ᐅవిశ్వాసం
ᐅవిశ్వాసం
భగవంతుడిపట్ల విశ్వాసం ఉన్నప్పుడే ఆయన్ని చేరే దారులు తెలుసుకోగలం. ఆత్మవిశ్వాసం దృఢంగా ఉన్నప్పుడే సాధనా మార్గంలో ముందుకు కదులుతాం. మామూలు జీవితంలానే ఉన్నత శిఖరాలు ఆరోహించడానికి విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి. భక్తులకు, సత్పురుషులకు విశ్వాసం ఉచ్ఛ్వాసం వంటిది, నిశ్వాసం వంటిది. నిజానికి విశ్వాసమే వారికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. మనలో మనకు విశ్వాసం లేకపోతే భగవంతుడిలో విశ్వాసం పోగొట్టుకొన్నట్లే.
అనంతమైన ఆశకు పునాది అనంత విశ్వాసమే. అవి రెండూ ఉన్నప్పుడు అనంతమైన ఆకాంక్ష మనలో ప్రదీప్తమవుతుంది. ఎంతో ఆదర్శవంతమైన జీవితానికి ఈ ఆకాంక్ష మూలస్తంభం వంటిది.
ఆత్మవిశ్వాసం లేనివారు ఎప్పుడూ నిరాశానిస్పృహలతో జీవిస్తారు. వారే పనీ చేయలేరు. దేన్నీ సాధించలేరు. వారెప్పుడూ దుఃఖిస్తూనే ఉంటారు. వారి జీవితాలు బాధాగ్ని పుస్తకాలు. అందులో ప్రతి అక్షరం కన్నీటి బిందువే. ఒక్కక్షణం మనలో పూర్ణ విశ్వాసం వికాసం చెందితే నిరంతర స్వేచ్ఛ ఆత్మకు లభించినట్లే. అప్పుడు ఏ బాధలు, ఆందోళన, నైరాశ్యం ఉండవు. విశ్వాస తీరాల్లో దృఢంగా నిలబడగలవారికి విజయం సూర్యకిరీటంలా చేరువవుతుంది. సత్యం కిరణంలా తాకుతుంది. ఆనందం సముద్రమై ముంచెత్తుతుంది. విశ్వాసమే మతం. విశ్వాసానికి మించిన మతంలేదు. విశ్వాసమే దైవం, అదే జీవం. అదే సర్వం. ఆత్మనిశ్శబ్ద కాగితంపై భగవానుడు చేసిన చేవ్రాలు విశ్వాసం. సమస్తాన్ని జయించగల ధీమా ఆత్మకు ఉంది. అది మనలోనే ఉంది!
చీకటి తెరలవెనక దాగిన ఉషస్సు గురించి గానంచేసే విహంగం విశ్వాసం. విశ్వాసం అత్యున్నత స్థాయికి చెందిన జ్ఞాన ప్రకాశం. అది ప్రేమద్వారా, హృదయం ద్వారా ప్రబోధితమవుతుంది. ఈ జ్ఞానాన్ని మనం అపార్థం చేసుకోవడంవల్ల దాన్ని ప్రతిఘటిస్తాం. ఆ వింత పిలుపునకు మనం ప్రతి స్పందించం. విశ్వాసం ముందు హేతువు తలవంచుతుంది. అది అందించే స్వేచ్ఛకు హేతువు విస్తుపోతుంది.
విశ్వాసం మనిషిలో అత్యున్నత భూమికకు చెందిన ఒక దివ్య కాంక్ష. చాలామంది ఆ స్థాయి అందుకోలేరు. ఎవరూకూడా ఆ రేఖ దాటి వెళ్లలేరు. సందేహం ఒక వ్యధ. అది ఏకాంతం. తన కవల సోదరుడైన విశ్వాసాన్ని ఏనాడూ తెలుసుకోలేదు.
మనిషి అంతర్గత జీవితంలో రెండే రెండు విశిష్ట కోణాలున్నాయి. జీవిత పరమార్థం కోసం అన్వేషణ మొదటిది. శాశ్వతమైన దానికోసం గవేషణ రెండోది. ఈ రెండింటి వైపు నడిపేది విశ్వాసమే. విశ్వాసం భగవంతుడితో తీయని, మాయని బాంధవ్యం చివురింపజేస్తుంది. ఎవరికి వారికి తాను ఉత్కృష్ట వ్యక్తిననే భావన కలుగుతుంది.
మనం పరిస్థితుల ఉక్కు చక్రాల కింద పడి నలిగిపోయే కీటకాలు కాము. కీలుబొమ్మలం కాము. పరిస్థితులను ఎదిరించి జీవన గమ్యాన్ని మార్చి నవ్య దివ్య ప్రపంచాన్ని నిర్మించగల స్రష్టలం!
-కె.యజ్ఞన్న