ᐅమేరీమాత ఉత్సవాలు



ᐅమేరీమాత ఉత్సవాలు 

తండ్రి బాధ్యత పరిమితం, తల్లి పాత్ర అనుక్షణం. తన పిల్లలకు ప్రేమ పంచే విషయంలో తల్లి పేదరాలు కాదు. తాను అన్నిచోట్ల ఉండలేక తనకు మారుగా దేవుడు తల్లిని సృష్టించాడని ఆధ్యాత్మికులు అంటారు. అలాంటి దేవుడినే కన్నతల్లి ఎంత గొప్పది? ఆ తల్లి తన గర్భఫలాన్ని సమస్త మానవాళికి జీవఫలంగా ఇవ్వడం ఎంతటి అద్భుత విషయం. ఆ మహిమాన్వితురాలు ఎవరో కాదు, సిలువపై సమస్త మానవాళి పాపపరిహారం కోసం బలి అయిన క్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన మేరీమాత. బాల్యంనుంచి దేవుడి సమక్షంలో పెరిగి పెద్దదైన మేరీమాత, లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువుకు తల్లి అయింది.
15, 16 శతాబ్దాల్లో ఐరోపాలో సంభవించిన యుద్ధాల ఫలితంగా ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారు. తమకు సాంత్వన కలిగించే తల్లిగా భావించి మేరీమాతను పూజించడం ఆనాటి నుంచే మొదలైందని చరిత్రకారులు అంటారు. విజయవాడలోని గుణదలలో ప్రకృతిసిద్ధంగా వెలసిన కొండగుహలవద్ద 1925లో 'ఫాదర్ ఆర్లతి' అనే బోధకుడు మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1971నాటికి ఆ పరిసర ప్రాంతం ప్రసిద్ధ మేరీమాత ఆలయంగా రూపుదిద్దుకుంది. గుణదలలో ఏటా జనవరి 31నుంచి మేరీమాత ఉత్సవాలు నవదిన ప్రార్థనలతో మొదలవుతాయి. ఫిబ్రవరి 9-11 తేదీల మధ్య మూడురోజులపాటు జరిగే ఉత్సవాలకు ప్రపంచం నలుమూలలనుంచి లక్షలాది భక్తులు విచ్చేస్తుంటారు.

మేరీమాతను కొన్ని ప్రాంతాల్లో 'నిష్కళంక మాత'గా, 'అమలోద్భవి'గా, 'వ్యాకులమాత'గా భక్తులు స్మరిస్తున్నారు. మేరీమాత తన తల్లి గర్భంనుంచే జన్మపాపం లేకుండా రక్షణ పొందిందని, పరిశుద్ధాత్మ శక్తివల్ల గర్భం ధరించి ప్రభువైన ఏసుక్రీస్తుకు జన్మనిచ్చిందని చెబుతారు. అందువల్ల ఆధ్యాత్మికులు ఆమెను 'నిష్కళంక మాత'గా కీర్తించారు. పదమూడో శతాబ్దంలో 'స్కౌతుస్' అనే ప్రబోధకుడు ఆమెను 'అమలోద్భవి'గా పేర్కొన్నాడు.

మేరీమాతను భక్తులు వ్యాకులమాతగా స్మరించడానికి కారణం ఆమె తన జీవితంలో ఏడుసార్లు అత్యంత వ్యాకులతతో ఆవేదన చెందడమే. ఈ విషయాన్ని సువార్తీకులు బైబిలు లేఖనాల్లో పేర్కొన్నారు. క్రీస్తు జన్మించిన ఎనిమిదో రోజు ఆయనను దేవాలయంలో కానుకగా అర్పించినప్పుడు ఆమె వ్యాకులపడింది.

పసివాడైన బాల ఏసుకు అప్పటి రాజు హేరోదునుంచి ఎదురయ్యే ముప్పునుంచి తప్పించేందుకు మేరీమాత, తన భర్త యేసేపుతో ఈజిప్టునకు ప్రయాణమయ్యే సందర్భంలోనూ ఆమె ఎంతో ఆవేదన చెందిందని అంటారు. ఏసు పన్నెండు సంవత్సరాల వయసులో యెరుషలేము దేవాలయంలో తప్పిపోయినప్పుడూ ఆ తల్లి హృదయం ఎంతో క్షోభపడింది. ఏ పాపమూ చేయని క్రీస్తు ప్రభువును ఇద్దరు దోషుల మధ్య ఉంచి సిలువ వేసినప్పుడు ఆ తల్లి ఎంతో వ్యాకులతకు గురైంది.

సైనికుల హింసాత్మక చర్యలతో రక్తసిక్తమైన ఆయన దేహాన్ని తన ఒడిలో పడుకోబెట్టినప్పుడు ఆ తల్లి బాధతో దుఃఖించింది.

ఆయన చనిపోయినప్పుడు ఆ పరిశుద్ధ శరీరాన్ని శిష్యులు సమాధిలో ఉంచినప్పుడు ఆ తల్లి అంతులేని దుఃఖంతో వ్యాకులత చెందింది.

ఏసు పుట్టుకనుంచి పునరుత్థానం వరకు మేరీమాత ఎన్నో దుఃఖాలను, వేదనలను భరించింది. అయినా దేవునిపై అత్యంత విశ్వాసంతో, ధైర్యంగా ముందుకు సాగింది. ఆమె దృఢచిత్తం, ఆత్మస్త్థెర్యం ఆదర్శప్రాయమైనవి. అవే ఆమెను జగన్మాతగా అందరికీ ఆరాధనీయురాలైన మహిమాన్విత మాతగా ఉన్నత శిఖరంపై అధిష్ఠింపజేశాయి.

మేరీమాత ఉత్సవాలకు హాజరవుతున్న ప్రతీ భక్తుడు, భక్తురాలు బాల్యంలో తమ తల్లులు చూపిన ప్రేమ, ఆప్యాయతలను మేరీమాతను తిరిగి దర్శించడం ద్వారా అనుభూతి చెందుతారు. ఆ భావనతోనే కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు ఉత్సవాలకు విచ్చేసి, మేరీమాత దీవెనలు పొందుతారు. అలా మేరీమాత ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

- డాక్టర్ ఎమ్.సుగుణరావు