీరారాధన భగవతారాధనే. గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు కదనరంగంలో కిరీటిని కార్యోన్ముఖుణ్ని చేస్తూ- 'ఎక్కడైతే వీరుల పరాక్రమం ప్రకాశిస్తుందో- ఆ ప్రకాశం నేనే... నన్నుగా భావించు' అని ఉద్బోధిస్తాడు.

శ్రీరామచంద్రుడు రావణాసురుడితో తలపడేవేళ శత్రువు శౌర్యాన్ని ప్రశంసిస్తాడు. మహాభారతంలో ద్రోణాచార్యుడు ఎదుటివారు పగవారైనా, వారి శౌర్యధైర్యాలను ప్రశంసించడం రాజధర్మమంటాడు. వీరత్వం పొందే ఉన్నతమైన స్థానం అది. మనభారతంలో వీరత్వాన్ని ఆరాధించటం సంస్కృతిలో భాగమే. పర్వదినాలకు ఎంతటి ఆంతర్యం, అర్థం ఉంటాయో- 'వీరారాధన' పట్లకూడా అంతే అంతరార్థం ఉంది. ఆ భావన కేవలం ఆయా రోజులకే పరిమితమై ఉండకూడదు. ఆ స్ఫూర్తి నిరంతరాయంగా హృదయాంతరాళాల్లో నిలిచిపోవాలి.

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన పల్నాటి వీరుల యుద్ధం 'వీరారాధన'కు ఓ దృష్టాంతంగా ఇప్పటికీ నిలుస్తుంది.

చాపకూటి సిద్ధాంత కర్త, సమతావాది, విష్ణ్వాంశ సంభూతుడు బ్రహ్మనాయుడు. శివారాధకురాలు, స్త్రీ శక్తికి ప్రతిరూపం- నాయకురాలు నాగమ్మ. ఏడున్నర ఘడియల మంత్రిత్వంతో గురజాల నలగామరాజు కొలువులో ప్రవేశించి- తన ప్రతిభాపాటవాలతో మంత్రిత్వాన్ని సుస్థిరం చేసుకొంటుంది. వీరిరువురి నేతృత్వంలో దాయాదుల పోరు కారంపూడిలో ప్రారంభమవుతుంది. నాటి రణక్షేత్రం కారంపూడి నాగులేటి ఒడ్డు. యుద్ధంలో పల్నాటి యోధులందరూ నేలకొరుగుతారు. వికలమనస్కుడైన బ్రహ్మనాయుడు గుత్తికొండ బిలంలో తపోసమాధికి చేరగా- వైరాగ్య చింతనతో నాగమ్మ రాజ్యం విడిచి వెళ్ళిపోతుంది.

ఆ పల్నాటి యోధులగాథలు నేటికీ పల్లెపల్లెనా వినిపిస్తూ ఉంటాయి. 'వీరులగుడి' నిర్మించారు. వారు వాడిన ఆయుధాలకు ప్రతి ఏటా వీరారాధనోత్సవాలు నిర్వహించడం పరిపాటి. వీరాచారవంతులు పలు జిల్లాల నుంచి వచ్చి, వైభవోపేతంగా జరిగే వేడుకల్లో పాల్గొంటారు. పల్నాటి వాసులందరికీ గొప్పవేడుకగా ఉంటుంది ఆ వీరారాధన. మహాభారతగాథను పోలి ఉంటుందీ పల్నాటి గాథ. శౌర్యధైర్యాలు విజయసాధనకు వెన్నెముక వంటివి. నేడు రాజులు, రాజరికాలు, యుద్ధాలు లేవు. ఇప్పుడు ప్రజలే ప్రభువులు. పాలకులు నియంతల్లా వ్యవహరిస్తే- ప్రజలే సైనికుల్లా విజృంభించి, నియంతల కోటలను బదాబదలు చేయడం మనం చూస్తున్నదే. మానవుడు ధీరత్వం కలిగి ఉండాలి. శారీరకంగా, మానసికంగా బలాఢ్యుడై ఉండాలి.

పిరికితనాన్ని, సోమరితనాన్ని వీడి ధృడచిత్తులై సంకల్పాలను సిద్ధింపజేసుకోవాలి. తమలోని అంతర్గత శక్తులను వెలికితీయాలి. బుద్ధిబలంతో అవాంతరాలను ఎదుర్కొని విజయధ్వజాలను ప్రతిష్ఠింపజేసుకుంటూ సాగిపోవాలి.

వీరారాధనలోని పరమార్థం ఇదే!

- దానం శివప్రసాదరావు