ᐅమధుర భక్తితత్వం తిరుప్పావై




మధుర భక్తితత్వం తిరుప్పావై 

మార్గశిరమాసంలో ఆచరించే ధనుర్మాస వ్రతం అతి ప్రధానమైన శ్రీవైష్ణవ ధర్మం. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించి మకర సంక్రాంతి పండుగ దాకా ఉండే ఈ నెలరోజులూ అతి పవిత్రమైన ధనుర్మాస వ్రతదినాలు. పూర్వం భూదేవి అంశతో గోదాకన్య దక్షిణ దేశంలో అవతరించి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి జీవన్ముక్తి సాధించినట్లు శ్రీరామానుజ వైభవం చెబుతోంది. తిరుప్పావై అంటే మధుర కీర్తనతో సేవించే శ్రీవ్రతం. ధనుర్మాస వ్రతాన్ని సిరినోము అనీ పిలుస్తారు. ఒకప్పుడు కన్యలు శ్రీమహావిష్ణువే తమకు భర్తగా కావాలనే కోరికతో ఈ వ్రతాన్ని ఆచరించేవారు. శ్రీలక్ష్మితో సమానమైన స్థానాన్ని ఆశించి నోచే నోము కనుక సిరినోము అయింది. మృగశీర్షా నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఈ మాసంలోనే వస్తుంది. అందుకే ఈ ముప్ఫై రోజుల కాలాన్నీ మార్గశీర్షమని సంబోధిస్తారు. ధనుర్మాసం, మార్గశీర్షం రెండూ ఒకటే. చాంద్రమానాన్ని అనుసరించి మనకు మార్గశీర్షమైతే, సౌరమానాన్నిబట్టి ధనుర్మాసం అవుతుంది.
భువిపైన మన సంవత్సరాన్ని దివిలో ఒకరోజుగా లెక్కించే దేవతలకు మార్గశీర్షం బ్రహ్మ ముహూర్తమంటారు. అంటే, సూర్యోదయానికి ముందు తొంభైఆరు నిమిషాలు. తిరుప్పావై వ్రత సమయం సరిగ్గా ఇదే! ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవనాదమని అర్థం. ధనుస్సునుంచి వచ్చే టంకారమే ఓంకారనాదానికి మూలం. ఈ నాదాన్ని గానంగా చేసుకొని సంకీర్తనం చేయడంవల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు. నిజానికి ఈ ధనుర్మాస వ్రతఫలం ఇదే!

ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్యకాలంలో ఆండాళ్ పదిహేను సంవత్సరాలు జీవించి ఉందని ఆళ్వార్ల చరిత్ర తెలుపుతోంది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే పరమ వైష్ణవ భక్తుడికి ఆమె తులసివనంలో లభించిందని చెబుతారు. పెంచిన తండ్రి విష్ణుచిత్తుడు పరమార్థం తెలిసిన భక్తుడు. తన పదేళ్ల వయసునాటికే గోదాదేవి భక్తిసారాన్ని మొత్తం ఆకళింపు చేసుకొంది. తండ్రితోపాటే తానూ పూలమాలలు కట్టి ముందు తాను ధరించి తరవాత వటపత్రశాయి కంఠాన్ని అలంకరింపజేసేది. శ్రీవిల్లిపుత్తూర్‌లో నేటికీ ఈ వటపత్రశాయి కోవెలను దర్శించవచ్చు. 'అమ్మా! ఆ దైవం నీ భర్త కాదు కనుక ఆ మూర్తి కంఠంలో మాల వేయకూడదు' అని విష్ణుచిత్తుడు వారిస్తే- పద్నాలుగు సంవత్సరాల గోదాదేవి ఆ దైవం తన భర్తే అని బదులిచ్చింది. ఆ తరవాత ఒంటరిగా గర్భగుడిలోకి ప్రవేశించిన ఆ కన్య దైవం ముందు నిలబడి 'నన్ను పెళ్లాడవా?' అంటూ ప్రశ్నించిందట. వెంటనే గోదాదేవికి దివ్యహస్త స్పర్శకలిగి పులకించిందంటారు. ఆనాడే స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి- 'పూర్వం గోపికలు ఆచరించిన కాత్యాయనీ వ్రతం చేయి. ప్రతిరోజూ మధురభక్తి పాశురాలను(గీతాలను) ఆలపించి ముప్ఫై రోజులు దీక్షచేయి. సూర్యుడు మకరంలోకి ప్రవేశించిన నాడే మన వివాహం!' అని ఆదేశించాడని కథ. ఆ వ్రతం ఆచరిస్తూ ఆండాళ్ నిత్యం గానం చేసిన ముప్ఫై పాశురాలనే తిరుప్పావై అంటారు.

'మార్గళిత్తింగళ్ మది నిరైంద సన్నళాల్ నీరాడప్పోదువీర్' అంటూ ప్రారంభించింది గోదాదేవి తన మార్ఘళి వ్రతాన్ని. ఈ పాశురాలన్నీ మధురభక్తికి తార్కాణాలు. ఒక్కొక్క పాశురం పరతత్వానికి ప్రతీక. హృదయమే కేంద్రంగా చేసుకొని వ్రతం చేసిన ఆండాళ్‌ను ఆధ్యాత్మిక యోగినిగా వర్ణించాడు ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు.

ఇరవై ఏడో పాశురంలో ఆండాళ్ శ్రీమన్నారాయణునిలో తన ఐక్యాన్ని కాంక్షిస్తుంది. 'కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా...'' అని ఎలుగెత్తి- లోకం మెచ్చేదీ తాను పొందేదీ అయిన ఐక్యత కావాలని అడుగుతుంది. ఈ పాశురంలో గోదాకన్యలోని సాత్విక లక్షణాలు కనపడతాయి. భగవంతునిపై ప్రేమతో కంఠం గద్గదంగా మారి శిరస్సు వినమ్రంగా వంచి తన జడపైని పూలను ప్రదర్శిస్తూ ఆనందధామాన్ని ఈ పాశురంలో కోరుతుంది. తిరుప్పావై రచించిన ఆండాళ్- పన్నెండుగురు ఆళ్వార్లలోని ఒకే ఒక స్త్రీ! ప్రేమోన్మాద ఫలితమైన మధురభక్తికి తిరుప్పావై మార్గదర్శకం చేస్తుంది. ద్రవిడంలో ఈ గీతాలను దైవీవాక్కులంటారు. భగవంతుడి శబ్దమయ స్వరూపంగా ఆరాధించే ఈ తిరుప్పావై ద్రవిడ వేదం- ధనుర్మాసంలో అన్ని వైష్ణవాలయాల్లో వేకువనే మార్మోగుతూ భక్తులను రాగరంజితం చేస్తుంది.

- అప్పరుసు రమాకాంతరావు