ᐅధ్రువతారలా వెలగాలి
ᐅధ్రువతారలా వెలగాలి
జీవితమన్నాక మానవుడికి కష్టాలెదురు కాకుండా ఉండవు. రోగాలూ వస్తాయి. ముసలితనం మెల్లమెల్లగా మీద పడుతుంది. తుదకు చావుల తల్లి చల్లగా వచ్చి తెలియని ఏ లోకానికో తన్నుకు పోతుంది- కటువైన ఈ మాటల వెనక కాదనలేని యథార్థం గోచరిస్తుంది. మానవుడు శాశ్వతుడు కాడు అనే విషయాన్ని ఈ మాటలు విశదం చేస్తున్నాయి.
నిజమే, మానవుడు అశాశ్వతుడు. మర్త్యుడు. మర్త్యుడు అంటే చావు కలిగినవాడు అని అర్థం. మట్టిలో కలిసిపోయేవాడు, మృత్యుతత్వం కలవాడు, మరణం కలవాడు అని అర్థం.
మిగతా ప్రాణుల్లోలేని బుద్ధి తనలో ఉంది గనుక కష్టాల్ని రోగాల్ని జరామరణాల్ని మానవుడు అనుభవం ద్వారా తెలుసుకుంటున్నాడు. తదనుగుణంగా స్పందిస్తున్నాడు. కష్టాలు కలగకుండా ప్రయత్నిస్తున్నాడు. రోగాల్ని ఔషధసేవనం ద్వారా దూరం చేస్తున్నాడు. ముసలితనాన్ని దరి చేరనివ్వకుండా మనసును ఉత్సాహంగా, తాజాగా నిత్యనూతనంగా ఉంచుకొంటున్నాడు. అంతేకాదు, మృత్యువునూ తొందరగా తన దగ్గరికి రానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
భార్యాబిడ్డలు తదితర బంధువర్గం, ఇల్లూవాకిలి, సంపద- అంతా అశాశ్వతమని మానవుడికి తెలియదా? తెలుసు. అయినప్పటికీ మానవుడు తాను, తన కుటుంబ సభ్యులు హాయిగా ఉండాలని భావించి సంపాదిస్తున్న దానితో తృప్తి చెందక అనుచిత రాబడి కోసం అర్రులు చాస్తూ అక్రమ మార్గంలో పరుగులు పెడుతున్నాడు. ఈ ప్రవృత్తిని విడిచిపెట్టి మానవుడు సరైన దారిలో పయనించాలి. తనకోసం ఇతరులకు నష్టాన్ని కష్టాన్ని కలిగించడం మానుకోవాలి.
తనకోసం ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న మానవుడు తాను స్వయంగా ఇతరులకు ఆ కష్టనష్టాలు కలిగించకూడదనే విషయాన్ని విస్మరించరాదు. తన ప్రమేయం లేకుండానే పరులకు ఈ బాధలు కష్టాలు సంభవిస్తే వాటిని దూరం చేయడానికి మానవుడు వెనకాడకూడదు. సంసిద్ధుడు కావాలి. సాయపడాలి. ఈ మంచి గుణమే మానవత్వమనిపించుకుంటుంది. మానవత్వం ఉన్న వ్యక్తి భౌతికంగా మరణించినా అతని కీర్తి మాత్రం లోకంలో ఎల్లకాలం అమరమై విలసిల్లుతుంది.
దేవతల రక్షణార్థం దేవేంద్రుడికి వజ్రాయుధంగా తన వెన్నెముకనిచ్చిన దధీచి మహర్షి, జరామరణ రోగాలు ప్రజలకు లేకుండా చేయాలన్న తపనతో కానలకేగి తపస్సు చేసి అహింస భూతదయతో కూడిన కరుణ సందేశాన్ని లోకానికందించిన గౌతమబుద్ధుడు, దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు, ప్రజల కడగండ్లు దూరం చేయడంలోనే అసువుల్ని బాసిన అహింసావాది బాపూజీ మొదలైన వారంతా మానవులే. వారంతా తమ ఆదర్శాలతో కీర్తికాయులై కలకాలం అందరి మన్ననలు అందుకొంటున్నవారే. మనం కూడా అలాంటి శాశ్వతత్వాన్ని, అమరత్వాన్ని అందుకోవడానికి సఫలప్రయత్నం చేద్దాం.
- కాలిపు వీరభద్రుడు